Share News

Bandi Sanjay: రేవంత్‌, కేటీఆర్‌.. ఇద్దరూ సీఎంలే

ABN , Publish Date - Nov 18 , 2024 | 03:43 AM

‘‘రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఒకరు రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు కేటీఆర్‌. ఇక్కడ ఆర్‌కే (రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌) బ్రదర్స్‌ పాలన నడుస్తోంది.

Bandi Sanjay: రేవంత్‌, కేటీఆర్‌.. ఇద్దరూ సీఎంలే

  • రాష్ట్రంలో ఆర్‌కే బ్రదర్స్‌ పాలన నడుస్తోంది.. వారి కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలు

  • రుజువు చేయలేకపోతే పదవి నుంచి తప్పుకొంటా: బండి సంజయ్‌

సంగారెడ్డి టౌన్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఒకరు రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు కేటీఆర్‌. ఇక్కడ ఆర్‌కే (రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌) బ్రదర్స్‌ పాలన నడుస్తోంది. వారి కుటుంబాల నడుమ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆ విషయాన్ని రుజువు చేయకుంటే నేను పదవి నుంచి తప్పుకొంటా. రుజువు చేస్తే వారు పదవి నుంచి తప్పుకొంటారా?’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఆదివారం ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన... మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ కాంగ్రెస్‌ అధిష్ఠానం జోక్యంతోనే ఫోన్‌ ట్యాపింగ్‌, జన్వాడ ఫాం హౌస్‌, ఫార్ములా-ఈ తదితర కేసులు మూతబడ్డాయని అన్నారు. లగచర్ల విధ్వంసంలో కేటీఆర్‌ హస్తం ఉందని ప్రకటించిన ప్రభుత్వం.. ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. లగచర్లలో బీఆర్‌ఎస్‌ నాయకుల కుట్ర ఉంటే అమాయకులను అరెస్ట్‌ చేయడమేంటని ప్రశ్నించారు.


రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే లగచర్ల విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ డ్రామాలు ఆడుతూ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నాయని, తెలంగాణలో బీజేపీ ఎదగకుండా కుట్ర పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, దాని పేరిట లక్షల కోట్లు దోచుకోవాలన్న ప్రణాళికకే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీ బాధితులకు అన్యాయం జరగకుండా ప్రక్షాళన చేయాలని సూచించారు. రాష్ట్రంలో పథకం ప్రకారమే ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వంఆలస్యం చేస్తోందని విమర్శించారు. ఈ నెల 15 నాటికి 20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కనీసం 10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వంపై రైతులకు నమ్మకం లేక ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ధాన్యానికి రూ.500 బోనస్‌ ప్రకటించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు సన్నరకానికే ఇస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోందని విమర్శించారు.

Updated Date - Nov 18 , 2024 | 03:43 AM