Share News

నేటి నుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం

ABN , Publish Date - May 06 , 2024 | 12:08 AM

జిల్లాలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు

నేటి నుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం

సిద్దిపేట మినహా ఆరు కళాశాలల్లో అందుబాటులో లేని సరైన కోర్సులు

దుబ్బాకలో సొంత భవనం లేక అవస్థలు

హుస్నాబాద్‌లో అసంపూర్తి భవనం

దుబ్బాక, మే 5 : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ(దోస్త్‌)-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సోమవారం నుంచి దోస్త్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది. మూడు విడతలుగా సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. డిగ్రీ కళాశాలలో సీటు కోసం విద్యార్థులు నేటి నుంచి తమ రిజిస్ట్రేషన్‌ను చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకునే విద్యార్థులు మొదటి విడత రూ.200 రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 15 నుంచి 25 వరకు వెబ్‌ ఆప్షన్‌లు ఇచ్చుకునే అవకాశం ఉంది. వచ్చే నెల జూన్‌ 3 నుంచి తొలి విడత సీట్ల కేటాయింపులు జరగనున్నాయి. జూన్‌ 4 నుంచి 10 వరకు కేటాయించిన కళాశాలలో సెల్ప్‌ రిపోర్టులు చేయాలి. రెండో విడత ఆప్షన్‌ల కోసం రూ.400 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జూన్‌ 4 నుంచి 13 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. జూన్‌ 4 నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్‌లకు అవకాశం ఇచ్చింది. అదే నెల 18న సీట్ల కేటాయింపు చేయగా, 19 నుంచి 24లోపు కళాశాలలో రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించారు. మూడో దశలో రూ.400 రుసుము చెల్లించి, జూన్‌ 19 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 25 వరకు వెబ్‌ ఆప్షన్‌లకు అవకాశం ఇచ్చారు. జూన్‌ 29న సీట్ల కేటాయిస్తారు. 29 నుంచి జూలై 3 వరకు రిపోర్టు చేయాలి.

సిద్దిపేట డిగ్రీ కళాశాలలోనే కొత్త కోర్సులు

సిద్దిపేట జిల్లాలో ఏడు ప్రభుత్వ కళాశాలలు ఉండగా అందులో 3,540 సీట్లున్నాయి. ఏడింటిలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాత్రమే తగిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ఇప్పటివరకు 18 కోర్సులు ఉండగా, కొత్తగా మరో రెండు కోర్సులు మంజూరయ్యాయి. జిల్లాలోని మిగిలిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కేవలం నాలుగు కోర్సులు మాత్రమే కొనసాగుతున్నాయి. దుబ్బాక డిగ్రీ కళాశాలలో అయితే మూడే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని చాలా కళాశాలల్లో తగిన కోర్సులు లేకపోవడంతో తమకు నూతనంగా మరిన్నీ కోర్సులు మంజూరు చేయాలనే డిమాండ్‌ ఉంది.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల వారీగా సీట్లు

సిద్దిపేట(అటానమస్‌) 1560

సిద్దిపేట మహిళా కళాశాల 240

దుబ్బాక కళాశాల 240

గజ్వేల్‌ మహిళా కళాశాల 540

గజ్వేల్‌ కళాశాల 360

చేర్యాల కళాశాల 240

హుస్నాబాద్‌ కళాశాల 240

సొంత భవనాలు లేక అవస్థలు

దుబ్బాక, హుస్నాబాద్‌లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు తగినన్ని వసతులు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. దుబ్బాక డిగ్రీ కళాశాల అయితే ప్రాథమిక పాఠశాల నంబర్‌ 2 భవనంలో కొనసాగిస్తున్నారు. కనీస వసతులు లేని కళాశాల భవనంలో ప్రయోగశాలలు, విద్యార్థులకు తగిన గదులు లేవు. అలాగే హుస్నాబాద్‌లోని డిగ్రీ కళాశాల భవనం అసంపూర్తిగానే వదిలేశారు. దీంతో అవస్థలు తప్పడంలేదు.

Updated Date - May 06 , 2024 | 12:08 AM