Share News

Stray Dogs: కుక్కలు బాబోయ్‌..

ABN , Publish Date - Aug 22 , 2024 | 02:52 AM

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం కుక్కలు పెట్రేగిపోయాయి. నల్లగొండ జిల్లాలో ఓ పిచ్చికుక్క ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు సహా ఐదుగురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచగా, మహబూబాబాద్‌ జిల్లాలో కుక్క దాడిలో తండ్రీ, కొడుకులు గాయపడ్డారు.

Stray Dogs: కుక్కలు బాబోయ్‌..

  • నల్లగొండ జిల్లాలో ఐదుగురిపై దాడి

  • మహబూబాబాద్‌ జిల్లాలో ఇద్దరికి గాయాలు

  • మెదక్‌ జిల్లాలో కుక్కకాటుతో వ్యక్తి మృతి

దేవరకొండ/ బయ్యారం/ చిల్‌పచెడ్‌, ఆగస్టు 21: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం కుక్కలు పెట్రేగిపోయాయి. నల్లగొండ జిల్లాలో ఓ పిచ్చికుక్క ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు సహా ఐదుగురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచగా, మహబూబాబాద్‌ జిల్లాలో కుక్క దాడిలో తండ్రీ, కొడుకులు గాయపడ్డారు. మెదక్‌ జిల్లాలో కుక్కకాటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పలుగుతండాలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు సహా ఐదుగురిపై పిచ్చికుక్క దాడి చేసింది.


వారిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు తీవ్రంగా గాయపడిన ముగ్గురిని హైదరాబాద్‌కు పంపించారు. మెదక్‌ జిల్లా చిల్‌పచెడ్‌ మండలం ఫైజాబాద్‌లో కుక్కకాటుకు ఒకరు మృతి చెందారు. ఫైజాబాద్‌కు చెందిన మ్యాకల శ్రీనివాస్‌ (41) నెల రోజుల క్రితం తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న గుడిసెలో నిద్రిస్తుండగా కుక్క దాడి చేసి గాయపరిచింది. అప్ప టి నుంచి జోగిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ ఆరోగ్యం విషమించి బుధవారం మృతి చెందాడు.


మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన షేక్‌ యూసఫ్‌ భార్య తన మూడేళ్ల కుమారుడికి ఇంటి ఆవరణలోని వరండాలో అన్నం తినిపిస్తున్న సమయంలో హఠాత్తుగా వీధి కుక్క బాలుడిపై దాడి చేసింది. ఆమె కేకలు వేయడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన యూసఫ్‌ కుక్కను తరిమే ప్రయత్నం చేయగా అతడిపై కూడా కుక్క దాడి చేసి గాయపరిచింది. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - Aug 22 , 2024 | 02:52 AM