Share News

Amoy Kumar: ఈడీ ప్రశ్నల వర్షం..

ABN , Publish Date - Oct 24 , 2024 | 04:18 AM

మాజీ కలెక్టర్‌, ప్రస్తుత పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్‌ కుమార్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరయ్యారు.

Amoy Kumar: ఈడీ ప్రశ్నల వర్షం..

  • భూముల కేటాయింపుపై ఐఏఎస్‌ అమోయ్‌ కుమార్‌ను

  • 7 గంటలపాటు విచారించిన ఈడీ ప్రత్యేక బృందం

  • నేడు మరోసారి విచారణకు రావాలని ఆదేశాలు

  • గత ప్రభుత్వంలోని కీలక నేతల మెడకు ఈడీ ఉచ్చు?

  • వారికీ నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : మాజీ కలెక్టర్‌, ప్రస్తుత పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్‌ కుమార్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న అమోయ్‌ని సాయంత్రం వరకు ఈడీ ప్రత్యేక బృందం ప్రశ్నించింది. సమన్లలో పేర్కొన్న విధంగా పలు పత్రాలను అమోయ్‌ వెంట తీసుకెళ్లగా... ఈడీ అధికారులు వాటిని పరిశీలించినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌ పని చేసినప్పుడు మహేశ్వరం మండలం నాగారంలో వందల కోట్ల రూపాయల విలువైన భూదాన్‌ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన అంశంపైనే ఈడీ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలిసింది.


నాగారంలో 42 ఎకరాల ప్రభుత్వ భూమిని మహేశ్వరం తహసీల్దార్‌ జ్యోతి, మరికొందరు అధికారులు కలిసి ప్రైవేటు సంస్థకు అప్పగించగా.. ఈ విషయమై స్థానికులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యోతితోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై గతంలోనే విజిలెన్స్‌ విభాగం విచారణ జరిపింది. పోలీసు కేసు, విజిలెన్స్‌ విచారణ ఆధారంగా ఐఏఎస్‌ అమోయ్‌ కుమార్‌ను ఈడీ బృందం ప్రశ్నించినట్లు తెలిసింది. అమోయ్‌ కుమార్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలోనే శేరిలింగంపల్లి, నానక్‌రాంగూడ భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటి విషయంలోనూ ఈడీ అధికారులు ఆరా తీశారు. అమోయ్‌ కుమార్‌ను 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన ఈడీ.. గురువారం మరో సారి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణ అనంతరం తిరిగి వెళ్లే సమయంలో మీడియాతో మాట్లాడేందుకు అమోయ్‌ కుమార్‌ నిరాకరించారు.


  • నాయకుల మెడకు ఈడీ ఉచ్చు

మహేశ్వరం పరిధిలోని భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే క్రమంలో భూములకు సంబంధించి జరిగిన వందల కోట్ల లావాదేవీల్లో అప్పటి ప్రభుత్వంలో కీలక నాయకుల ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. ఇద్దరు మంత్రులతోపాటు వారి కుటుంబ సభ్యులకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మహేశ్వరం భూముల విషయంలో విచారణ జరుపుతున్న ఈడీ మరింత లోతుగా ముందుకెళ్తే గత ప్రభుత్వ నాయకుల ప్రమేయం కూడా బయటపడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తమ వద్ద ఉన్న సమాచారం మేరకు ఐఏఎస్‌ అమోయ్‌ని విచారిస్తున్న ఈడీ బృందం... తమకు లభించే వివరాల మేరకు అవసరమైతే నాయకులకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Oct 24 , 2024 | 04:18 AM