Shadnagar: ఫాంహౌ్‌సలో రియల్టర్ హత్య..
ABN , Publish Date - Jul 11 , 2024 | 03:19 AM
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ శివార్లలోని ఫాంహౌ్‌సలో ప్రముఖ రియల్టర్ కమ్మరి కృష్ణ (కేకే) దారుణ హత్యకు గురయ్యారు. గతంలో ఆయన వద్ద బాడీగార్డుగా పని చేసిన వ్యక్తే.. కొందరు దుండగులతో కలిసి గొంతు కోసి హతమార్చాడు.
శంషాబాద్ శివారులో ఘటన
మాజీ బాడీగార్డు ఘాతుకం.. కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానం
షాద్‌నగర్‌రూరల్ జూలై 10: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ శివార్లలోని ఫాంహౌ్‌సలో ప్రముఖ రియల్టర్ కమ్మరి కృష్ణ (కేకే) దారుణ హత్యకు గురయ్యారు. గతంలో ఆయన వద్ద బాడీగార్డుగా పని చేసిన వ్యక్తే.. కొందరు దుండగులతో కలిసి గొంతు కోసి హతమార్చాడు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని.. కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదర్‌షాకోట్‌కు చెందిన కమ్మరి కృష్ణ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడించారు. ఆయనకు ముగ్గురు భార్యలు.. రెండో భార్య చనిపోయింది. ఆయనకు ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం శివారులో ఫాంహౌస్ ఉంది. వీలు చిక్కినప్పుడల్లా మూడో భార్య, పిల్లలతో కలిసి అక్కడికి వచ్చి వెళ్లేవారు.
బుధవారం భార్య పావని, పిల్లలతో కలిసి ఫాంహౌ్‌సకు వెళ్లిన ఆయన సాయంత్రం 5 గంటలకు హైదర్‌షాకోట్‌కు తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతుండగా.. గతంలో బాడీగార్డుగా పనిచేసిన బాబా అక్కడికి వచ్చాడు. ఈక్రమంలోనే బాబాకు కృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బాబా గట్టిగా అరుస్తూ కృష్ణ చేతులు పట్టుకోగా.. అప్పటికే అక్కడ కాపు కాసిన మరో ఇద్దరు వచ్చి కత్తితో కృష్ణ గొంతు కోసి పరారయ్యారు. అరుపులు వినిపించడంతో కిందికి వచ్చిన పావని, పిల్లలు.. రక్తపు మడుగులో పడి ఉన్న కృష్ణను శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ రంగస్వామి సందర్శించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
రూ.వందల కోట్ల ఆస్తులు..
కృష్ణకు హైదరాబాద్‌లో రూ.వందల కోట్ల ఆస్తులున్నట్లు సమాచారం. గతంలో ఆయన హైదర్‌షాకోట్ సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన వద్ద కొన్నేళ్లుగా పనిచేసి మానేసిన బాబాతో డబ్బుల విషయంలో తగాదాలు నడుస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరూ గతంలో కొన్ని భూసెటిల్‌మెంట్లు కూడా చేశారు. ఈ హత్యలో కుటుంబ సభ్యుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి భార్య కుటుంబానికి, మూడో భార్య కుటుంబానికి పొసగడం లేదు. ఈ నేపథ్యంలోనే బాబాను పిలిపించి మొదటి భార్య పిల్లలు ఈ హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.