ఇదేమి అథ్లెటిక్ ట్రాక్?
ABN , Publish Date - Sep 05 , 2024 | 02:38 AM
హైదరాబాద్ స్పోర్ట్స్ హబ్‌గా పేరుగాంచిన గచ్చిబౌలి క్రీడా సముదాయం గత పాలకుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా తయారైంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇందులోని ఫుట్‌బాల్ స్టేడియం కొత్త రూపు...
గచ్చిబౌలి స్టేడియంలో పగుళ్లొచ్చిన సింథటిక్ ట్రాక్
అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో చేటు
హైదరాబాద్ స్పోర్ట్స్ హబ్‌గా పేరుగాంచిన గచ్చిబౌలి క్రీడా సముదాయం గత పాలకుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా తయారైంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇందులోని ఫుట్‌బాల్ స్టేడియం కొత్త రూపు సంతరించుకున్నా మిగిలిన క్రీడా ప్రాంగణాల పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. గత బీఆర్ఎస్ సర్కార్లానే స్పోర్ట్స్ యూనివర్సిటీ, పాలసీ అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందు గచ్చిబౌలితో పాటు నగరంలోని ప్రధాన స్టేడియాలను ఆధునీకరించాలని క్రీడా సంఘాలు కోరుతున్నాయి.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): గత పాలకుల అలసత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) అధికార యంత్రాంగం అసమర్థత వెరసి అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన గచ్చిబౌలి క్రీడా సముదాయం ప్రస్తుతం కళాహీనంగా తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి చొరవతో సుమారు రూ.16 కోట్లు వెచ్చించి ఇందులోని ఫుట్‌బాల్ స్టేడియాన్ని మాత్రం ఆధునీకరించారు. అయితే అక్కడే ఉన్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఆధునీకరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. హకీంపేటలో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని, ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు కాలక్షేపం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ, కొత్త పాలసీ అంటూ ప్రకటనలు చేస్తోంది కానీ, అసలు సమస్యలను విస్మరిస్తోందని క్రీడా సంఘాలు, క్రీడాకారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
సింథటిక్ ట్రాక్ అధ్వాన్నం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో అంతర్జాతీయ ప్రమాణాలతో వేసిన సింథటిక్ ట్రాక్ సరైన మెయింటెనెన్స్ లేక పూర్తిగా పాడైంది. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేందుకు పనికిరాని స్థితికి చేరుకుంది. అక్కడ సాధన చేస్తున్న క్రీడాకారులు తరచూ గాయాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో గల ఎనిమిది లైన్ల ప్రధాన సింథటిక్ ట్రాక్‌తో పాటు నాలుగు లైన్ల ప్రాక్టీస్ సింథటిక్ ట్రాక్ ఉంది. ఈ రెంటికి మరమ్మతులు చేయాలంటే రూ.9 కోట్లు ఖర్చువుతుందని అంచనా. ఖేలో ఇండియా పథకం కింద ఇప్పటికే మెదక్, కరీంనగర్, వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీల్లో కేంద్ర ప్రభుత్వం సింథటిక్ ట్రాక్‌లు వేసింది. తెలంగాణ ప్రభుత్వ అధీనంలోని గచ్చిబౌలిలో క్రీడా సముదాయానికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే కనీసం రాష్ట్ర నిధులతోనైనా ఆధునీకరణ పనులు చేపట్టాలని అథ్లెట్లు కోరుతున్నారు.