Share News

Hyderabad: పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తేనే పనులు

ABN , Publish Date - May 19 , 2024 | 03:19 AM

బల్దియా కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల్లో జీహెచ్‌ఎంసీ అధికారుల వైఖరిని నిరసిస్తూ పోరుకు దిగారు. ఇప్పటికే ఇచ్చిన డెడ్‌లైన్‌ (ఈనెల 18)లోగా బకాయిలు చెల్లించాలని కొన్ని నెలల క్రితం జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో నిర్వహణ పనులను నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.

Hyderabad: పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తేనే పనులు

  • సమ్మెకు దిగిన బల్దియా కాంట్రాక్టర్లు

  • జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై నిరసన

  • శనివారం నుంచే పనులకు దూరం

హైదరాబాద్‌ సిటీ, మే 18 (ఆంధ్రజ్యోతి): బల్దియా కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల్లో జీహెచ్‌ఎంసీ అధికారుల వైఖరిని నిరసిస్తూ పోరుకు దిగారు. ఇప్పటికే ఇచ్చిన డెడ్‌లైన్‌ (ఈనెల 18)లోగా బకాయిలు చెల్లించాలని కొన్ని నెలల క్రితం జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో నిర్వహణ పనులను నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో శనివారం సమావేశమైన కాంట్రాక్టర్లు.. బిల్లులు చెల్లించే వరకూ పనులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీంతో రానున్న వర్షాకాలం పనులపై సర్వత్రా ఆందోళన నెలకొంది. గ్రేటర్‌ పరిధిలోని రోడ్లు, డ్రెయినేజీలు, నాలాలు, విద్యుత్‌ స్తంభాలు, తదితర నిర్వహణ పనులను జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు చేస్తున్న విషయం తెలిసిందే.


అయితే రహదారుల నిర్మాణం, మరమ్మతు, నాలాల రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, పూడికతీత, ఇతరత్రా నిర్వహణ పనులకు సంబంధించి వారికి రావాల్సిన దాదాపు రూ.1350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, వేతనాలు, అప్పుల వాయిదాల చెల్లింపునకు అవస్థలు పడుతోన్న బల్దియా.. కాంట్రాక్టర్ల బకాయిలను దీర్ఘకాలికంగా పెండింగ్‌లో పెట్టింది. ఆర్థిక సంవత్సరం ముగిసిన మార్చిలో, ఎర్లీ బర్డ్‌తో ఏప్రిల్‌లో జీహెచ్‌ఎంసీకి రూ.1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చినా.. కాంట్రాక్టర్లకు బకాయిలు ఇవ్వలేదు. అయితే గత ఏడాది మార్చి నుంచి తమకు రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నామని వేడుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


  • వర్షాకాలం నేపథ్యంలో ఇబ్బందులు..

వర్షాకాలం సీజన్‌ నేపథ్యంలో ప్రతి ఏటా జూన్‌ 1 నుంచి అక్టోబరు వరకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తుంటుంది. అయితే ఈ పనులనూ చేయొద్దని కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ తాజాగా నిర్ణయించింది. కాగా, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నగరం నీట మునిగి జనజీ వనానికి ఆటంకం ఏర్పడింది. పూడికతీతలు లేకపోవడంతో చాలాచోట్ల నాలాల్లో నీరు నిలిచిపోయి రోడ్లపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు సమ్మెలోకి వెళ్లడంతో వానాకాలంలో చేపట్టాల్సిన పనులపై ఆందోళన నెలకొంది.

Updated Date - May 19 , 2024 | 03:19 AM