Share News

IPL SRH VS DC : రన్‌రైజర్స్‌

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:00 AM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి మరో విధ్వంసకర ప్రదర్శన. ఈసారి ఆ జట్టు బ్యాటర్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ బలైంది. తమ చివరి మ్యాచ్‌లో గుజరాత్‌ను 89 పరుగులకే ఆలౌట్‌ చేసిన డీసీ బౌలర్లను...

IPL SRH VS DC : రన్‌రైజర్స్‌

నేటి మ్యాచ్‌లు

కోల్‌కతాX బెంగళూరు మ.3.30, గం. నుంచి

పంజాబ్‌X గుజరాత్‌, రాత్రి 7.30, గం. నుంచి

ఢిల్లీపై ఘనవిజయం

పోరాడిన ఫ్రేజర్‌

నటరాజన్‌కు 4 వికెట్లు

హెడ్‌, షాబాజ్‌, నితీశ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌

టాస్‌ గెలిచిన ప్రత్యర్థి సన్‌రైజర్స్‌కు బ్యాటింగ్‌కు ఆహ్వానించడం.. కసితీరా చితక్కొట్టించుకోవడం పరిపాటయ్యింది. ఇప్పటికే 277, 287 పరుగుల రికార్డు స్కోర్లతో మోతెక్కించిన రైజర్స్‌ ఈసారి 266 పరుగులతో కాస్త శాంతించింది. కానీ ఆరంభంలో హెడ్‌, అభిషేక్‌ విధ్వంసం చూస్తే స్కోరు 300-350 కూడా సాధ్యమయ్యేలా అనిపించింది. ఎందుకంటే.. ఓవర్‌కు 20 పరుగుల చొప్పున పవర్‌ప్లేలోనే 125 పరుగులతో వామ్మో అనేలా ఆడారు. మధ్య ఓవర్లలో నెమ్మదించినా.. చివరకు ఎస్‌ఆర్‌హెచ్‌ అలవోకగా 250 దాటేసింది. ఇక డీసీ ఛేదనలో ఫ్రేజర్‌ ఒక్కడే ఆకట్టుకోగా, కెప్టెన్‌ పంత్‌ తన బ్యాటింగ్‌ తీరుతో నిరాశపర్చడంతో ఓటమి తప్పలేదు

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి మరో విధ్వంసకర ప్రదర్శన. ఈసారి ఆ జట్టు బ్యాటర్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ బలైంది. తమ చివరి మ్యాచ్‌లో గుజరాత్‌ను 89 పరుగులకే ఆలౌట్‌ చేసిన డీసీ బౌలర్లను ట్రావిస్‌ హెడ్‌ (32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 89), అభిషేక్‌ శర్మ (12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 46) తమ ఊచకోతతో చేష్టలుడిగేలా చేశారు. ఆ తర్వాత రికార్డు ఛేదనలో డీసీ ఆరంభం బాగున్నా.. ముగింపులో తేలిపోయింది. పేసర్‌ నటరాజన్‌ (4/19) కెరీర్‌ బెస్ట్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన హైదరాబాద్‌ 10 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ జట్టుకిది వరుసగా నాలుగో విజయం. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. షాబాజ్‌ అహ్మద్‌ (29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 నాటౌట్‌), నితీశ్‌ కుమార్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) సహకరించారు. కుల్దీ్‌పనకు 4 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఢిల్లీ 19.1 ఓవర్లలో 199 రన్స్‌కు ఆలౌటైంది. ఫ్రేజర్‌ (18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 65), అభిషేక్‌ (22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 42) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా పంత్‌ (44) ఫర్వాలేదనిపించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హెడ్‌ నిలిచాడు.

