MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన
ABN , Publish Date - Jul 16 , 2024 | 07:36 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యంపై దీన్ దయాల్ ఆస్పత్రి డాక్టర్లు కీలక ప్రకటన చేశారు. సుమారు రెండు గంటల పాటు వైద్యం చేసిన అనంతరం..
న్యూ ఢిల్లీ/హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అనారోగ్యంపై దీన్ దయాల్ ఆస్పత్రి డాక్టర్లు కీలక ప్రకటన చేశారు. సుమారు రెండు గంటల పాటు వైద్యం చేసిన అనంతరం ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యులు ప్రకటించారు. అనంతరం ఆస్పత్రి నుంచి కవిత డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా మళ్లీ తీహార్ జైలుకే తీసుకెళ్లారు అధికారులు. కాగా.. రెండు రోజులుగా కవిత జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం నాడు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి ఉన్నతాధికారులు తరలించారు. రెండు గంటల పాటు ఆస్పత్రిలోనే కవిత ఉన్నారు. కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని.. డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లొచ్చని వైద్యులు ప్రకటించారు. దీంతో కవితను యథావిధిగా తీహార్ జైలుకు తరలించారు.
ఏం జరిగింది..?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ మధ్యాహ్నం వరకూ కూడా ఆరోగ్యంగానే ఉన్న ఆమె ఒక్కసారిగా అనారోగ్యంగా ఉన్నట్లు తీహార్ జైలు సిబ్బంది.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం దీన్ దయాల్ ఆస్పత్రిలో కవితకు చికిత్స అందించారు. తొలుత కవితకు ఏమైంది..? ఏ విషయంలో ఆస్పత్రికి తీసుకెళ్లారనే దానిపై క్లారిటీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, నేతలు ఆందోళన చెందారు. జ్వరం అని తెలియడంతో కారు పార్టీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ రాత్రి లేదా బుధవారం ఉదయం బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీ వెళ్లి కవితను పరామర్శించనున్నట్లు తెలిసింది.