T20 South Africa vs Bangladesh : దక్షిణాఫ్రికా హ్యాట్రిక్
ABN , Publish Date - Jun 11 , 2024 | 05:00 AM
టీ20ల్లో దక్షిణాఫ్రికాపై తొలిసారిగా గెలిచే సువర్ణావకాశాన్ని బంగ్లాదేశ్ చేజార్చుకుంది. కేవలం 114 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చివర్లో చతికిలపడింది. సఫారీ బౌలర్లు మాత్రం ఆఖరి బంతి
4 రన్స్‌తో బంగ్లాదేశ్‌పై గెలుపు
సూపర్-8 బెర్త్ దాదాపు ఖరారు
న్యూయార్క్: టీ20ల్లో దక్షిణాఫ్రికాపై తొలిసారిగా గెలిచే సువర్ణావకాశాన్ని బంగ్లాదేశ్ చేజార్చుకుంది. కేవలం 114 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చివర్లో చతికిలపడింది. సఫారీ బౌలర్లు మాత్రం ఆఖరి బంతి వరకు పట్టు వీడకపోవడంతో 4 పరుగులతో గెలిచి ఊపిరిపీల్చుకుంది. గ్రూప్ ‘డి’లో భాగంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్ ఫలితంతో సౌతాఫ్రికా ప్రస్తుతం మూడు విజయాలు, ఆరు పాయింట్లతో టాప్‌లో ఉంది. దీంతో సఫారీలు సూపర్-8లోనూ దాదాపు చోటు ఖాయం చేసుకున్నట్టే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 113 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ క్లాసెన్ (46), మిల్లర్ (29), డికాక్ (18) మాత్రమే రాణించారు. తన్‌జీమ్ హసన్‌కు మూడు, టస్కిన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులకే పరిమితమైంది. హ్రిదయ్ (37), మహ్ముదుల్లా (20) ఆకట్టుకున్నారు. కేశవ్ మహరాజ్ మూడు.. నోకియా, రబాడ రెండేసి వికెట్లు పడగొట్టారు.
చివర్లో తడబాటు: బంగ్లా టాపార్డర్ విఫలం కావడంతో 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే తౌహీద్ హ్రిదయ్ జట్టును విజయం వైపు నడిపించే ప్రయత్నం చేశాడు. అతడికి మహ్ముదుల్లా సహకరించగా, ఇద్దరూ వీలైనప్పుడల్లా బౌండరీలతో ఆకట్టుకున్నారు. కానీ 18వ ఓవర్‌లో రబాడ 2 పరుగులే ఇచ్చి హ్రిదయ్‌ను అవుట్ చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఇక చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సి రాగా, స్పిన్నర్ కేశవ్ రెండు వికెట్లు తీసి 6 పరుగులే ఇవ్వడంతో బంగ్లాకు నిరాశ తప్పలేదు.
ఆదుకున్న మిల్లర్-క్లాసెన్: నసౌ ట్రాక్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండగా.. టాస్ గెలిచిన సఫారీలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో బంగ్లా పేసర్లు చెలరేగి 23 పరుగులకే ఓపెనర్లు హెన్‌డ్రిక్స్ (0), డికాక్, మార్‌క్రమ్ (4), స్టబ్స్ (0)ల పనిబట్టారు. పేసర్ తన్‌జీమ్ హసన్ ఇందులో మూడు వికెట్లు తీయడం విశేషం. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో క్లాసెన్, మిల్లర్ ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 79 పరుగులు జత చేశారు. అయితే చివరి మూడు ఓవర్లలో బంగ్లా బౌలర్లు 13 పరుగులు మాత్రమే ఇచ్చి.. క్లాసెన్, మిల్లర్ వికెట్లు కూడా పడగొట్టడంతో సౌతాఫ్రికా స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 113/6 (క్లాసెన్ 46, మిల్లర్ 29, డికాక్ 18; తన్‌జీమ్ హసన్ 3/18, టస్కిన్ 2/19)
బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 109/7. (తౌహీద్ 37, మహ్ముదుల్లా 20, షంటో 14; కేశవ్ 3/27, నోకియా 2/17, రబాడ 2/19).