ఫ్రేజర్‌ ఒక్కడే..: కష్టసాధ్యమైన ఛేదనలో ఢిల్లీకి మెరుపు ఆరంభమే లభించింది. యువ బ్యాటర్‌ ఫ్రేజర్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో రైజర్స్‌కు వణుకు పుట్టించాడు. కానీ వికెట్లు కాపాడుకోలేకపోవడం డీసీని దెబ్బతీసింది. వాస్తవానికి 12 ఓవర్ల దాకా పోటీలోనే ఉన్నా ఛేదన వైపు సాగలేకపోయింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ పృథ్వీ షా వరుసగా 4 ఫోర్లతో స్పిన్నర్‌ సుందర్‌కు స్వాగతం పలికాడు. కానీ ఐదో బంతికే దొరికిపోయాడు. ఆ వెంటనే మరో ఓపెనర్‌ వార్నర్‌ (1).. భువీకి చిక్కాడు. ఈ స్థితిలో ఫ్రేజర్‌-పోరెల్‌ జోడీ చెలరేగింది. ముఖ్యంగా మూడో ఓవర్‌లో ఫ్రేజర్‌ 4,4,6,4,6,6తో 30 పరుగులతో డీసీని జోష్‌లో నింపాడు. అలాగే ఐదో ఓవర్‌లో అతడి 4,6.. పోరెల్‌ 4,4తో మరో 20 రన్స్‌ వచ్చాయి. 15 బంతుల్లోనే ఫ్రేజర్‌ ఫిఫ్టీ పూర్తి చేయడం విశేషం. వీరి ధాటికి పవర్‌ప్లేలో జట్టు 88/2 స్కోరుతో నిలిచింది. కానీ ఏడో ఓవర్‌లో ఫ్రేజర్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదినా.. మార్కండే అతడిని అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత నెమ్మదిగా ఢిల్లీ పోటీలో నుంచి తప్పుకోసాగింది. పోరెల్‌ 8వ ఓవర్‌లో 4,4,6,4తో 22 రన్స్‌ సాధించి రన్‌రేట్‌ తగ్గకుండా చూశాడు. కానీ మార్కండే మరోసారి షాకిస్తూ పోరెల్‌ వికెట్‌ తీయడంతో రైజర్స్‌ ఆధిపత్యం చూపింది. క్రీజులో హిట్టర్లు పంత్‌, స్టబ్స్‌ (10) ఉండడంతో సంచలన ఫలితం వస్తుందని ఆశించినా నిరాశే ఎదురైంది. 9-15 ఓవర్ల మధ్య వీరి నుంచి కనీసం ఒక్క సిక్సర్‌ కూడా రాలేదు. ముఖ్యంగా పంత్‌ భారీ షాట్లు ఆడడంలో ఇబ్బందిపడ్డాడు. స్టబ్స్‌ను నితీశ్‌, లలిత్‌ (7)ను నటరాజన్‌ అవుట్‌ చేయగా 166/6తో డీసీ పోరు నామమాత్రమే అయ్యింది. 19వ ఓవర్‌లో నటరాజన్‌ 3 వికెట్లు తీయగా, చివరి ఓవర్‌ తొలి బంతికి పంత్‌ను నితీశ్‌ అవుట్‌ చేయడంతో ఢిల్లీ ఆలౌటైంది.

