Share News

Nirmal: బాసర విద్యార్థులపై బకాయిల భారం!

ABN , Publish Date - Oct 28 , 2024 | 05:10 AM

నిర్మల్‌ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో ఫీజుల బకాయిల వసూలుకు అధికారులు అమలు చేస్తున్న నిబంధన.. పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది.

Nirmal: బాసర విద్యార్థులపై బకాయిల భారం!

  • ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న అధికారులు.. మినహాయింపు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలూ బేఖాతరు

  • చెల్లించలేక విద్యార్థుల అవస్థలు

  • సర్టిఫికెట్లు తీసుకోలేని దైన్యంలో వేలాదిమంది పట్టభద్రులు

  • హైకోర్టును ఆశ్రయించిన మాజీ విద్యార్థి

  • నేటి సాయంత్రంలోగా సర్టిఫికెట్లు ఇచ్చేయాలని వర్సిటీకి హైకోర్టు ఆదేశాలు

బాసర, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో ఫీజుల బకాయిల వసూలుకు అధికారులు అమలు చేస్తున్న నిబంధన.. పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది. చదువు పూర్తయిన విద్యార్థులకు.. బకాయిల పేరు చెప్పి అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వాలు జీవోలు విడుదల చేసినా కూడా.. యూనివర్సిటీ అధికారులు మాత్రం వాటిని ఖాతరు చేయడం లేదన్న విమర్శలున్నాయి.


ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ ప్రైవేటు సంస్థల్లో మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఓ మాజీ విద్యార్థి హైకోర్టు మెట్లెక్కాడు. సదరు విద్యార్థి పేరుసామల ఫణికుమార్‌. నల్గొండ జిల్లా గట్టుప్పల్‌ మండలం తేరాటుపల్లి గ్రామానికి చెందిన ఫణికుమార్‌.. గతేడాది ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం సివిల్‌ సర్వీసెస్‌ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో బీటెక్‌ సర్టిఫికెట్ల కోసం ట్రిపుల్‌ ఐటీకి వస్తే.. అధికారులు రూ.86 వేల ఫీజు బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పటంతో కోర్టులో పిటిషన్‌ వేశాడు. దీంతో న్యాయస్థానం అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది.


  • ఉచితమంటూనే.. ఫీజుల మోత

ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు ఉన్నతస్థాయి సాంకేతిక విద్యను ఉచితంగా అందించేందుకు ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేసినట్లు చెబుతుంటారు. వీటిలో చేరే విద్యార్థుల్లో 95 శాతం మంది నిరుపేద, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే వారే ఉంటారు. భవిష్యత్తుపై బోలెడన్ని ఆశలతో వచ్చే ఈ విద్యార్థులపై.. అధికారులు ఫీజుల భారం మోపుతున్నారు. విద్యార్థులు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగి వున్నా.. ఫీజులో 60-70 శాతమే రీయింబర్స్‌ అవుతోంది. దీంతో నాలుగేళ్ల బీటెక్‌ కోర్సులో ఏటా రూ.20 వేలు ఫీజు బకాయి ఉన్నా.. నాలుగేళ్లలో అది రూ.80 వేలకు పెరిగిపోతోంది. ఈ బకాయి అంతా విద్యార్థిపైనే మోపుతున్నారు. దీంతోపాటు పరీక్షల ఫీజులంటూ విద్యార్థుల నుంచి ఏటా రూ.వేలల్లో రుసుం వసూలు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థిపై చదువు పూర్తయ్యేసరికి సగటున రూ.50 వేల నుంచి లక్ష వరకు బకాయి ఉంటోంది. ఇది పేద విద్యార్థులకు తలకు మించిన భారంగా మారుతోంది.


  • సర్టిఫికెట్లు లేక... ఉద్యోగాలకు దూరంగా..

బకాయిలు కట్టలేక వేలాది మంది విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకోవటం లేదు. అధికారులకు మొరపెట్టుకున్నా వారు కనికరించడం లేదు. భారీ మొత్తాలే కాదు.. రూ.ఐదారు వేల లోపు ఫీజు బకాయి ఉన్న వారిది కూడా ఇదే పరిస్థితి. సర్టిఫికేట్లు చేతికి అందకపోవటంతో మంచి ఉద్యోగాలకు దూరమై టీ స్టాల్‌లో పనికి చేరిన విద్యార్థులు కూడా ఉన్నారు. దీనిపై ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసి.. విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. అయినప్పటికీ, వర్సిటీ అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలున్నాయి. కష్టపడి చదివి కోర్సు పూర్తి చేసినప్పటికీ.. బకాయిలు చెల్లించక సర్టిఫికేట్లు పొందని విద్యార్థులు ఇప్పటి వరకు దాదాపు 5 వేల మంది ఉన్నట్లు సమాచారం.


  • సర్టిఫికెట్లను తొక్కిపెట్టొద్దు : హైకోర్టు తీర్పు

ఈ నెల 22న మాజీ విద్యార్థి ఫణికుమార్‌.. హైకోర్టులో కేసు వేశాడు. విచారించిన న్యాయస్థానం ఈ నెల 25న ఆ విద్యార్థికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సర్టిఫికెట్‌లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొంది. సోమవారం నాటికి ఆ విద్యార్థికి సర్టిఫికెట్లు అందివ్వాలని ఈ విషయాన్ని మంగళవారం హైకోర్టుకు తెలపాలని న్యాయస్థానం వర్సిటీ అధికారులను ఆదేశించింది. దీంతో ఫణికుమార్‌ లాంటి 5 వేల మందికి న్యాయం జరిగింది.

Updated Date - Oct 28 , 2024 | 05:10 AM