Share News

నాయకులు జేబుదొంగలు, బందిపోట్లుగా మారారు

ABN , Publish Date - May 08 , 2024 | 11:20 PM

గజ్వేల్‌/నర్సాపూర్‌/ మే 8: దేశంలో రాజకీయ నాయకులు జేబుదొంగలు, బందిపోట్లుగా మారారని జాగో తెలంగాణ కన్వీనర్‌, విశ్రాంత ఐఏఎస్‌ ఆకునూరి మురళి విమర్శించారు.

నాయకులు జేబుదొంగలు, బందిపోట్లుగా మారారు
గజ్వేల్‌ పట్టణంలో మాట్లాడుతున్న విశ్రాంత ఐఏఎస్‌ ఆకునూరి మురళి

పదేళ్లలో బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు

పాకిస్థాన్‌ను బూచీగా చూపించి ఓట్లు దండుకునే కుట్రలకు మోదీ పన్నాగం

రాజకీయాల కోసం బస్సు యాత్ర చేపట్టలేదు

జాగో తెలంగాణ కన్వీనర్‌, విశ్రాంత ఐఏఎస్‌ ఆకునూరి మురళి

గజ్వేల్‌/నర్సాపూర్‌/ మే 8: దేశంలో రాజకీయ నాయకులు జేబుదొంగలు, బందిపోట్లుగా మారారని జాగో తెలంగాణ కన్వీనర్‌, విశ్రాంత ఐఏఎస్‌ ఆకునూరి మురళి విమర్శించారు. జాగో తెలంగాణ, టీడీఎ్‌సఏఫ్‌ అధ్వర్యంలో సాగుతున్న ఓటర్ల చైతన్య బస్సు యాత్ర బుధవారం 8వ రోజు గజ్వేల్‌ ఇందిరాపార్క్‌ చౌరస్తాకు చేరుకున్నది. అలాగే, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో, సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కనిపిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం ఎవరికి కనిపించదని ఆకునూరి మురళి పేర్కొన్నారు. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. కేవలం పాకిస్థాన్‌ను బూచీగా చూపించి ఓట్లు దండుకునే కుట్రలకు మోదీ పన్నాగం పన్నాడని మండిపడ్డారు. 2024 వరకు ప్రతి నిరుపేదకు ఇళ్లు కట్టిస్తానని చెప్పారని, ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పాలన్నారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారి ప్రతిపక్షాలను విమర్శించడం తప్ప తాను ఏం చేశాడో ఇప్పటివరకు చెప్పలేదన్నారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోదీని ఓడించాలని, ప్రజా సంక్షేమాన్ని, సుస్థిర అభివృద్ధిని గాలికి వదిలి అధికారం కోసం విద్వేషాలు రెచ్చగొడుతూ, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్న మోదీని గద్దె దింపాలన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లను ఎత్తివేస్తామని పదే పదే ప్రకటిస్తున్న మోదీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారి దేవుళ్ల పేరుతో ఓట్లను అడగటం సిగ్గు చేటన్నారు. సంవత్సారానికి రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తానని, నల్లధనాన్ని స్వాధీనం చేసుకొని పెదలకు పంచుతానన్న మోదీ హామీని మరిచారని పేర్కొన్నారు. రాజకీయాల కోసం బస్సు యాత్ర చేపట్టలేదని, ప్రజలను చైతన్యం చేయడానికే యాత్ర చేపట్టినట్లు తెలిపారు. నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇతర దేశాల మాదిరిగా రెండుసార్లకు మించి ప్రధాని పదవిని ఇవ్వొద్దన్నారు. ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు లంచాలు తిని రాజకీయాల్లోకి వస్తున్నారని మండిపడ్డారు. ఈ బస్సు యాత్రలో ప్రొఫెసర్లు కె.లక్ష్మీనారాయణ, పద్మజాషా, జానయ్య, డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు, యూత్‌ లీడర్‌ పులి నవీన్‌కుమార్‌, గోవర్దన్‌రాయ్‌, రాంచందర్‌, శ్రీకాంత్‌, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:20 PM