Share News

Mahabubnagar: రష్యాలో నిత్యం నరకమే..

ABN , Publish Date - Sep 15 , 2024 | 03:17 AM

బాంబుల మోత.. తుపాకీ కాల్పులు.. తెలియని దేశం.. ఒక్క పూట భోజనం.. 15 గంటల పని.. దట్టమైన అడవి.. గడ్డ కట్టించే చలి.. స్లీపింగ్‌ బ్యాగులో నిద్ర.. ఇలా ఎనిమిది నెలలు నిత్యం నరకమే.

Mahabubnagar: రష్యాలో నిత్యం నరకమే..

  • ఎటు నుంచి బాంబులు పడతాయో తెలియదు.. అడవిలో స్లీపింగ్‌ బ్యాగ్‌లో పడుకునే వాళ్లం

  • తుపాకుల్లో బుల్లెట్లు నింపడం.. సొరంగాలు తవ్వడం.. మృతి చెందిన సైనికుల్ని మోసుకెళ్లడం..

  • ఇదే మా పని.. ఒక్క పూట భోజనం.. ప్రతి రోజూ 15 గంటల డ్యూటీ

  • రష్యా- ఉక్రెయిన్‌ సరిహద్దులో 8 నెలలు ఉన్నాం.. 60 మంది భారతీయులు చిక్కుకున్నారు

  • తిరిగొస్తామని ఊహించలేదు.. ఓ వీడియో చూసి ఎక్కువ జీతానికి ఆశపడ్డాం

  • మోసగించే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి.. ‘ఆంధ్రజ్యోతి’తో రష్యా నుంచి వచ్చిన సూఫియన్‌

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బాంబుల మోత.. తుపాకీ కాల్పులు.. తెలియని దేశం.. ఒక్క పూట భోజనం.. 15 గంటల పని.. దట్టమైన అడవి.. గడ్డ కట్టించే చలి.. స్లీపింగ్‌ బ్యాగులో నిద్ర.. ఇలా ఎనిమిది నెలలు నిత్యం నరకమే. పొట్టకూటి కోసం దుబాయి వెళ్లిన యువకులు.. ఒక ఏజెన్సీ యూట్యూబ్‌ వీడియో చూసి ఎక్కువ జీతం వస్తుందని ఆశ పడడమే.. వారిని కట్టుబానిసలను చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దులో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వచ్చింది. దౌత్యపరమైన చర్యలు, దేశాధినేతల చర్చలు, ఎంబసీల వినతులు వెరసి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్‌ సూఫియాన్‌తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఐదుగురు అక్కడి నుంచి బయటపడగలిగారు. శుక్రవారం రష్యా నుంచి ఇండియాకు చేరుకున్నారు. నరకయాతన అనుభవించి ఇంటికి వచ్చిన సూఫియాన్‌ను చూసి అతడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఎదురైన అనుభవాలను సూఫియాన్‌ ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.


  • మిమ్మల్ని రష్యాకు ఎవరు తీసుకెళ్లారు?

మాది నారాయణపేట జిల్లా కేంద్రం. 2021లో పని కోసం దుబాయి వెళ్లా. అక్కడ ఎమిరేట్స్‌లో కేటరింగ్‌ పని చేసేవాడిని. నెలకు రూ.30వేల వరకు వచ్చేవి. నాతోపాటు కర్ణాటకలోని గుల్బర్గకు చెందిన మరో ముగ్గురూ ఉండేవారు. ఈ క్రమంలో బాబా బ్లాగ్‌ యూట్యూబ్‌ చానల్‌లో ఒక వీడియో చూశాం. రష్యాలో సెక్యురిటీ గార్డు ఉద్యోగాలు ఉన్నాయని, రూ. లక్ష వరకు జీతం వస్తుందని తెలిసి.. నలుగురం అతడిని సంప్రదించాం. రూ. 3లక్షలు చెల్లిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని, మూడు నెలల శిక్షణలో రూ.40 వేలు, ఆ తర్వాత రూ.లక్ష వరకు జీతం వస్తుందంటే ఆశపడ్డాం. డబ్బులు చెల్లించాక పేపర్లు రెడీ చేసి మమ్మల్ని రష్యా తీసుకెళ్లారు.


  • మీరు మోసపోయారని ఎప్పుడు గ్రహించారు?

మమ్మల్ని తీసుకెళ్లిన ఏజెంట్‌ ముంబైకి చెందిన వాడే. దుబాయ్‌లో ఏజెన్సీ నడిపిస్తాడు. చెన్నైకి చెందిన నైజిల్‌ అనే వ్యక్తి, రష్యా పౌరుడు ఒకరు.. మాస్కోలో మమ్మల్ని రిసీవ్‌ చేసుకున్నారు. అక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోస్టారమ పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక హాస్టల్‌లో ఉంచారు. అక్కడే ఉద్యోగాలు ఇస్తారనుకొని సంతోషించాం. కానీ, నాలుగు రోజులు తర్వాత ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు మమ్మల్ని తీసుకెళ్లారు. వాళ్లు తీసుకెళ్లి అడవిలో వదిలేశాక.. మేము మోసపోయామని గుర్తించాం. భాష సమస్య కారణంగా మేము ఎంత చెప్పినా అక్కడున్న వారెవరూ వినిపించుకోలేదు. మా ఫోన్లలో ఇండియా సిమ్‌ కార్డులే ఉండడంతో ఎవరినీ సంప్రదించలేకపోయాం.


