Share News

Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!

ABN , Publish Date - May 12 , 2024 | 11:34 AM

‘‘తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న ‘మహాలక్ష్మి’ పథకం('Mahalakshmi' scheme)తో మహిళలు బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. మెట్రో రైలు తక్కువగా ఎక్కుతున్నారు.

Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!

- రూ.35 చెల్లించి పురుషులు మాత్రమే మెట్రోకు వస్తున్నారు..

- రానున్న రోజుల్లో ఇది ఆర్థిక భారంగా మారుతుంది

- ఎల్‌అండ్‌టీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌ సిటీ: ‘‘తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న ‘మహాలక్ష్మి’ పథకం('Mahalakshmi' scheme)తో మహిళలు బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. మెట్రో రైలు తక్కువగా ఎక్కుతున్నారు. పురుషులు రూ.35 చార్జితో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇది బాధాకరం. రాష్ర్టానికి ఆర్థిక భారం..’’ అని ఎల్‌అండ్‌టీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ శంకర్‌రామన్‌ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

హైదరాబాద్‌ మెట్రోలో ప్రస్తుతం రోజుకు 4.80 లక్షల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. రానున్న రోజుల్లో 10 లక్షల సంఖ్యకు చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన అందులో చెప్పారు. మెట్రో నిర్వహణ కోసం తమకు ప్రభుత్వంతో 65 ఏళ్ల పాటు రాయితీ ఒప్పందం ఉందని, 2021 నుంచి 2026 వరకు సంస్థ పనితీరుపై కూలంకషంగా నివేదికను పొందుపర్చామని, రానున్న ఐదేళ్లకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. నష్టం వచ్చే ప్రాజెక్టుల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని, లాభాలు వస్తున్న ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం మెట్రో ఇన్‌ఫ్రా మొదటి లెవల్‌ డెవలప్‏మెంట్‌ పూర్తయిందని, రానున్న రెండేళ్లలో మరో దశ డెవల్‌పమెంట్‌ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తున్నారు.. దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోంది.. అని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై హైదరాబాద్‌ మెట్రో(Hyderabad Metro)లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏడాది జరిగే వార్షిక నివేదిక సమయంలో ఎల్‌అండ్‌టీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు వాపోతున్నారు.

ఇదికూడా చదవండి: Secunderabad: ప్రయాణ కష్టాలు.. స్వగ్రామాలకు వెళ్లేందుకు పడరానిపాట్లు

గతంలో వాటాలు అమ్ముతామని వ్యాఖ్యలు..

కొవిడ్‌ సమయంలో కూడా శంకర్‌రామన్‌ ఎల్‌అండ్‌టీ వాటాలపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. నష్టాలతో హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్ట్‌ను నడుపుతున్నామని, ఆసక్తి కలిగిన వారు వస్తే కొంత వాటాను ఇస్తామని అప్పట్లో ఆయన ప్రకటన చేసినట్లు సమాచారం. తాజాగా ఫ్రీ బస్సు పథకంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వంతో కలిపి నడిపిస్తున్న ప్రాజెక్టుపై ఆయన చేసిన ప్రకటనలు సరికావని హెచ్‌ఎంఆర్‌ అధికారులు తోసిపుచ్చుతున్నారు.

ఇదికూడా చదవండి: Lok Sabha Elections: ఓటెయ్యండి.. బంపర్ ఆఫర్స్ కొట్టేయండి.. వివరాలివే..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 12 , 2024 | 11:34 AM