Share News

T20 World Champion : కొత్త.. కొత్తగా

ABN , Publish Date - Jul 27 , 2024 | 06:23 AM

టీ20 వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా మెగా టోర్నీ తర్వాత పూర్తిస్థాయి జట్టుతో సై అంటోంది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీ్‌సలో భాగంగా తొలుత మూడు టీ20లలో తలపడనుంది. మొదటి టీ20 శనివారం ఇక్కడ జరగనుంది. కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, కోచ్‌గా గంభీర్‌ కొత్తగా నియమితులయ్యారు.

T20 World Champion : కొత్త.. కొత్తగా

నూతన కెప్టెన్‌, కోచ్‌తో టీమిండియా

శ్రీలంకతో తొలి టీ20 నేడు

రా. 7 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..

పల్లెకెలె: టీ20 వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా మెగా టోర్నీ తర్వాత పూర్తిస్థాయి జట్టుతో సై అంటోంది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీ్‌సలో భాగంగా తొలుత మూడు టీ20లలో తలపడనుంది. మొదటి టీ20 శనివారం ఇక్కడ జరగనుంది. కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, కోచ్‌గా గంభీర్‌ కొత్తగా నియమితులయ్యారు. అలాగే జట్టులోనూ కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. దాంతో..కెప్టెన్‌, కోచ్‌తోపాటు జట్టులోని యువ క్రికెటర్లకు ఈ టూర్‌ పరీక్ష కానుంది. అనుభజ్ఞుడైన గంభీర్‌ కోచ్‌గా జట్టు పయనంపై ఆసక్తి రేకెత్త్తిస్తోంది.మొత్తంగా కొత్తకోచ్‌, సారథి ఆధ్వర్యంలో ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. గతంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో టీ20 సిరీ్‌సలలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకు ఆ అనుభవం.. పూర్తిస్థాయి కెప్టెన్‌ బాధ్యతల్లో ప్లస్‌ కానుంది.

రోహిత్‌, విరాట్‌, జడేజా లేకుండా..: గతనెల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌ అనంతరం స్టార్లు రోహిత్‌, విరాట్‌, జడేజా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. దాంతో ఎన్నో ఏళ్ల అనంతరం ఈ త్రయం లేకుండా భారత్‌ బరిలో దిగుతోంది. ఇది టీమిండియాకు సంధి దశ. గిల్‌తోపాటు యువ బ్యాటర్లు జైస్వాల్‌, రింకూ, పరాగ్‌లు జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకొనేందుకు.. జడేజా స్థానంలో ఆల్‌రౌండర్‌గా తన ముద్ర వేసేందుకు అక్షర్‌ పటేల్‌కూ ఇది చక్కటి చాన్స్‌. ఆల్‌రౌండర్లు హార్దిక్‌, దూబే, వాషింగ్టన్‌లతో జట్టు పటిష్టంగా ఉంది. సీనియర్‌ బుమ్రా గైర్హాజరీలో యువపేసర్లు అర్ష్‌దీప్‌, సిరాజ్‌లకు ఈ సిరీస్‌ అద్భుత అవకాశం.

లంకకు ఎదురుదెబ్బ: సిరీస్‌ ఆరంభంలోనే ఆతిథ్య జట్టుకు ఎదురు దెబ్బలు తగిలాయి. అనుభవజ్ఞులైన పేసర్లు చమీర అనారోగ్యంతో, తుషార గాయంతో సిరీస్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో అసిత ఫెర్నాండో, దిల్షాన్‌ మధుశంక జట్టులోకి వచ్చారు. ఇది చాలదన్నట్టు..జట్టును ప్లూ జ్వరం పట్టిపీడిస్తున్నదట. దాంతో ఆల్‌రౌండర్‌ రమేష్‌ మెండి్‌సను రిజర్వ్‌ ఆటగాడిగా పిలిపించారు. టీ20 వరల్డ్‌ కప్‌లో వైఫల్యంతో లంక జట్టులో మార్పులు జరిగాయి. తాత్కాలిక కోచ్‌గా జయసూర్యను, అసలంకను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. భారత్‌ మాదిరే కొత్త సారథి, కోచ్‌తో దిగుతున్న లంక జట్టు స్వదేశంలో జరిగే సిరీ్‌సలో పోటీ ఇస్తుందా అన్నది చూడాలి.

జట్లు (అంచనా)

భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టె న్‌), గిల్‌, జైస్వాల్‌, పంత్‌ (కీపర్‌), హార్దిక్‌, దూబే, సుందర్‌, అక్షర్‌, అర్ష్‌దీప్‌, బిష్ణోయ్‌/ఖలీల్‌, సిరాజ్‌.

శ్రీలంక: అసలంక (కెప్టెన్‌), నిస్సాంక, మెండిస్‌ (కీపర్‌), పెరీరా, అవిష్క ఫెర్నాండో, షనక, హసరంగ, మహీష్‌ తీక్షణ, బినురా ఫెర్నాండో/అసిత ఫెర్నాండో, మధుశంక, పథిరన.

పిచ్‌/వాతావరణం

లంక ప్రీమియర్‌ లీగ్‌ సందర్భంగా పల్లెకెలె స్టేడియంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో మొదటి ఇన్నింగ్స్‌లో సగటున 185 పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. మధ్యాహ్నం వర్షం కురిసే చాన్సుంది. మ్యాచ్‌ రాత్రి జరగనుండడంతో వరుణుడి నుంచి ఆటంకం లేకపోవచ్చు.

Updated Date - Jul 27 , 2024 | 06:23 AM