బౌలర్ల దిమ్మతిరిగేలా..: 19, 21, 22, 21, 20, 22.. తొలి ఆరు ఓవర్లలో సన్‌రైజర్స్‌ ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ సాగించిన విధ్వంసమిది. ఐపీఎల్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఆటతీరుతో ఈ ఇద్దరూ బ్యాట్లతో చెలరేగిన విధానం అద్భుతః అనిపించింది. ఈ దెబ్బకు పవర్‌ప్లేలోనే రైజర్స్‌ 125 పరుగులు సాధించి ఔరా అనిపించేలా చేసింది. బౌలర్‌ ఎవరైనా ఆకాశం వైపు చూడడంతోనే సరిపోయింది. చక్కటి బ్యాటింగ్‌ వికెట్‌తో పాటు బౌండరీల విస్తీర్ణం కూడా తక్కువగానే ఉండడంతో ఈ ఇద్దరూ పండగ చేసుకున్నారు. కానీ పవర్‌ప్లే తర్వాత రైజర్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ను డీసీ బౌలర్లు కట్టడి చేయగలిగారు. తొలి ఓవర్‌లోనే హెడ్‌ 6,4,4,4తో జరుగబోయే ఊచకోతను ఢిల్లీ బౌలర్లకు గుర్తుచేశాడు. రెండో ఓవర్‌లో తను 6,6,4 బాదగా.. మూడో ఓవర్‌లో నోకియాను 4,4,0,4,4,6తో బెదరగొట్టాడు. అటు 16 బంతుల్లోనే అతడి ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. మరో ఎండ్‌లో స్పిన్నర్లు లలిత్‌, కుల్దీ్‌పలను లక్ష్యంగా చేసుకుని అభిషేక్‌ అలవోకగా సిక్సర్లు కొట్టడంతో స్కోరు 5 ఓవర్లలోనే రికార్డు స్థాయిలో 103కి చేరింది. ఇక ఆరో ఓవర్‌లో హెడ్‌ 4,4,4,4,0,6 బాదడంతో ఈసారి పేసర్‌ ముకేశ్‌ బలయ్యాడు. మరోవైపు ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ (13 బంతుల్లో) హాఫ్‌ సెంచరీని అభిషేక్‌ అధిగమిస్తాడనిపించింది. కానీ ఏడో ఓవర్‌లో అతడిని కుల్దీప్‌ అవుట్‌ చేయడంతో ఈ పరుగుల తుఫాన్‌ నుంచి డీసీకి అతి పెద్ద రిలీఫ్‌ లభించింది. అదే ఓవర్‌లో మార్‌క్రమ్‌ (1) వికెట్‌ను కూడా తీశాడు. స్పిన్నర్‌ అక్షర్‌ తర్వాతి ఓవర్‌లో రైజర్స్‌కు ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. కుల్దీప్‌ మరో ఓవర్‌లో డేంజరస్‌ హెడ్‌ వికెట్‌ తీయడంతో ఢిల్లీ సంబరాల్లో మునిగింది. అలాగే క్లాసెన్‌ (15) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో రైజర్స్‌ 131/0 నుంచి 151/4కి చేరింది. ఈ దశలో మరో వికెట్‌ కోల్పోకుండా నితీశ్‌, షాబాజ్‌ కుదురుగా ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో ముందుకు సాగడంతో 14.5 ఓవర్లలోనే స్కోరు 200కి చేరింది. ఈ దశలో కుల్దీప్‌ మరోసారి మ్యాజిక్‌ చూపుతూ జోరు మీదున్న నితీశ్‌ను అవుట్‌ చేశాడు. దీంతో ఐదో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత షాబాజ్‌ చెలరేగి 19వ ఓవర్‌లో రెండు, సమద్‌ ఓ సిక్సర్‌తో 20 పరుగులు వచ్చాయి. ఇక ఆఖరి ఓవర్‌లో సమద్‌ (13), కమిన్స్‌ (1) వెనుదిరిగినా షాబాజ్‌ 4,4,6తో 28 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేసి జట్టును 260 పరుగులు దాటించాడు.

స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: హెడ్‌ (సి) స్టబ్స్‌ (బి) కుల్దీప్‌ 89, అభిషేక్‌ శర్మ (సి) అక్షర్‌ (బి) కుల్దీప్‌ 46, మార్‌క్రమ్‌ (సి) అక్షర్‌ (బి) కుల్దీప్‌ 1, క్లాసెన్‌ (బి) అక్షర్‌ 15, నితీశ్‌కుమార్‌ (సి) వార్నర్‌ (బి) కుల్దీప్‌ 37, షాబాజ్‌ (నాటౌట్‌) 59, సమద్‌ (సి) నోకియా (బి) ముకేశ్‌ 13, కమిన్స్‌ (రనౌట్‌) 1, వాషింగ్టన్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 266/7; వికెట్ల పతనం: 1-131, 2-133, 3-154, 4-154, 5-221, 6-250, 7-256; బౌలింగ్‌: ఖలీల్‌ 3-0-51-0, లలిత్‌ 2-0-41-0, నోకియా 3-0-31-0, కుల్దీప్‌ 4-0-55-4, ముకేశ్‌ 4-0-57-1, అక్షర్‌ 4-0-29-1.

