Nizamabad : 5 కోట్లు స్వాహా చేసిన యూనియన్ బ్యాంకు మేనేజరు
ABN , Publish Date - Jul 17 , 2024 | 03:30 AM
ఖాతాదారులకు ఇవ్వాల్సిన రుణాలు వాళ్లకు ఇవ్వకుండా.. తానే తీసుకొని ఘరానా మోసానికి పాల్పడ్డాడో బ్యాంకు మేనేజర్. రుణాల పేరిట దాదాపు 40 మంది ఖాతాల్లో నుంచి రూ.5 కోట్లకు పైగా డబ్బును తన ఖాతాలో జమ చేసుకుని మోసగించాడు.
రుణాల సొమ్మును తన ఖాతాలోకి బదిలీ
ఆలస్యంగా వెలుగులోకి.. పరారీలో నిందితుడు
ఖిల్లా (నిజామాబాద్), జూలై 16: ఖాతాదారులకు ఇవ్వాల్సిన రుణాలు వాళ్లకు ఇవ్వకుండా.. తానే తీసుకొని ఘరానా మోసానికి పాల్పడ్డాడో బ్యాంకు మేనేజర్. రుణాల పేరిట దాదాపు 40 మంది ఖాతాల్లో నుంచి రూ.5 కోట్లకు పైగా డబ్బును తన ఖాతాలో జమ చేసుకుని మోసగించాడు. సదరు మేనేజర్‌ను బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించడం, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం రాత్రి ఈ ఘటన వెలుగు చూసింది.
అజయ్ అనే వ్యక్తి నిజామాబాద్ పట్టణంలోని శివాజీనగర్‌లో ఉన్న యూనియన్ బ్యాంకు మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతమంది ఖాతాదారులకు ఎనిమిది నెలల క్రితం టర్మ్ లోన్‌తో పాటు సీసీ (క్రెడిట్ ఆన్ కరెంటు అకౌంట్) లోన్లను మంజూరు చేశాడు. 40 మంది ఖాతా ల్లో మొదట టర్మ్‌లోన్ సోమ్ము ఖాతాల్లో జమ చేశాడు.
అదేవిధంగా మరో సీసీ లోన్ కోసం ఖాతాదారుల నుంచి అవసరమైన బ్యాంకు చెక్కులను, ఆస్తి పత్రాలను తీసుకున్నాడు. అయితే రెండో లోన్ మంజూరు కాలేదని వారిని నమ్మించి.. వారి లోన్ డబ్బు రూ. 5 కోట్లను తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. ఈ లావాదేవీలన్నీ గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగాయి. అయితే ఇటీవల తనిఖీలకు వచ్చిన బ్యాంకు ఉన్నతాధికారులు... రుణాల మంజూరులో, లావాదేవీల్లో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఖాతాదారులను పిలిచి విచారించగా.. రుణాల స్వాహా వ్యవహారం బయటకు పొక్కింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ మంగళవారం రాత్రి నగర సీఐ నరహరిని కలిశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి.. అజయ్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు అజయ్ పరారీలో ఉన్నాడు.