Share News

Mahabubnagar : కృష్ణమ్మ కళకళ

ABN , Publish Date - Oct 23 , 2024 | 04:52 AM

కృష్ణమ్మ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా కళకళలాడుతూనే ఉంది. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తోడు వరదలతో నిండుకుండలానే ఉంటుంది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు ఈ ఏడాది వరద ఉధృతి కొనసాగుతోంది.

Mahabubnagar : కృష్ణమ్మ కళకళ

  • కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు ఈ ఏడాది రికార్డు వరద

  • శ్రీశైలం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా 1467 టీఎంసీల రాక

  • గతేడాది వచ్చింది కేవలం 145 టీఎంసీలే

  • వచ్చే నెలాఖరు దాకా ఇన్‌ఫ్లో

మహబూబ్‌నగర్‌, గద్వాల, నాగార్జునసాగర్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కృష్ణమ్మ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా కళకళలాడుతూనే ఉంది. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తోడు వరదలతో నిండుకుండలానే ఉంటుంది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు ఈ ఏడాది వరద ఉధృతి కొనసాగుతోంది. సీజన్‌ ప్రారంభం నుంచి ఎగువ నుంచి వరద వస్తుండడంతో ఈ ఏడాది మొదట్లోనే ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. నవంబరు నెలాఖరు వరకు వరద కొనసాగే అవకాశం కనిపిస్తుంది. గతేడాది శ్రీశైలం ప్రాజెక్టుకు కేవలం 145 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. కానీ, ఈ ఏడాది ఇప్పటికే 1467 టీఎంసీల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టును చేరింది. జూరాల ప్రాజెక్టుకు ఈ ఏడాది ఇప్పటివరకు 1062.65 టీఎంసీల వరద వచ్చింది. ఆలమట్టి రిజర్వాయర్‌ ఈ ఏడాది జూలై మొదటి వారంలోనే నిండింది. దీంతో నీటి విడుదల జరిగి దిగువన ఉన్న నారాయణపూర్‌, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో లోటు వర్షపాతం, ఎగువన ఉన్న కర్ణాటకలోనూ వర్షాలు కురవకపోవడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు గతేడాది అత్యల్పంగా 145 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. ఫలితంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు జూరాల కింద ఆయకట్టుకు క్రాప్‌ హాలిడే ఇచ్చారు.

తాగునీటికి ఇబ్బందులు తలెత్తడంతో వేసవిలో కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి 1.90 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేసుకున్నారు. ఈ ఏడాది ఎగువ నుంచి వరద తక్కువగా వచ్చినప్పటికీ జూరాల, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో అధిక వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు అధికంగా వరద వచ్చి చేరుతోంది. వచ్చే నెలాఖరు వరకు వరద కొనసాగే అవకాశం ఉండడంతో ఈసారి యాసంగి సాగుకు క్రాప్‌ హాలీడే ప్రకటించాల్సిన అవసరం కనిపించడం లేదు.


అలాగే తాగునీటికీ ఇబ్బంది తలెత్తే అవకాశం లేదు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి ఏపీ వైపు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా, తెలంగాణ వైపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. అలాగే ఎడమ, కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రాల ద్వారా విద్యుద్పుత్తి కొనసాగుతోంది. వరద నిలిచిన తర్వాత ఇబ్బడిముబ్బడిగా విద్యుద్పుత్తి చేస్తే తప్పా ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలకు ఢోకా ఉండదు. అలాగే, యాసంగిలో ప్రధాన ప్రాజెక్టులతోపాటు, ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టుకు కూడా ఇబ్బంది ఉండదు.

  • తుంగభద్రకు భారీగా వరద

తుంగభద్ర నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. మంగళవారం మధ్యాహ్నం 90 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో ఉండగా మరింత వరద వచ్చి చేరుతుండటంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యామ్‌ గేట్లను ఎత్తి 1,20,000 క్యూసెక్కులను దిగువకు విడిచిపెట్టారు. ఇక, ఆల్మట్టికి 38 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 25 వేల క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు. నారాయణపూర్‌కు 35 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా 30 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు 64 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా గేట్ల ద్వారా 24,678 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 37,480 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 94 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా రెండు గేట్ల ద్వారా 55 వేల క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 66 వేల క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.


  • సాగర్‌ గేట్ల మూసివేత

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గడంతో ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లను అధికారులు మూసివేశారు. సోమవారం అర్ధరాత్రి వరకు 20 క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని విడుదల చేయగా వరద తగ్గడంతో మంగళవారం ఉదయం 9 గంటలకు రెండు గేట్లు మూసివేశారు. అక్కడి నుంచి ప్రతీ గంటకు రెండేసి గేట్లు చొప్పున మూసేస్తూ సాయంత్రానికి 2 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. రాత్రి పది గంటలకు వాటిని కూడా మూసేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 588.90 అడుగులుగా నమోదైంది. మరోపక్క, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని మూడు నెలల్లోనే చేరుకున్నారు. 1,400 మిలియన్‌ యూనిట్లు లక్ష్యంతో జూలై 24న విద్యుద్పుత్తి ప్రారంభించగా మంగళవారం మధ్యాహ్నంకు లక్ష్యాన్ని చేరుకున్నామని జెన్‌కో సీఈ మంగే్‌షకుమార్‌ తెలిపారు.

Updated Date - Oct 23 , 2024 | 04:52 AM