Share News

కాంగ్రెస్‌కు టీజేఎస్‌ సంపూర్ణ మద్దతు

ABN , Publish Date - May 06 , 2024 | 11:29 PM

సంగారెడ్డి అర్బన్‌, మే 6 : పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ జన సమితి పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం తెలిపారు.

కాంగ్రెస్‌కు టీజేఎస్‌ సంపూర్ణ మద్దతు
సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీజేఎస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం

రాజ్యాంగ పరిరక్షణ కోసం హస్తానికి ఓటేయండి

తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం

సంగారెడ్డి అర్బన్‌, మే 6 : పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ జన సమితి పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం తెలిపారు. సంగారెడ్డిలోని ఓ హోటల్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ పదేళ్ల హయాంలో దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదన్నారు. వ్యవసాయ రంగంలో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని మోదీ సర్కారు రెట్టింపు చేస్తామని ప్రకటించినప్పటికీ, వాస్తవానికి రైతుల ఆదాయం 10 శాతం తగ్గిందన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు 50 శాతం మంది అప్పుల పాలయ్యారని, దాదాపు లక్షా 70 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని దుయ్యబట్టారు. ఎరువులపై సబ్బిడీ దాదాపు 40 శాతం తగ్గిపోయిందన్నారు. మద్దతు ధరను చట్టబద్దం చేయలేకపోయిందని ఆరోపించారు. రైతులకు వ్యవసాయం భారంగా మారిందన్నారు. 2014-23 మధ్యలో నిరుద్యోగ సమస్య 2 నుంచి 8 శాతానికి పెరిగిందన్నారు. నోట్ల రద్దుతో పెద్ద, చిన్నతరహా పరిశ్రమలు నడవలేని దుస్థితికి చేరాయన్నారు. గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, భావోద్వేగాలు రెచ్చగొట్టేలా విధ్వంసకర ప్రసంగాలు చేయడం, ఇంకా అవకాశమిస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామంటున్నారని ఆరోపించారు. కార్పొరేట్‌ రంగానికి ఊడిగం చేసే ఆలోచనలో బీజేపీ ఉన్నదని, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి, ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఈ సమావేశంలో టీజేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జహీరాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఆశప్ప, జిల్లా అధ్యక్షుడు, మెదక్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి పాతదొడ్డి తుల్జారెడ్డి, నాయకులు లక్ష్మీ, రాంరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సాయిలు, పాండు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2024 | 11:29 PM