  • యుద్ధ భూమికి ఎలా వెళ్లారు? అక్కడి పరిస్థితులేంటి?

ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోనే మాకు ఆర్మీ డ్రెస్సులు ఇచ్చారు. హెలికాప్టర్‌లో చాలా దూరం తీసుకుపోయి.. ఉక్రెయిన్‌- రష్యా సరిహద్దుల్లోని క్యాంపులో వదిలేశారు. అక్కడ విపరీతమైన చలి వాతావరణం ఉండేది. పది కిలోమీటర్ల పరిధిలో కలాంచక్‌ అనే గ్రామం మాత్రమే ఉండేది. మాకు గన్‌ ఫైరింగ్‌తోపాటు గ్రెనైడ్లు వేయడం, సొరంగాలు తవ్వడం నేర్పించారు. గాయపడిన సైనికులను ఎలా తీసుకెళ్లాలి? బుల్లెట్లను ఎలా లోడ్‌ చేయాలి? క్షతగాత్రులకు ప్రథమ చికిత్స ఎలా చేయాలి? వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. బాబా పంపిన బ్యాచ్‌లో మాదే మొదటిది.. ఇండియాకు చెందిన వారు దాదాపు 60 మంది మాలాగే అక్కడ ఇరుక్కుపోయారు.


  • ఏం పనులు చేసేవారు..? భోజన వసతి ఎలా ఉండేది?

ప్రధానంగా సొరంగాలు తవ్వేవాళ్లం. తుపాకులు మోయడం, బుల్లెట్లు లోడ్‌ చేయడం, నీళ్లు నింపడం, ఎవరికైనా గాయాలైతే తీసుకెళ్లడం, మరణిస్తే మృతదేహాలను ప్యాక్‌ చేయడం వంటి పనులు చేసేవాళ్లం. డ్రోన్‌ దాడిలో గుజరాత్‌కు చెందిన హమిత్‌ మరణించిన తర్వాత చాలా భయమేసింది. రోజుకు ఒక్క సారి మాత్రమే భోజనం చేసేవాళ్లం. ఆ ఆహారం తినడం చాలా ఇబ్బందిగా ఉండేది. 12 నుంచి 15 గంటల వరకు పని ఉండేది. నేలపైనే పడక. చలి ఉండటంతో స్లీపింగ్‌ బ్యాగ్‌లో పడుకునే వాళ్లం.


  • మీ మానసిక పరిస్థితి ఎలా ఉండేది?

డ్రోన్ల ద్వారా బాంబులు పడేవి. శవాలను మోసుకువెళ్లే వాళ్లం. గాయపడిన వారికి చికిత్స చేసేవాళ్లం. అనుక్షణం.. భయం భయంగా గడిపేవాళ్లం. మేము వెళ్లిన 25 రోజుల తర్వాత రెండు నిమిషాలు ఇంట్లో వాళ్లతో మాట్లాడాం. గుజరాత్‌కు చెందిన వ్యక్తి చనిపోయాక ఓ వీడియో తీసి.. మమ్మల్ని ఇండియాకు రప్పించాలని వేడుకున్నాం. కళ్ల ముందే చాలామంది చనిపోతుంటే.. అల్లాను ప్రార్థించేవాళ్లం. మేము నలుగురం వెళ్తే చెన్నై నుంచి వచ్చిన మరో ఇద్దరు మాతో కలిశారు. శిక్షణ సమయంలో కలిసే ఉన్నాం. ఆ తర్వాత వివిధ క్యాంపులకు తీసుకెళ్లడంతో మానసికంగా కుంగిపోయాం. ఎప్పుడూ తుపాకులు పట్టుకొని తిరిగేవాళ్లం. ఎటు నుంచి మృత్యువు వస్తుందో తెలియని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు గుర్తుచ్చి రోజూ ఏడ్చేవాళ్లం.


  • ఇండియాకు తిరిగొస్తారని అనుకున్నారా? ఎవరెవరు సహకరించారు?

అక్కడి నుంచి బయటపడతామని అస్సలు అనుకోలేదు. మమ్మల్ని కాపాడేందుకు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దిన్‌ ఒవైసీ, సీఎం రేవంత్‌రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. ఎంపీ అసదుద్దీన్‌.. కేంద్ర మంత్రి జయశంకర్‌ను కలిసి మా పరిస్థితిని వివరించారు. రెండు దేశాల ఎంబసీలు ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాయి. ప్రధాని మోదీ కూడా రష్యాకు వచ్చిన సందర్భంలో ఈ విషయమై పుతిన్‌తో చర్చించారు. దీంతో మేము స్వదేశానికి రాగలిగాం. మీడియా కూడా ప్రముఖ పాత్ర పోషించింది. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. తొలివిడతలో మేము ఇండియాకు వచ్చాం.


  • ఉద్యోగ ఏజెన్సీల మోసాలపై ఎలాంటి చర్యలు అవసరం?

పొట్టకూటి కోసం ఆశపడే వారు ఎక్కువ జీతం వచ్చే పని కావాలనుకుంటారు. అలాంటి వారిని బాబా లాంటి వ్యక్తులు, ఏజెన్సీలు మోసం చేస్తున్నాయి. సదరు ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్‌ వీడియోలను బ్లాక్‌ చేసి, అలాంటి యూట్యూబర్స్‌పైనా చర్యలు తీసుకోవాలి.

Updated Date - Sep 15 , 2024 | 03:17 AM