మోదీకి ఓటమి భయం
ABN , Publish Date - Apr 23 , 2024 | 04:49 AM
ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే
అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు
ఏం చేసినా.. వచ్చేది ఇండియా కూటమి సర్కారే
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతయ్
అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్.. ఇద్దరూ తోడు దొంగలే
పదేళ్లు వారిని చూశారు.. ఇక కాంగ్రెస్‌ను దీవించండి
జీవన్‌రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది
పసుపు బోర్డు ఏర్పాటు జీవోలో నిజామాబాద్ పేరేది?
బండిని, గుండును ప్రజలు నమ్మరు: సీఎం రేవంత్
ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్‌లో కాంగ్రెస్ సభలు
ఆదిలాబాద్/మేడ్చల్/నిజామాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను గుంజుకొని ముస్లింలకు పంచుతారన్న మోదీ ఆరోపణలను ఆయన ఖండించారు. ‘‘ఇది సాధ్యమేనా.!? రాజ్యాంగం ప్రకారం ఎవరి ఆస్తులను ఎవరూ తీసుకునే హక్కు లేదు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి రాజకీయ లబ్ధి పొందాలని మోదీ చూస్తున్నారు’’ అని విమర్శించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలతోపాటు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని అంతాయపల్లిలో సోమవారం నిర్వహించిన జనజాతర సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మతాల ఆధారంగా ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయని, దేవుడు గుడిలో ఉండాలని, భక్తి గుండెల్లో ఉండాలని అభిప్రాయపడ్డారు. రాముడు బీజేపీ వాళ్లకే కాదు.. తమకూ దేవుడేనని, ఇతర దేవుళ్లను కూడా తాము ఆరాధిస్తామని తెలిపారు. నేను హిందువునైనందుకు గర్విస్తానని, అదే సమయంలో ఇతర మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. మతసామరస్యాన్ని కాపాడే కాంగ్రె్‌సను గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో మోదీ, గల్లీలో కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. సీఎంగా కేసీఆర్, పీఎంగా మోదీ పదేళ్ల పాటు ఉండి.. ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదు. వంద రోజుల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన మా ప్రభుత్వాన్ని మాత్రం పడగొట్టాలంటున్నారు. మరి పదేళ్లు అధికారంలో ఉన్నోళ్లను నడి బజార్లో ఉరి తీయాల్నా.. వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాల్నా మీరే నిర్ణయించాలి.. అయినా, మా ప్రభుత్వాన్ని ఎందుకు కూలగొట్టాలి? మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకా? లేక రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచినందుకా? 40లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండ్ ఇస్తున్నందుకా? ప్రతి పేదవాడికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నందుకా?’’ అని ప్రశ్నించారు. తమ పథకాలను చూసి మోదీ, కేసీఆర్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. వంద రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన తమ సర్కారును పడగొడితే నిరుద్యోగులు చూస్తూ ఊరుకుంటారా!? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాపాలన మొదలైందని, ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఐదింటిని అమలు చేశామని గుర్తు చేశారు. బాసర సరస్వతీ దేవి సాక్షిగా.. వచ్చే పంద్రాగస్టులోగా 2లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తనదని అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొంటామని, క్వింటాల్‌కు రూ.500బోనస్ ఇస్తామని భరోసా ఇచ్చారు. వారు కోరుకుంటున్నట్లు రాష్ట్రంలో కాంగ్రె్‌సను ఓడగొడితే పథకాలన్నీ ఆగిపోయే ప్రమాదం ఉందని అన్నారు.
వరి వేస్తే ఉరేనన్న చరిత్ర కేసీఆర్‌ది..
