ED: అమ్మోయ్.. అన్ని దందాలా!?
ABN , Publish Date - Nov 09 , 2024 | 04:30 AM
గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌కుమార్ పనిచేసిన కాలంలో భూ కుంభకోణాలు భారీగా జరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్వరం మండలం నాగారంలోని 42 ఎకరాల భూదాన భూముల అన్యాక్రాంతంపై నమోదైన కేసులో ఈడీ విచారణ జరుపుతుండగా.. మరికొన్ని భూముల అక్రమాలపై కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
అమోయ్ బృందంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు
ధరణిని అడ్డుపెట్టుకొని భూ కుంభకోణాలు
విచారణ జరిగితే మరిన్ని విషయాలు వెలుగులోకి!
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌కుమార్ పనిచేసిన కాలంలో భూ కుంభకోణాలు భారీగా జరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్వరం మండలం నాగారంలోని 42 ఎకరాల భూదాన భూముల అన్యాక్రాంతంపై నమోదైన కేసులో ఈడీ విచారణ జరుపుతుండగా.. మరికొన్ని భూముల అక్రమాలపై కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీటిలో కొన్ని వివరాలు..
జూ మియాపూర్ సర్వే నంబరు 100/ఆ లోని 8 ఎకరాల భూమిని పట్టాభూమిగా మార్చినట్లు ఆరోపణలున్నాయి.
ఖాజాగూడలోని సర్వే నంబరు 27/2లోని అత్యంత విలువైన 27 ఎకరాల భూమిని ప్రైవేటు బిల్టర్లకు అనుకూలంగా మార్చడం వెనుక కొందరు పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు ఈడీకి ఫిర్యాదు అందింది. ఈ కేసులో లోతైన విచారణ జరిగితే మరికొందరి పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఫిగ్లీపూర్లోని సర్వే నంబరు 17లోని సీలింగ్ భూములు అన్యాక్రాంతమైనట్లు ఫిర్యాదు అందింది.
వట్టినాగులపల్లిలోని శంకరహిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఇటీవల ఈడీకి ఫిర్యాదు చేసింది. వట్టినాగులపల్లిలో 1983లో 460 ఎకరాల్లో శంకరహిల్స్ పేరుతో 3333 ప్లాట్లు వేసి అప్పట్లో కొందరు విక్రయించారు. దీనిపై అనేక కోర్టు వివాదాలున్నాయి. వీటికితోడు ఈ భూములను 111 జీవో కింద తీసుకురావడంతో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. గత రెండేళ్ల కిందట సుప్రీంకోర్టు వట్టినాగులపల్లిలోని కొన్ని భూములను 111 జీవో నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇందులో శంకరహిల్స్ భూములూ ఉన్నాయి. 111 జీవో నుంచి ఈ ప్రాంతాన్ని తొలగించడంతో భూము ల ధరలు అమాంతం పది రెట్లకు పైగా పెరిగాయి. దీంతో ఈ భూములపై కొందరు పెద్దల కన్ను పడింది. అధికారుల సహకారంతో ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని ఇందులో ప్లాట్లు ఉన్న భూములను ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఇదంతా అమోయ్‌కుమార్ పనిచేసిన కాలంలోనే జరిగిందంటూ ప్లాట్ల యజమానులు ఇటీవల ఈడీకి ఫిర్యాదు చేశారు.
తట్టి అన్నారం గ్రామంలోని సర్వే నంబర్లు 108, 109, 110, 111లోని 70.39 ఎకరాల్లో మద్ది సత్యానారాయణరెడ్డి 1982లో వెంచర్ వేసి మధురానగర్ పేరుతో 840 ప్లాట్లు విక్రయించారు. ధరణి వచ్చాక ఈ ప్లాట్లన్నీ మళ్లీ పట్టాభూములుగా మారాయని, ఇందులో అప్పటి కలెక్టర్ అమోయ్కుమార్తోపాటు అధికారుల పాత్ర ఉందని ప్లాట్ల యజమానులు ఈడీకి ఫిర్యాదు చేశారు.
కొండాపూర్‌లోని సర్వే నంబరు 104 నుంచి 108 వరకు ఉన్న బాలసాయి బాబా ట్రస్టుకు చెందిన 42 ఎకరాల భూమి ప్రైవేటుపరం కావడం వెనుక కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలతోపాటు నాటి సీఎస్ సోమేశ్‌కుమార్, కలెక్టర్‌గా ఉన్న అమోయ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారుల పాత్ర ఉందంటూ రాఘవయ్య అనే వ్యక్తి ఇటీవల ఫిర్యాదు చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని తప్పుడు పత్రాలతో ఈ భూములను ప్రైవేటు సంస్థలకు బదలాయించారని, దీనిపై విచారణ చేయాలని కోరారు.
ఘట్కేసర్ మండలం కొర్రెముల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని వెంకటాపూర్ సర్వే నంబరు 174లోని 12ఎకరాల ప్రభుత్వ భూమి 2023 అక్టోబరు 12న పట్టా భూమిగా మారింది. అప్పుడు అమోయ్‌కుమార్ మేడ్చ ల్ కలెక్టర్‌గా ఉన్నారు. దీనిపై కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది.
ఇటీవల గుట్టబేగంపేటలోని సర్వే నంబరు 63లోని 52 ఎకరాల విలువైన భూములను 2022లో కలెక్టర్ అమోయ్‌కుమార్ డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేటుగా పేర్కొవడంపై కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. అమోయ్‌కుమార్ ఇచ్చిన ఉతర్వులను కొట్టివేసింది.