Share News

State Agriculture Director : ఏఈవోలపై కొరడా

ABN , Publish Date - Oct 23 , 2024 | 04:22 AM

రాష్ట్రవ్యాప్తంగా 160 మంది వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవోల)పై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. వారిపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ బి. గోపి ఉత్తర్వులు జారీచేశారు.

State Agriculture Director : ఏఈవోలపై కొరడా

  • 160 మంది అధికారుల సస్పెన్షన్‌

  • రైతు బీమా మృతుల నమోదు జాప్యంతోనే

  • వ్యవసాయశాఖ డైరెక్టరేట్‌ ఉత్తర్వులు జారీ

  • ఏఈవోల ధర్నా.. కక్షసాధింపేనని ఆగ్రహం

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 160 మంది వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవోల)పై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. వారిపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ బి. గోపి ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 21 తేదీన ఏఈవోలకు వ్యక్తిగతంగా జారీచేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులు మంగళవారం వారికి చేరాయి. జిల్లా వ్యవసాయశాఖ అధికారులతోపాటు కలెక్టర్లకు కూడా ఉత్తర్వులు పంపించారు. రైతుబీమా పోర్టల్‌లో మరణాల నమోదులో ఆలస్యానికిగాను ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైతు బీమా మార్గదర్శకాల ప్రకారం.. రైతులు ఏ కారణంతో చనిపోయినా, వెంటనే వారి వివరాలు సేకరించి, పోర్టల్‌లో నమోదుచేసి నష్టపరిహారం కోసం ఎల్‌ఐసీకి పంపించాల్సి ఉండగా, ఏఈవోలు విఽధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్‌కు గురైన ఏఈవోలు అనుమతి లేనిదే తాము పనిచేసే ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లకూడదని, స్థానికంగా ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనటం గమనార్హం.

కాగా.. ఈ చర్యను నిరసిస్తూ రాష్ట్రం నలుములూల నుంచీ పలువురు ఏఈవోలు హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. ఉన్నతాధికారులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సస్పెన్షన్‌ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వివిధ జిల్లాల్లోని వ్యవసాయ శాఖ కార్యాలయాలు, రైతు వేదికల వద్ద కూడా ఏఈవోలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఎలాంటి సంజాయిషీ తీసుకోకుండానే 160 మందిపై ఏకపక్షంగా వేటు వేయడమేంటని ఏఈవోల సంఘం అడ్‌హక్‌ కమిటీ ఛైర్మన్‌ బి. రాజ్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్‌ క్రాప్‌ సర్వే విషయంలో ఉన్నతాధికారులతో విభేదించినందుకే, ఏఈవోలను సస్పెండ్‌ చేసి కక్షసాధిస్తున్నారని ఆరోపించారు. ఏఈవోలపై సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని రాజ్‌కుమార్‌ హెచ్చరించారు.


  • పంటల నమోదు ఏఈవోల ప్రాథమిక బాధ్యత

  • రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి. గోపి

పంటల నమోదు కార్యక్రమం వ్యవసాయ విస్తరణాధికారుల ప్రాథమిక బాధ్యత అని.. కానీ, కొంతమంది ఏఈవోలు పంట పొలాలను సందర్శించకుండానే నమోదు చేసే ఉద్దేశంతో డిజిటల్‌ క్రాప్‌ సర్వేను అడ్డుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.గోపి అన్నారు. మంగళవారం ఏఈవోలు కమిషనరేట్‌ ఎదుట ధర్నాకు దిగిన నేపథ్యంలో.. ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మెరుగైన పద్ధతిలో సర్వే నిర్వహించడానికిగాను ఏఈవోలకు ఒక నెల క్రితమే సర్క్యులర్‌ పంపినట్లు తెలిపారు. ప్రతి గుంటలో సాగైన పంటల వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవటం, పంటలకు కావాల్సిన ఉత్పాదకాలను ఖచ్చితంగా అంచనా వేయటం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవటం, పంట బీమా అమలు వంటివాటికి, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు పొందటానికి, రైతుబీమా రైతుభరోసా పొందడానికి.. పంటల నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని గోపి స్పష్టంచేశారు. పంటల నమోదు అంటే.. చెట్టుకింద, కార్యాలయంలో కూర్చొని చేసే కార్యక్రమం కాదని, ఈ ప్రక్రియను సక్రమంగా నిర్వహించకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని రైతులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.

Updated Date - Oct 23 , 2024 | 04:22 AM