Share News

State Chief Electoral Officer : రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి 144 సెక్షన్‌

ABN , Publish Date - May 12 , 2024 | 05:53 AM

ప్రచారపర్వం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు జరిగేవరకు రాష్ట్రవ్యాప్తంగా సీఆర్పీసీ 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికా్‌సరాజ్‌ వెల్లడించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచే ఈ సెక్షన్‌ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. నలుగురికంటే ఎక్కువ మంది కలిసి తిరగకూడదని ఆయన స్పష్టం చేశారు.

State Chief Electoral Officer : రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి 144 సెక్షన్‌

  • నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

  • ఇప్పటివరకు 350 కోట్ల నగదు సీజ్‌

  • అన్నిమాధ్యమాల్లో ప్రచారంపై నిషేధం

  • 13న సెలవు ఇవ్వని సంస్థలపై చర్య

  • విలేకరులతో సీఈవో వికాస్‌ రాజ్‌

  • బందోబస్తుకు 73వేల మంది : డీజీపీ

హైదరాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): ప్రచారపర్వం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు జరిగేవరకు రాష్ట్రవ్యాప్తంగా సీఆర్పీసీ 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికా్‌సరాజ్‌ వెల్లడించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచే ఈ సెక్షన్‌ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. నలుగురికంటే ఎక్కువ మంది కలిసి తిరగకూడదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలు, ఇతర సాధనాల ద్వారా ఎన్నికల ప్రచారం చేసేవారిపై, నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలనుకునే అభ్యర్థులు ముందుగా తమ అనుమతి తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు.. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేసినట్లు వివరించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు సుమారు 70వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేపట్టామన్నారు. పోలింగ్‌ రోజున కొన్ని సంస్థలు తమ ఉద్యోగులు, కార్మికులకు సెలవులు ఇవ్వడం లేదనే సమాచారం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి సంస్థలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కల్యాణ మండపాలు, కమ్యూనిటీ భవనాలు, వసతిగృహాలు, హోటళ్లలో నివసిస్తున్న వారు ఓటుహక్కును వినియోగించుకునేందుకు వెంటనే స్వస్థలాలకు వెళ్లిపోవాలని కోరారు.


ఏజెన్సీల్లో 328 పోలింగ్‌ కేంద్రాలు

ఏజెన్సీ ప్రాంతాల్లో 328 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వికాస్‌ రాజ్‌ తెలిపారు. వాటిల్లో మూడు కేంద్రాల పరిధిలో అతి తక్కువ-- 10, 12, 14, ఓటర్లు ఉన్నట్లు వివరించారు. 25 కంటే తక్కువ మంది ఓటర్లున్న కేంద్రాలు 11 ఉండగా.. మరో 23 కేంద్రాల్లో 50 కంటే తక్కువ ఓటర్లు, 54 కేంద్రాల్లో 100లోపు ఓటర్లున్నట్లు పేర్కొన్నారు. సుమారు 3 లక్షల మంది సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అందజేసి, సంబంధిత పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తామన్నారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రితో సిబ్బంది ఆదివారం రాత్రికి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటారని వివరించారు. సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని, 7 గంటల నుంచి పోలింగ్‌ మొదలవుతుందని తెలిపారు. ఎండల తీవ్రత నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్‌ కేంద్రాల వద్ద నీడ, తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. హోం ఓటింగ్‌, సర్వీసు ఓటర్లుకు సంబంధించి సుమారు 2 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.


ప్రతి 2 గంటలకు అప్‌డేట్స్‌

పోలింగ్‌ రోజున ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్‌ శాతాన్ని వెల్లడిస్తామన్నారు. పోలైన ఓట్లకు సంబంధించిన వివరాలను 14వ తేదీన చెబుతామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం తలెత్తకుండా క్షేత్రస్థాయి పరిశీలకులు, పోలీసులు, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా.. మూడంచెల్లో పర్యవేక్షణ ఉంటుందన్నారు. రాష్ట్రంలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 9,900గా ఉన్నట్లు వివరించారు.


రూ.320 కోట్ల సొత్తు సీజ్‌

ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 320 కోట్ల సొత్తు సీజ్‌ అయినట్లు వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. డ్రగ్స్‌, లిక్కర్‌, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్ధం చేసిన నజరానాలు ఇందులో ఉన్నాయన్నారు. తమకు అందిన ఫిర్యాదులకు సంబంధించి 8,600 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, డ్రగ్స్‌కు సంబంధించి 293 కేసులు, బల్క్‌మెసేజ్‌లకు సంబంధించి 732 కేసులు నమోదయినట్లు వివరించారు. సీ-విజిల్‌ యాప్‌, కాల్‌సెంటర్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు విచారణ చేయిస్తున్నామన్నారు. రాజకీయపరమైన 93 ఫిర్యాదులపై విచారణ జరుగుతోందన్నారు.


పోలింగ్‌ బూత్‌ ఏదో తెలియడం లేదా..?

ఓటర్లు ఓటువేసేందుకు ఏ పోలింగ్‌ బూత్‌కు వెళ్లాలో పరిధిలో ఉందో సులువుగా తెలుసుకోవచ్చని సీఈవో తెలిపారు. ఈసీఐ-స్పే్‌స-ఓటర్‌ ఐడీ నంబర్‌ టైప్‌చేసి, 1950కి మెసేజ్‌ పంపితే.. వివరాలు వస్తాయన్నారు. ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా కూడా పోలింగ్‌ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.


73 వేల మంది పోలీసులు: డీజీపీ

ఎన్నికల భద్రతకు 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. వీరిలో తెలంగాణ సివిల్‌ పోలీసులతోపాటు.. టీఎ్‌సఎస్పీ సిబ్బంది, 164 కంపెనీల కేంద్ర బలగాలు, తమిళనాడు ఎస్‌ఏఆర్‌ పోలీసులు, ఇతర రాష్ట్రాలకు చెందిన 7 వేల మంది హోంగార్డులు, 2088 మంది ఇతర శాఖల సిబ్బంది ఉన్నట్లు వివరించారు. శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించేందుకు డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 34,526 మందిని బైండోవర్‌ చేశామని ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఓటింగ్‌ శాతం పెరగడానికి పోలీసు శాఖ కూడా కృషిచేస్తోంది. సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించి డీజీపీ ప్రత్యేకంగా ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా.. ఏసీబీ చీఫ్‌ సీవీ ఆనంద్‌ ఆంగ్లంలోని అక్షరాలు-- ఏ నుంచి జడ్‌తో ఓటుహక్కు ప్రాముఖ్యతను వివరించారు. రాచకొండ పోలీసులు ప్రలోభాలకు లొంగొద్దంటూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు.

Updated Date - May 12 , 2024 | 05:53 AM