Share News

ఇంత తక్కువ ఇస్తే ఎట్లా?

ABN , Publish Date - May 06 , 2024 | 12:05 AM

స్కూల్‌ యూనిఫామ్స్‌ కుట్టు కూలీ కేవలం రూ.50 !

ఇంత తక్కువ ఇస్తే ఎట్లా?

గిట్టుబాటు కాదంటున్న స్థానిక టైలర్లు

మెటీరియల్‌ ఖర్చులకు సరిపోదని కుట్టేందుకు విముఖత

పాఠశాలల పునఃప్రారంభానికి ముందే యూనిఫామ్‌లు అందేనా?

మద్దూరు, మే 5 : స్థానిక టైలర్లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో యూనిఫామ్‌లను తయారు చేయించి పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు అందించేందుకు జిల్లా విద్యాశాఖ ప్రణాళికను రూపొందించింది. అయితే, ఒక్కో డ్రెస్‌కు చెల్లిస్తున్న ధర గిట్టుబాటు కావడం లేదని టైలర్లు కుట్టేందుకు విముఖత చూపిస్తున్నారు. జత కుట్టుకూలీ కేవలం రూ.50 ఇస్తుండడంతో టైలర్లతో పాటు ఏజన్సీలు ముందుకు రావడం లేదు.

జిల్లాలో 1.10 లక్షల మంది విద్యార్థులు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తంగా దాదాపు 1.10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలు 571 ఉండగా, అందులో బాలురు 14,047, బాలికలు 14,237 మంది చదువుతున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు 113 ఉండగా బాలురు 17,033, బాలికలు 17,221 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఉన్నత పాఠశాలలు 224 ఉండగా బాలురు 18,145, బాలికలు 14,507 మంది ఉన్నారు. కేజీబీవీలు 22 ఉండగా బాలికలు 4,717, మోడల్‌ స్కూళ్లు 14 ఉండగా బాలురు 3,521, బాలికలు 5,327 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. మద్దూరు, దూళిమిట్ట మండలాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల, మోడల్‌స్కూల్‌తో పాటుగా ఆరు ఉన్నత పాఠశాలల్లో మొత్తం 2,021 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.

దుస్తుల తయారీకి ఆదేశాలు జారీ అయినా..

పాఠశాలలు ముగిసేనాటికి ముందే మండల ఎంఆర్సీ కార్యాలయానికి దుస్తుల తయారీపై స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాలలకు ప్రకటించిన సెలవు రోజులకు ముందే విద్యార్థులకు సరిపడా కొలతలు తీసుకుని విద్యాశాఖకు పంపిస్తే ఎంఆర్సీ కార్యాలయానికి సరిపడ క్లాత్‌ సరఫరా అయ్యేది. కానీ పాఠశాలలకు సెలవులు ప్రకటించే నాటికి మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక టైలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి టైలర్లకు అవగాహన కల్పించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. గతంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల యూనిఫామ్‌ తయారీ హుస్నాబాద్‌లోని ఓ మహిళా ఏజేన్సీకి అప్పగించేవారు. దీంతో విద్యార్థులకు సరపడా కొలతలు కుదరక పొడవుగా, పొట్టిగా, వదులుగా, బిగుతుగా తయారైన యూనిఫామ్‌లు పాఠశాలలకు చేరేవి. దీంతో విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించే సమయంలో ఉపాధ్యాయులకు తలనొప్పులు ఎదురయ్యేవి. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే ముందస్తుగా విద్యాశాఖ రూపొందించిన ప్రణాళిక ప్రకారంగా జారీ చేసిన ఆదేశాలు అమలయ్యేలా కన్పించడం లేదు.

పెరిగిన మెటీరియల్‌ ధరలు

నిత్యావసర వస్తువుల ధరలతోపాటు దుస్తుల తయారీకి ఉపయోగించే మెటీరియల్‌ ధరలూ పెరిగాయి. ఒక్కో డ్రెస్సుకు సుమారు రూ.600 నుంచి 800ల వరకు తీసుకుంటున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక్కో యూనిఫామ్‌కు కేవలం రూ.50 మాత్రమే అందిస్తున్నారు. దీంతో ఏజెన్సీలు ముందుకు రాని పరిస్థితి నెలకొన్నది. దీంతో పాటు స్థానికంగా ఉండే టైలర్లు కూడా విముఖత చూపిస్తున్నారు.

రూ.50 అంటే గిట్టుబాటు కాదు

స్థానిక టైలర్లకు ఉపాధి కల్పించేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమే అయినా ఒక్కో డ్రెస్సుకు కుట్టుకూలీ రూ.50 చెల్లిస్తామనడం సరికాదు. కనీసం అమ్మాయిల డ్రెస్సుకు 200 అందిస్తే తప్ప గిట్టుబాటు కాదు.

-కొరిగింజ రజిని లేడీస్‌ టైలర్‌, మద్దూరు

ఒక్కో డ్రెస్సుకు రూ.400 చెల్లించాలి

ఒక్కో డ్రెస్సుకు కనీసం రూ.600 నుంచి 800 తీసుకుంటాం. కనీసం రూ.400 చెల్లిస్తేనే కూలీ గిట్టుబాటు అవుతుంది. టైలర్‌షాపుల్లో పనిచేస్తున్న వర్కర్లకు ఒక్కో డ్రెస్సుకు రూ.300 చెల్లిస్తున్నారు. ఖాజాలు గుండీలు కుట్టినందుకు ఒక్కో షర్టుకు రూ.15 ఖర్చవుతుంది. నాణ్యతతో కూడిన మెటీరియల్‌ వినియోగిస్తాం. ప్రభుత్వం ఒక్కో డ్రెస్సు కుడితే రూ.50 మాత్రమే చెల్లిస్తానని చెప్పడం శోచనీయం.

- కొండ పాండు, జెంట్స్‌ టైలర్‌, మద్దూరు

Updated Date - May 06 , 2024 | 12:05 AM