SRH vs RCB: సన్‌రైజర్స్ బ్యాటర్ల ఊచకోత.. ఆర్సీబీ ముందు కొండంత లక్ష్యం
ABN , Publish Date - Apr 15 , 2024 | 09:23 PM
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించింది. ఆర్సీబీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ.. బౌండరీల వర్షం కురిపించారు.
ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా.. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bengaluru) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించింది. ఆర్సీబీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ.. బౌండరీల వర్షం కురిపించారు. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి, ఆర్సీబీ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఇదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై 277 పరుగులు చేసి హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచిన సన్‌రైజర్స్.. ఇప్పుడు తన రికార్డ్‌ని తానే తిరగరాసింది.
ముఖ్యంగా.. ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. బెంగళూరు బౌలర్లపై శివాలెత్తాడు. ఎడాపెడా షాట్లతో తాండవం చేశాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే ఊచకోత మొదలుపెట్టిన ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడు.. కేవలం 41 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్సుల సహకారంతో 102 పరుగులు చేశాడు. అతనితో పాటు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ సైతం.. క్రీజులో ఉన్నంతవరకు మెరుపులు మెరిపించాడు. 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సుల సహకారంతో 34 పరుగులు చేశాడు. ఇక అభిషేక్ ఔట్ అయ్యాక వచ్చిన క్లాసెన్.. ఎప్పట్లాగే మాస్ ఇన్నింగ్స్‌తో దుమ్ముదులిపేశాడు. తొలుత క్రీజులో కుదుర్కునేందుకు కొంత సమయం తీసుకున్న అతడు.. ఆ తర్వాతి నుంచి పరుగుల మోత మోగించాడు. 31 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్సుల సహకారంతో 67 పరుగులు చేశాడంటే.. ఎలా రప్ఫాడించాడో మీరే అర్థం చేసుకోండి.
చివర్లో మార్క్‌రమ్‌తో పాటు అబ్దుల్ సమద్ కూడా.. తామూ ఏం తక్కువ తినలేదన్నట్టు అదరగొట్టేశాడు. ఒకరికి మించి మరొకరు పోటీ పడి మరీ బౌండరీల మోత మోగించేశాడు. సమద్ కేవలం 10 బంతల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయగా.. మార్క్‌రమ్ 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సుల సహకారంతో 32 పరుగులు చేశాడు. ఇలా సన్‌రైజర్స్ బ్యాటర్లందరూ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం వల్ల.. ఆ జట్టు చారిత్రాత్మక స్కోరుని నమోదు చేయగలిగింది. మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగలిగింది. మరి.. అంత భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేధించగలుగుతుందా? లేదా? అన్నదే వేచి చూడాలి.