Share News

India vs Pakistan: క్రికెట్ ప్రపంచానికి షాక్.. భారత్ vs పాక్ మ్యాచ్ చూశాక అధ్యక్షుడు మృతి

ABN , Publish Date - Jun 10 , 2024 | 07:43 PM

క్రికెట్ ప్రపంచంలో ఓ విషాదం చోటు చేసుకుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) అధ్యక్షుడు అమోల్ కాలే (47) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అమెరికాలో నసావు కౌంటీ వేదికగా..

India vs Pakistan: క్రికెట్ ప్రపంచానికి షాక్.. భారత్ vs పాక్ మ్యాచ్ చూశాక అధ్యక్షుడు మృతి
MCA President Amol Kale Dies Of Heart Attack

క్రికెట్ ప్రపంచంలో ఓ విషాదం చోటు చేసుకుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) అధ్యక్షుడు అమోల్ కాలే (47) (Amol Kale) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అమెరికాలో నసావు కౌంటీ వేదికగా భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించిన తర్వాత ఆయన మృతి చెందినట్లు తెలిసింది. ఈ మ్యాచ్‌ను ఎంసీఏ సెక్రటరీ అజింక్యా నాయక్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సూరజ్ సమత్‌లతో కలిసి చూసిన ఆయన.. మైదానంలో ఉన్నంతసేపు హుషారుగానే కనిపించారు. కానీ.. హోటల్‌కు వెళ్లిన తర్వాత ఆయనకు తీవ్రమైన గుండెనొప్పి వచ్చినట్లు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. దీంతో.. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో కుటుంబంలో, ఎంసీఏలో విషాదఛాయలు అలుముకున్నాయి.


అమోల్ కాలే చరిత్ర

2022 అక్టోబర్‌లో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం భారత మాజీ ఆటగాడు సందీప్ పాటిల్, అమోల్ కాలే పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో అమోల్ గెలుపొందడంతో.. ఆయన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అతని పదవీకాలంలో.. 2024-25 దేశవాళీ సీజన్‌లో ముంబై సీనియర్స్ ఆటగాళ్ల ఫీజును రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఆయన ఆధ్వర్యంలోనే ముంబై జట్టు 2023-24 సీజన్‌లో రంజీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని నెలకొల్పడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు కూడా ఆయన అత్యంత సన్నిహితుడు. దేశీయ రెడ్ బాల్ క్రికెట్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం గురించి అమోల్ కాలే ఎప్పుడూ మాట్లాడుతుండేవారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 10 , 2024 | 07:44 PM