BRS: నల్లగొండ జిల్లా కార్యాలయం కేసులో బీఆర్‌ఎ్‌సకు ఎదురుదెబ్బ
ABN , Publish Date - Oct 24 , 2024 | 05:13 AM
నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో బీఆర్‌ఎ్‌సకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కూల్చివేత ఆదేశాలను సమర్థించిన డివిజన్ బెంచ్
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో బీఆర్‌ఎ్‌సకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎలాంటి అనుమతిలేకుండా నిర్మించిన సదరు అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని పేర్కొంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. రూ.లక్ష జరిమానా చెల్లించాలన్న ఆదేశాలను మాత్రం పక్కనపెడుతూ సింగిల్ జడ్జి తీర్పును సవరించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ గ్రామపరిధిలో ఎకరం భూమిని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయం నిర్మించుకోవడానికి జీవో 167, జీవో 66 ద్వారా 2019లో కేటాయించారు. నల్లగొండ మునిసిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా భారీ ప్రహరీతో రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు.
తర్వాత ఆ భవనాన్ని రెగ్యులరైజ్ చేయాలని జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేశారు. ఎలాంటి అనుమతిలేకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టినందున దరఖాస్తును తిరస్కరించిన అధికారులు.. అక్రమ కట్టడాన్ని 15 రోజుల్లో తొలగించాలని నోటీసులు జారీ చేశారు. దీనిపై హైకోర్టులో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినప్పటికీ రెండో పిటిషన్ దాఖలు చేసి చట్టాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారంటూ సింగిల్ జడ్జి .. ఆ పిటిషన్‌లను కొట్టేయడంతోపాటు రూ.లక్ష జరిమానా విధించారు. దీనిపై బీఆర్‌ఎస్ నల్గొండ జిల్లా శాఖ డివిజన్ బెంచ్‌లో అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించింది.