Share News

Telangana : ప్రపంచంతోనే పోటీ

ABN , Publish Date - May 22 , 2024 | 05:30 AM

పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచంలోనే తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు.

Telangana : ప్రపంచంతోనే పోటీ

ఆ దిశగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఉండాలి

పరిశ్రమలకు అత్యుత్తమ గమ్యస్థానం కావాలి.. విదేశాల్లో అధ్యయనం చేసి రూపొందించండి

పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం ఆదేశం.. 6 విధానాలు రూపొందిస్తున్నామన్న అధికారులు

టెక్స్‌టైల్‌ పాలసీనీ సిద్ధం చేయాలన్న రేవంత్‌.. కోడ్‌ ముగిసిన వెంటనే ఏడు కొత్త పాలసీలు

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచంలోనే తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రాన్నే ఎంపిక చేసుకోవాలని, పారిశ్రామికాభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీపడాలని ఆకాంక్షించారు. ఆ దిశగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎ్‌సఐఐసీ)పై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై సీఎం పలు సూచనలు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను రూపొందించాలని, ఇందుకోసం వివిధ దేశాల్లో అమల్లో ఉన్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేయాలని అన్నారు. కాగా, కొత్తగా ఆరు విధానాలు సిద్ధం చేస్తున్నామని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎ్‌సఎంఈ పాలసీ, రాష్ట్రంలోని ఉత్పత్తులకు ఎగుమతులు పెంచి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్‌ సాధించేందుకు ఎక్స్‌పోర్ట్‌ పాలసీ, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫార్మా రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు న్యూ లైఫ్‌సైన్సెస్‌ పాలసీ, ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి ఈవీ పాలసీ, సహజ విద్యుత్తు ఉత్పత్తి పెంచేందుకు గ్రీన్‌ ఎనర్జీ పాలసీ, వైద్య పర్యాటకాన్ని పెంచేందుకు మెడికల్‌ టూరిజం పాలసీలను రూపొందిస్తున్నామని వివరించారు. కాగా, రాష్ట్రంలో చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కొత్త టెక్స్‌టైల్‌ పాలసీ రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

చేనేత రంగంపై ఆధారపడ్ద కుటుంబాలు రాష్ట్రంలోపెద్దసంఖ్యలో ఉన్నప్పటికీ.. వారికి సరైన ప్రోత్సాహం, సహకారం లేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చేనేత కార్మికుల ఆదాయం పెంచడం, వారికి నూతన టెక్నాలజీపై అవగాహన కల్పించడం, ఈ రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం వంటి అంశాలతో కొత్త పాలసీ ఉండాలని సూచించారు. ఇక్కడి చేనేత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఉండాలన్నారు. రాష్ట్రంలో వేలాది కుటుంబాలు తరతరాలుగా ఈ రంగాన్నే నమ్ముకుని జీవిస్తున్నాయని, పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే చేనేత రంగం అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. హ్యాండ్‌లూమ్‌, పవర్‌లూమ్‌ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు టెక్స్‌టైల్‌ పాలసీని సైతం సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసేలోపు పూర్తిస్థాయి పారిశ్రామిక విధానాలను సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాయని, పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించేలా కొత్త విధానాలు ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో టీఎ్‌సఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఈవో మధుసూదన్‌, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జి.మల్సూర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ఏడు కొత్త పారిశ్రామిక విధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది.


తిరుమలలో సీఎం..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శ్రీవారి దర్శనార్థం మంగళవారం తిరుమలకు చేరుకున్నారు. సీఎం అయ్యాక మొదటిసారిగా రేవంత్‌ కుటుంబసమేతంగా తిరుమలకు వచ్చారు. తిరుమలలోని రచన అతిథిగృహానికి మంగళవారం రాత్రి 7.20 గంటలకు చేరుకున్న రేవంత్‌రెడ్డికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న ఆయన మనవడి పుట్టు వెంట్రుకుల మొక్కు తీర్చుకుని బుధవారం ఉదయం 8.15 గంటలకు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. తిరిగి అతిథిగృహానికి చేరుకుని కొంతసమయం విశ్రాంతి అనంతరం తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు.

రాష్ట్ర గేయానికి కీరవాణి స్వరకల్పన సీఎంను కలిసి సూచనలు తీసుకున్న అందెశ్రీ, కీరవాణి

హైదరాబాద్‌, మే 21(ఆంధ్రజ్యోతి): అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ గేయానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయనున్నారు. ఈ పాటను రాష్ట్ర గేయంగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాటను ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఇతరచోట్లా వాడుకునేలా తీర్చిదిద్దుతున్నారు. దీనికి అందెశ్రీ కోరిక మేరకు కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డితో కీరవాణి, అందెశ్రీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ భేటీ అయ్యారు. పాట నిడివి, ఇతర అంశాలపై సీఎం సూచనలు తీసుకున్నారు. ఈ భేటీలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీపీఆర్వో అయోధ్య రెడ్డి కూడా పాల్గొన్నారు.

రాజీవ్‌గాంధీకి ఘన నివాళి

బేగంపేట, మే 21 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ మంత్రి జానారెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. నేతలంతా మంగళవారం సోమాజిగూడ చౌరస్తాలోని రాజీవ్‌ గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి.. అంజలి ఘటించారు. ప్రధానిగా దేశానికి రాజీవ్‌ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. గాంధీభవన్‌లో రాజీవ్‌ చిత్రపటానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌.. న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద రాజీవ్‌గాంధీ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. రాజీవ్‌ చేపట్టిన కార్యాచరణ వల్లనే దేశం సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులను సాధించిందన్నారు. ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క.. రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు.

Updated Date - May 22 , 2024 | 05:30 AM