Share News

TS News: 2వ రోజు హుస్సేన్ సాగర్ వద్ద కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు

ABN , Publish Date - Sep 18 , 2024 | 07:16 AM

భాగ్యనగరం హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచి వేలాది వినాయక విగ్రహాలు వరుసలో బారులు తీరాయి. ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం లోపు నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

TS News: 2వ రోజు హుస్సేన్ సాగర్ వద్ద కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు

హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచి వేలాది వినాయక విగ్రహాలు వరుసలో బారులు తీరాయి. ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం లోపు నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.


మరోవైపు.. 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో హుస్సేన్ సాగర్ చుట్టూ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య పనులు చేపడుతోంది. కాగా ఇప్పటివరకు 1 లక్ష 3500 గణనాథుల నిమజ్జనాలు జరిగాయి. అత్యధికంగా మూసాపేట ఐడీఎల్ చెరువులో 26,546 గణనాథుల నిమజ్జనం జరిగింది. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం వద్ద 4,730, నెక్లెస్ రోడ్ వద్ద 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5500 విగ్రహాల నిమజ్జనాలు జరిగాయి. ఇక అల్వాల్ కొత్తచెరువులో 6,221 వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరిగాయని అధికారులు తెలిపారు. గ్రేటర్‌లో మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి.


నిన్న ప్రశాంతంగా ముగిసిన మహా గణపతి నిమజ్జనం

మేళతాళాలు, నృత్యాల మధ్య ఉప్పొంగిన భక్తిభావంతో కూడిన నినాదాలతో పెద్ద సంఖ్య లో భక్తులు ఖైరతాబాద్ మహా గణనాథుడికి వీడ్కోలు పలికారు. మంగళవారం హైదరాబాద్‌లో మహా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. హుస్సేన్‌సాగర్‌, సరూర్‌నగర్‌, ఐడీఎల్‌ చెరువు సహా 73 చోట్ల నిమజ్జనం కోసం క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిభిరాలు అందుబాటులో ఉంచారు.


గ్రేటర్‌ పరిధిలో 35 వేల మందితో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వర్షం లేకపోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శోభాయత్రలో పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్‌ మార్గ్‌ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. మహా నిమజ్జనంలో ప్రధాన ఆకర్షణ ఖైరతాబాద్‌ గణేషుడిదే! 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మధ్యాహ్నం 1:40 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరాడు. ఉదయం 6:32 గంటలకు మొదలైన శోభాయాత్రలో వేలమంది భక్తులు పాల్గొన్నారు. 350 టన్నుల బాహుబలి క్రేన్‌తో 13 నిమిషాల్లోనే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశారు. మునుపైతే.. నిమజ్జనం చేశాక కూడా ఖైరతాబాద్‌ గణేషుడు నీళ్ల మీదే కనిపించేవాడు. అయితే వారం రోజులుగా 25 అడుగుల లోతు.. 35 అడుగుల వెడల్పుతో ప్రత్యేకంగా పూడిక తీయడంతో మహా గణపయ్య సంపూర్ణంగా గంగ ఒడికి చేరాడు! ఇక బాలాపూర్‌ గణపతి శోభాయాత్ర ఉదయం 11:20కి ప్రారంభమై ప్రశాంతంగా ముగిసింది.

Updated Date - Sep 18 , 2024 | 07:20 AM