Maheshwaram: భూదాన్ భూముల్లో మనీలాండరింగ్..!
ABN , Publish Date - Oct 25 , 2024 | 04:16 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్ భూముల బదలాయింపులో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారడంతో మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టింది.
రెండో రోజు ఫైళ్లు, పత్రాలతో ఈడీ
ఎదుట ఐఏఎస్ అమోయ్‌కుమార్ హాజరు
నేడు మరోసారి విచారణ..
విశ్రాంత ఐఏఎస్ ప్రమేయంపై ఆరా
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్ భూముల బదలాయింపులో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారడంతో మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టింది. విజిలెన్స్, స్థానిక పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు జరుపుతోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నేతల ప్రమేయం ఉండటంతో పూర్తిస్థాయిలో విచారణకు ఈడీ సిద్ధమైనట్లు సమాచారం. విచారణలో భాగంగా పశుసంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ను ఈడీ వరుసగా రెండో రోజు ప్రశ్నించింది.
బుధవారం మొదటి సారి ఆయన్ను సుదీర్ఘంగా విచారించిన ఈడీ ప్రత్యేక బృందం.. పలు పత్రాలు, డాక్యుమెంట్లు తేవాల్సిందిగా చెప్పి పంపించారు. దీంతో ఆయన పలు ఫైళ్లు, పత్రాలతో గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన్ను విచారించిన ఈడీ అధికారులు.. శుక్రవారం మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్పి పంపించారు. అయితే సీనియర్ ఐఏఎ్‌సను ఈడీ వరుసగా విచారిస్తున్న క్రమంలో ఈ కేసు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందోననే చర్చ మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో విలువైన భూముల బదలాయింపులో విశ్రాంత ఐఏఎస్ ప్రమేయంపైనా ఆరోపణలున్నాయి.
ప్రస్తుతం ఫైళ్లు పరిశీలిస్తున్న ఈడీ అధికారులు.. విశ్రాంత ఐఏఎస్ ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు. విచారణలో లభించే సమాచారం, పత్రాల ఆధారంగా మరికొందరు ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసి ప్రశ్నించే అవకాశమున్నట్లు సమాచారం. భూదాన్ భూములతోపాటు రంగారెడ్డి జిల్లా పరిధిలో జరిగిన మరికొన్ని భూ బదలాయింపులపైనా ఈడీ దృష్టి సారించింది. కొన్ని బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు జరిగిన భూ బదలాయింపుల్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో వాటన్నింటిపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.