Share News

Loan Waiver: మాఫీపై ఆందోళనొద్దు!

ABN , Publish Date - Jul 21 , 2024 | 02:54 AM

రుణమాఫీపై రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని, రూ.2లక్షల రుణమాఫీ అందరికీ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Loan Waiver: మాఫీపై ఆందోళనొద్దు!

  • ప్రతి రైతు కుటుంబాన్ని రుణ విముక్తి చేస్తాం

  • కొన్ని బ్యాంకులు 2018కు ముందున్న

  • జాబితా ఇవ్వడంతోనే తేడాలు

  • రుణమాఫీ తర్వాతే వరంగల్‌లో సభ: తుమ్మల

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీపై రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని, రూ.2లక్షల రుణమాఫీ అందరికీ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతుల ఖాతా నంబర్లన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, రుణమాఫీ కానివారికి ఎందుకు కాలేదు? ఎప్పుడు వస్తుందో కూడా స్పష్టతనిస్తామని చెప్పారు. రేషన్‌కార్డు లేకున్నా పాస్‌బుక్‌ ఆధారంగా రుణమాఫీ ప్రక్రియ చేస్తామని, ప్రతి రైతు కుటుంబానికి రుణవిముక్తి కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి అనుగుణంగా రుణమాఫీ ప్రక్రియ నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామన్నారు. రైతు రుణమాఫీ పూర్తయ్యాకే వరంగల్‌లో సభ ఉంటుంద ని చెప్పారు. శనివారం సచివాలయంలో మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు.


రుణామాఫీపై రైతులు అపోహలు పెట్టుకోవొద్దని, ఎవరికి.. ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన పద్ధతిలోనే రుణమాఫీ ప్రక్రియ జరుగుతోందని, మెరుగైన పద్ధతిలో డేటా తీసుకొని రుణమాఫీ చేస్తున్నామని, దీనిపై రాజకీయం చేయొద్దని విపక్షాలకు సూచించారు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయంలో రుణమాఫీ పేరిట రూ.25 వేల చొప్పున ఇవ్వడంతో అవన్నీ బ్యాంకు వడ్డీలకే సరిపోయాయని ఎద్దేవా చేశారు. రెండోసారి బీఆర్‌ఎస్‌ సర్కారు ఎన్నికల ముందు సగమే ఇచ్చి చేతులు దులుపుకొందని విమర్శించారు. ఇటువంటి పార్టీలు కూడా తమను విమర్శిస్తాయా? అని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణాలున్న రైతుల వివరాలివ్వాలని బ్యాంకర్లను తాము అడిగామన్నారు.


మొత్తం 32 బ్యాంకులు నుంచి 44 లక్షల ఖాతాల వివరాలను ఇచ్చాయన్నారు. కొన్ని బ్యాంకులు 2018కు ముందున్న రుణాలను కూడా ఇందులో చేర్చే ప్రయత్నం చేస్తున్నాయని, అందుకే తేడాలొస్తున్నాయని వివరించారు. కొన్ని సహకార సొసైటీలపై అడిటింగ్‌ చేశామని, వాటిలో లోపాలు బయటపడ్డాయన్నారు. అందుకే అక్కడ రుణమాఫీని తాత్కాలికంగా ఆపివేశామని చెప్పారు. ఆరు సోసైటీల్లో అడిటింగ్‌ చేస్తే 2 వేల ఖాతాల్లో లోసుగులున్నాయన్నారు. వ్యాపారస్థులకు రుణమాఫీ చేయబోమని స్పష్టం చేశారు. రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Jul 21 , 2024 | 02:54 AM