వరి వేస్తే ఉరే అని చెప్పిన చరిత్ర కేసీఆర్‌దని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందుకే ఆయనను శాసనసభ ఎన్నికల్లో రాజకీయంగా ప్రజలు గోతి తీసి పాతిపెట్టారన్నారు. నిజామాబాద్ రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తారని ఇక్కడి రైతులు నిరూపించారన్నారు. చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పి మాట తప్పిన కవితను 2019 ఎన్నికల్లో రాజకీయ సమాధి చేశారని గుర్తు చేశారు. ఇక, ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని హామీ ఇచ్చి గెలిచిన అర్వింద్.. ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. గత అక్టోబరులో పసుపు బోర్డుపై మోదీ ప్రకటన చేశారే కానీ, ఆ జీవోలో ఎక్కడ పెడతారో స్పష్టం చేయలేదన్నారు. స్పైసెస్ బోర్డును పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్న అర్వింద్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. బండిని, గుండును ఇక్కడి ప్రజలు నమ్మబోరని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ 17లోగా మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఆదిలాబాద్‌కు వర్సిటీ మంజూరు చేస్తా
ఎవరెన్ని కుట్రలు చేసినా దేశంలో వచ్చేది ఇండియా కూటమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా జీవన్‌రెడ్డిని గెలిపిస్తే పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని ఒప్పించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును నిర్మిస్తామని, కేసీఆర్ హయాంలో తొలగించిన అంబేడ్కర్ పేరునే మళ్లీ ప్రాజెక్టుకు పెడతామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీని మంజూరు చేస్తామన్నారు. మోదీ, కేడీ కలిసి సీసీఐ సిమెంట్ పరిశ్రమను మూసేశారని, ఆ ఫ్యాక్టరీని తెరిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. కుప్టి ప్రాజెక్టును పూర్తి చేసి, బోథ్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. బీసీలకు దామాష ప్రకారం నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ట్రిపుల్ ఐటీ, ఐటీఐఆర్ కారిడార్ వంటివి ఇవ్వకుండా మోసం చేసిన మోదీ.. సంకుచిత స్వభావంతో నిధులన్నీ గుజరాత్‌కే తరలిస్తున్నారని విమర్శించారు. మోదీకి ఓటేసినా, కేసీఆర్‌కు ఓటేసినా ఒక్కటేనని, వారిద్దరూ తోడుదొంగలని విమర్శించారు. తోడు దొంగల్లో ఒకరిని డిసెంబరు 7న బండకేసి కొట్టారని, రెండో దొంగను వచ్చే నెలలో గోడకేసి కొట్టాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ బరిలో ఉన్న ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు.
మల్కాజిగిరి ప్రజలను మరిచిపోను
కుట్ర చేసి కొడంగల్‌లో తనను ఓడిస్తే.. మల్కాజిగిరి ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని, వారిని ఎప్పటికీ మరచిపోనని రేవంత్ అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో మల్కాజ్గిరి పరిధిలోని సమస్యలపై పోరాడనన్నారు. కానీ, బీఆర్ఎస్ పెద్దలు కుట్ర చేసి అభివృద్ధికి అడ్డుపడ్డారని ఆరోపించారు. ఇక్కడ సునీతారెడ్డిని గెలిపించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. టీఆర్‌ఎ్‌సతో బీజేపీకి రహస్య ఒప్పందం ఉన్నందునే కేసీఆర్ అవినీతి, ఫోన్ ట్యాపింగ్‌పై ఈటల మాట్లాడడం లేదని విమర్శించారు. మోదీ ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు సిద్దమా..? ఈటల సిద్ధమైతే మైనంపల్లిని పంపిస్తానని సవాల్ విసిరారు. కోకాపేట్లా మల్కాజ్‌గిరిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
నామినేషన్లకు హాజరు కాని రేవంత్‌రెడ్డి
ఆదిలాబాద్/ నిజామాబాద్, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్, నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కాలేదు. ఆదిలాబాద్‌లో ఆత్రం సుగుణ నామినేషన్‌కు సీఎం హాజరు కావాల్సి ఉన్నా.. పర్యటన రెండు గంటల పాటు ఆలస్యం కావడంతో బహిరంగ సభలో పాల్గొని వెనుదిరిగారు. దీంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు తదితరులతో కలిసి ఆత్రం సుగుణ నామినేషన్‌ను దాఖలు చేశారు. నిజామాబాద్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డి వెళ్లినా.. సమయం మించిపోవడంతో జిల్లా కలెక్టరేట్ గేటు వద్ద నుంచీ వెనుదిరిగి వచ్చి జనజాతర సభలో పాల్గొన్నారు. కాగా, జీవన్‌రెడ్డి.. మంగళవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
నేడు 2 జిల్లాల్లో సీఎం పర్యటన
నాగర్‌కర్నూల్/మద్దూర్, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్‌లో ఉదయం 11 గంటలకు జరిగే కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత తిమ్మారెడ్డిపల్లిలో బావోజీ బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లిలో జనజాతర సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లు రవి నామినేషన్ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు.
అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేసిన ముగ్గురిపై కేసు
మూడుచింతలపల్లి: సీఎం సభ సందర్భంగా అనుమతులు లేకుండా డ్రోన్‌ను ఎగురవేసిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మునిసిపాలిటీ అంతాయిపల్లిలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సభ జరుగుతుండగా కొందరు డ్రోన్‌ను ఎగురవేశారు. దీన్ని గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై, డ్రోన్‌ను ఆపరేట్ చేస్తున్న ఎండీ ఇబ్రీస్, గణే్‌షరెడ్డి, అక్షయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేకుండా డ్రోన్ కెమెరాను వాడటంతోపాటు డ్రోన్వల్ల వీఐపీకి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందు వల్ల వారిపై కేసు నమోదు చేశారు.