ఢిల్లీ: పృథ్వీ షా (సి) సమద్‌ (బి) వాషింగ్టన్‌ 16, వార్నర్‌ (సి) కమిన్స్‌ (బి) భువనేశ్వర్‌ 1, ఫ్రేజర్‌ (సి) క్లాసెన్‌ (బి) మార్కండే 65, పొరెల్‌ (స్టంప్డ్‌) క్లాసెన్‌ (బి) మార్కండే 42, స్టబ్స్‌ (సి) షాబాజ్‌ (బి) నితీశ్‌ 10, పంత్‌ (సి) నటరాజన్‌ (బి) నితీశ్‌ 44, లలిత్‌ (బి) నటరాజన్‌ 7, అక్షర్‌ (సి) కమిన్స్‌ (బి) నటరాజన్‌ 6, నోకియా (బి) నటరాజన్‌ 0, కుల్దీప్‌ (ఎల్బీ) నటరాజన్‌ 0, ముకేశ్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 19.1 ఓవర్లలో 199 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-16, 2-25, 3-109, 4-135, 5-154, 6-166, 7-199, 8-199, 9-199, 10-199; బౌలింగ్‌: వాషింగ్టన్‌ 2-0-46-1, భువనేశ్వర్‌ 4-0-33-1, కమిన్స్‌ 4-0-35-0, నటరాజన్‌ 4-1-19-4, మార్కండే 2-0-26-2, షాబాజ్‌ 1-0-22-0, నితీశ్‌కుమార్‌ 2.1-0-17-2.

మరోసారి 250పైగా స్కోరు

ఐపీఎల్‌లోనే కాదు.. టీ20 ఫార్మాట్‌లోనే పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు (125) చేసిన జట్టుగా సన్‌రైజర్స్‌. అలాగే ఈ లీగ్‌ తొలి పది ఓవర్లలో ఎక్కువ పరుగులు (158/4) చేసిన జట్టుగానూ నిలిచింది. ఐపీఎల్‌ చరిత్రలో అతి వేగంగా వంద పరుగులు (5 ఓవర్లలో) పూర్తి చేసిన జట్టు కూడా ఇదే.

1

రైజర్స్‌ తరఫున వేగం (16 బంతుల్లో)గా 50 పరుగులు చేసిన బ్యాటర్‌గా అభిషేక్‌తో సమంగా నిలిచిన హెడ్‌. అలాగే పవర్‌ప్లేలో ఎక్కువసార్లు (3) 50+ స్కోర్లు సాధించిన రెండో బ్యాటర్‌గా హెడ్‌.

1

ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఎక్కువ సార్లు (3) 250+ స్కోర్లు చేసిన జట్టుగా సర్రేతో సమంగా నిలిచిన రైజర్స్‌

1

ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో తమ అత్యధిక సిక్సర్ల (22) రికార్డును మరోసారి సమం చేసిన రైజర్స్‌.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 7 6 1 0 12 0.677

హైదరాబాద్‌ 7 5 2 0 10 0.914

కోల్‌కతా 6 4 2 0 8 1.399

చెన్నై 7 4 3 0 8 0.529

లఖ్‌నవూ 7 4 3 0 8 0.123

ముంబై 7 3 4 0 6 -0.133

ఢిల్లీ 8 3 5 0 6 -0.477

గుజరాత్‌ 7 3 4 0 6 -1.303

పంజాబ్‌ 7 2 5 0 4 -0.251

బెంగళూరు 7 1 6 0 2 -1.185

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

Updated Date - Apr 21 , 2024 | 04:03 AM