Share News

కరెంట్‌బిల్లు కట్టేద్దామా

ABN , Publish Date - Jul 24 , 2024 | 11:57 PM

స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత వివిధ యాప్‌లలో ఆహారం, కూరగాయలు, వస్తువులు, దుస్తులు.. ఇలా ఒక్కటేంటి అన్ని కూర్చున్న చోటు నుంచే ఆర్డర్‌ చేస్తున్నారు. ఇక నగదు చెల్లింపులు, డబ్బు లావాదేవీలకు కూడా పలు యాప్‌లను ఉపయోగిస్తున్నారు.

కరెంట్‌బిల్లు కట్టేద్దామా

అధికారిక యాప్‌లోనే విద్యుత్‌ బిల్లు చెల్లింపులు

ఫోన్‌ పే, గూగుల్‌ పే, ఇతర యాప్‌లకు స్వస్తి

నూతన విధానాలను ప్రకటించిన ఆర్‌బీఐ

థర్డ్‌ పార్టీ ద్వారా వద్దంటూ సూచన

కార్యాలయంలోనూ చెల్లించే వెసులుబాటు

సిద్దిపేట టౌన్‌, జూలై 24 : స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత వివిధ యాప్‌లలో ఆహారం, కూరగాయలు, వస్తువులు, దుస్తులు.. ఇలా ఒక్కటేంటి అన్ని కూర్చున్న చోటు నుంచే ఆర్డర్‌ చేస్తున్నారు. ఇక నగదు చెల్లింపులు, డబ్బు లావాదేవీలకు కూడా పలు యాప్‌లను ఉపయోగిస్తున్నారు. నెలవారీగా బ్యాంకులకు చెల్లించాల్సిన వాయిదాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన విద్యుత్‌ బిల్లులు తదితరాల ను ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా చేస్తున్నారు. పలు యాప్‌ల ద్వారా చెల్లిస్తున్న పేమెంట్‌లపై రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) దృష్టి సారించింది. విద్యుత్‌ వినియోగదారులు చాలా మంది బిల్లులను థర్డ్‌ పార్టీ ద్వారా చెల్లిస్తుండడడంతో ఫోన్‌ పే, గూగూల్‌ పే తదితర వాటి నుంచి పేమెంట్లకు బ్రేక్‌ వేసింది.

జిల్లాలో 5,76,076 విద్యుత్‌ కనెక్షన్లు

జిల్లావ్యాప్తంగా 5,76,076 విద్యుత్‌ వినియోగదారులున్నారు. వీరిలో గృహజ్యోతి పథకం కింద 1,83,214, రైతులు ఉచిత విద్యు త్‌ కింద 1,65,978 వినియోగదారులున్నారు. సిద్దిపేట జిల్లాలో 2,26,884 మంది వినియోగదారుల్లో గృహానికి సంబంధించి డొమెస్టిక్‌, పలు వ్యాపారాలకు సంబంధించిన కమర్షియల్‌ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 60 నుంచి 70 శాతం ఇంతకాలం ఫోన్‌ పే, గూగుల్‌పే, పేటియం ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నారు.

థర్డ్‌ పార్టీ ద్వారా వద్దంటూ

విద్యుత్‌ బిల్లులకు సంబంధించిన చెల్లింపులు థర్డ్‌పార్టీ అయిన నగదు చెల్లించే యాప్‌ల ద్వారా తీసుకోవద్దంటూ, అందుకు స్వస్తి పలకాలని విద్యుత్‌ సంస్థలకు ఆర్‌బీఐ పలు సూచనలు జారీచేసింది. జూలై 1 నుంచి పలు యాప్‌ ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లించవద్దంటూ వినియోగదారులకు విద్యుత్‌ సంస్థలు వెల్లడించాయి. వినియోగదారులు ఆందోళన చెందకుండా విద్యుత్‌ కార్యాలయంలో చెల్లించాలని ఆ శాఖ అధికారుల సూచిస్తున్నారు. గతంలో ఆన్‌లైన్‌ రాకముందు చెల్లించిన తీరులాగే చెల్లించాలని వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్‌, యాప్‌లలో చెల్లించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

అధికారిక వెబ్‌సైట్‌, యాప్‌లోనే..

జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ వినియోగదారులు గత నెల వరకు చెల్లించిన పలు యాప్‌ల మాదిరిగానే అధికారిక వెబ్‌సైట్‌, యాప్‌లో విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ముందుగా టీజీఎ్‌సపీడీసీఎల్‌ అధికారిక వెబ్‌ సైట్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. టీజీఎ్‌సవోయూటీహెచ్‌ఈఆర్‌ఎన్‌పీవోడబ్ల్యూఈఆర్‌.వోఆర్‌జీ లోకి వెళ్లాలి. అందులో పే బిల్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ విద్యుత్‌ యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌ నమోదు చేసి సబ్‌మిట్‌ బటన్‌ నొక్కాలి. అక్కడ బిల్లుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత క్లిక్‌ హియర్‌ టూ పే అనే ఆప్షన్‌ను టచ్‌ చేయాలి. దీంతో మరో పేజీ ఓపెన్‌ అయ్యి బిల్లు చెల్లించేందుకు రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. డెబిట్‌కార్డు, టీ వ్యాలెట్‌ ఆప్షన్లలో ఒక దానిని ఎంపిక చేసుకుని బిల్‌ క్లియర్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌ ద్వారానే కాకుండా టీజీఎ్‌సపీడీసీఎల్‌ యాప్‌ నుంచి కూడా విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చు. వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి టీజీఎ్‌సపీడీసీఎల్‌ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేశాక బిల్‌ పేమెంట్‌ చేసుకోవచ్చు. దాంతో పాటు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా బిల్లులు చెల్లించవచ్చని అధికారులు వెల్లడించారు. అలాగే విద్యుత్‌ కార్యాలయం, మీసేవా కేంద్రాల్లో కూడా బిల్లులను చెల్లించవచ్చు.

Updated Date - Jul 24 , 2024 | 11:57 PM