Share News

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు తల్లీకూతుళ్ల సజీవ దహనం

ABN , Publish Date - Oct 30 , 2024 | 03:41 AM

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు.

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు తల్లీకూతుళ్ల సజీవ దహనం

రామగిరి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తల్లి కల్వల పోచమ్మ, ఆమె కూతురు గడ్డం కొమురమ్మ(55) మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పెద్దపల్లి మండలం కూనారం గ్రామానికి చెందిన కల్వల పోచమ్మ, ఆమె భర్త మల్లయ్య రెండు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం కమాన్‌పూర్‌ మండలం ముల్కలపల్లికి వచ్చి నివాసముంటున్నారు. వీరి కూతురు గడ్డం కొమురమ్మ, ఆమె భర్త కనకయ్య రత్నాపూర్‌ పంచాయతీ పరిధి రాంనగర్‌లో ఉంటున్నారు. సెంటినరీకాలనీలోని పన్నూరు సెంటర్‌ సమీపంలో కొమురమ్మ, పోచమ్మ దినసరి కూలీలుగా పని చేస్తున్నారు.

సోమవారం దాబాల్లో పనిముగిసే సరికి బాగా చీకటి కావడంతో కొమురమ్మ తన తల్లి పోచమ్మను రాంనగర్‌లోని తన నివాసానికి వెంట తీసుకెళ్లింది. చిన్నపాటి గదిలో ఒకే మంచంపై తల్లీకూతుళ్లు నిద్రించారు. రాత్రి వేళ కూలర్‌ వైర్లలో షార్ట్‌సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. గాఢనిద్రలో ఉన్న పోచమ్మ, కొమురమ్మ బయటకురాలేక అందులోనే సజీవ దహనం అయ్యారు. పని ముగించుకుని రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన కొమురమ్మ భర్త కనకయ్య గది తలుపు తెరవడంతో పోచమ్మ, కొమురమ్మ మంటల్లో కాలుతూ కనిపించారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ఈ ఘటనపై ఏసీపీ రమేశ్‌ మాట్లాడుతూ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే వారు మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 03:44 AM