Share News

Raghunandan Rao: హైకోర్టు స్టే ఎలా ఇస్తుంది?

ABN , Publish Date - Aug 25 , 2024 | 03:21 AM

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వడం విస్మయం కలిగిస్తోందని ఎంపీ రఘునందన్‌ రావు అన్నారు. ఆ కన్వెన్షన్‌ మూడున్నర ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసిందని గతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మార్కింగ్‌ కూడా ఇచ్చిందని తెలిపారు.

Raghunandan Rao: హైకోర్టు స్టే ఎలా ఇస్తుంది?

  • ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చాలని చెప్పింది కదా: రఘునందన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వడం విస్మయం కలిగిస్తోందని ఎంపీ రఘునందన్‌ రావు అన్నారు. ఆ కన్వెన్షన్‌ మూడున్నర ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసిందని గతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మార్కింగ్‌ కూడా ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు చెబితేనే నాడు సర్వే చేయించారని గుర్తు చేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూలగొట్టాలని దేశ అత్యున్నత న్యాయస్థానమే ఆదేశించిందని గుర్తు చేశారు. అయినా ఎన్‌ కన్వెన్షన్‌ వ్యవహారంపై హైకోర్టు స్టే ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కళ్లకు ఉన్న గంతలను తొలగించి భాగ్య నగరవాసులను కాపాడాలని కోరారు.


ఎన్‌ కన్వెన్షన్‌పై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సర్వే, మార్కింగ్‌ చేసిన తర్వాత కూల్చివేయాలని చెప్పాలి గానీ, స్టే ఇవ్వడమేంటని అన్నారు. అలా చేయడం వల్ల మీ కంటే ముందు న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులను కాదనాలా..? అని ప్రశ్నించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేయాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులిస్తే ఎందుకు ఇన్నాళ్లు మీనమేషాలు లెక్కించారని.. దాని వెనక ఉన్న లాలూచీ ఏంటని మునిసిపల్‌ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌ను నిలదీశారు. చెరువుల ఆక్రమణలకు బాధ్యుడు నాటి మునిసిపల్‌ మంత్రి కేటీఆరే అని.. చెరువుల్లో అక్రమంగా భవనాలకు అనుమతులు ఇచ్చినందుకుగాను ఆయనను అరెస్టు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు.


ఎన్‌ కన్వెన్షన్‌ ఒక్కో ఫంక్షన్‌కు గడచిన పదేళ్లలో రూ.50లక్షల నుంచి రూ.కోటి వసూలు చేసిందని.. ఆ సొమ్మును వసూలు చేయాలని సర్కారును కోరారు. చెరువులు, కుంటల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమయితే.. గడచిన పదేళ్లలో కట్టిన అక్రమ కట్టడాలను ముందు కూలగొట్టాలని డిమాండ్‌ చేశారు. ‘‘111 జీవో పరిధిలో హరీశ్‌రావు, కవిత, కేటీఆర్‌కు ఆస్తులు లేవా..? జన్వాడ ఫాంహౌ్‌సను కూల్చివేసేందుకు ఎందుకు భయపడుతున్నారు..? కవిత, హరీశ్‌రావు ఫాంహౌ్‌సల కూల్చివేతలో ఇబ్బందేంటి..?’’ అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. గడచిన రెండు దశాబ్దాల్లో జరిగిన చెరువుల ఆక్రమణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 25 , 2024 | 03:21 AM