Share News

తల్లిదండ్రులను కోల్పోయి.. డిప్రెషన్‌లోకి వెళ్లి!

ABN , Publish Date - Aug 10 , 2024 | 06:41 AM

‘త్రివర్ణ పతాకం గుర్తుతో కూడిన జెర్సీని ధరించడం నాకెంతో గర్వంగా ఉంటుంది. అందుకే బౌట్‌లో దిగిన ప్రతిసారీ అత్యుత్తమ ప్రదర్శన చేసి దేశం గర్వపడేలా చేస్తా..’

తల్లిదండ్రులను కోల్పోయి.. డిప్రెషన్‌లోకి వెళ్లి!

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

‘త్రివర్ణ పతాకం గుర్తుతో కూడిన జెర్సీని ధరించడం నాకెంతో గర్వంగా ఉంటుంది. అందుకే బౌట్‌లో దిగిన ప్రతిసారీ అత్యుత్తమ ప్రదర్శన చేసి దేశం గర్వపడేలా చేస్తా..’

ఈ మాట అన్నది భారత యువ రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌. అలా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు కాబట్టే రెజ్లింగ్‌లో ప్రవేశించిన అనతికాలంలోనే ఒలింపిక్స్‌ కాంస్య పతకం సహా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మరపురాని విజయాలు అందుకున్నాడు. 21 ఏళ్లకే విశ్వ క్రీడల్లో పతకం నెగ్గే స్థాయికి ఎదిగిన అమన్‌ బాల్యం విషాదమయం. హరియాణాలోని ఝాజ్జర్‌ జిల్లా బిరోహార్‌ గ్రామం అమన్‌ స్వస్థలం. 11 ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు సోమ్‌వీర్‌ సెహ్రావత్‌, కమలేష్‌ సెహ్రావత్‌లను కోల్పోయాడు. దాంతో అమన్‌, అతడి చెల్లి పూజా సెహ్రావత్‌ ఆలనాపాలనను తాతయ్య సుధీర్‌ సెహ్రావత్‌ చేపట్టాడు. తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర డిప్రెషన్‌కు లోనైన అమన్‌ కోలుకున్నాడంటే అందుకు అతడి నానమ్మ మంగేరామ్‌ సెహ్రావతే కారణం. అమన్‌కు చిన్నతనం నుంచే రెజ్లింగ్‌పట్ల ఎంతో అనురక్తి. ఊరిలో జరిగే బురద కుస్తీ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు. 2012 ఒలింపిక్స్‌లో సుశీల్‌ కుమార్‌ రజత పతకం గెలవడం అమన్‌లో రెజ్లింగ్‌పట్ల మరింత స్ఫూర్తి రగిల్చింది. అది గమనించిన అతడి తాతయ్య ఢిల్లీలోని ప్రఖ్యాత ఛత్రశాల్‌ స్టేడియంలో చేర్పించాడు. కోచ్‌ లలిత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కొద్ది సమయంలోనే రాటుదేలిన సెహ్రావత్‌ 2021లోనే తొలి జాతీయ టైటిల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. పట్టుదల, అంకితభావం, అద్భుత నైపుణ్యాల ఆలంబనగా రెజ్లింగ్‌లో తన కెరీర్‌కు బాటలు వేసుకొన్న అమన్‌ 2022లో అండర్‌-23 వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. తద్వారా ఈ టోర్నమెంట్‌లో పసిడి పతకం చేజిక్కించుకున్న తొలి భారత రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆపై 2022 ఆసియా క్రీడల్లో పురుషుల 57 కిలోల విభాగంలో కాంస్య పతకం చేజిక్కించుకొని సత్తా చాటాడు. తదుపరి ఏడాది ఆస్థానా వేదికగా జరిగిన ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో స్వర్ణ పతకంతో అబ్బురపరిచాడు. ఇదే ఊపులో జాగ్రెబ్‌ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఆ టోర్నీలోచైనాకు చెందిన ఝౌ వాన్‌హావోను 10-0తో చిత్తు చేసి విజేతగా నిలవడం 21 ఏళ్ల అమన్‌ అద్భుత నైపుణ్యాలకు తార్కాణం. ఇక..తాను ఆరాధ్య రెజ్లర్‌ రవి దహియాకు షాకిచ్చిన అమన్‌ ఒలింపిక్‌ బెర్త్‌ పట్టేయడం విశేషం.

Updated Date - Aug 10 , 2024 | 06:41 AM