Share News

Shivraj Singh: ఆయిల్‌పామ్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి

ABN , Publish Date - Sep 07 , 2024 | 03:59 AM

ఆయిల్‌పామ్‌ రైతులకు మంచి ధర వచ్చేలా చూడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Shivraj Singh: ఆయిల్‌పామ్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి

  • టన్నుకు కనీసం రూ.15 వేలు వచ్చేలా చూడండి

  • ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయండి.. శివరాజ్‌కు తుమ్మల విజ్ఞప్తి

హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ రైతులకు మంచి ధర వచ్చేలా చూడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. 2024-25 సంవత్సరానికి ఆయిల్‌పామ్‌ గెలలు టన్నుకు రూ.15 వేల కనీస మద్దతు ధర కల్పించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. రాష్ట్రంలో వరద నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్‌ను సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మంత్రి తుమ్మల కలిసి పలు అంశాలపై చర్చించారు. ఆయిల్‌పామ్‌ రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడడంతోపాటు రాష్ట్రంలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.


సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ను అశ్వారావుపేటలో ఏర్పాటు చేయాలని తుమ్మల కోరారు. కనీస మద్దతు ధర లభించక ఆయిల్‌పామ్‌ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో టన్ను రూ.20 వేల వరకు ఉండగా ఇటీవల కాలంలో కస్టమ్‌ డ్యూటీని ఎత్తివేశారని తెలిపారు. దీంతో టన్ను రూ.12 వేలకే కొనుగోలు చేస్తున్నారని, ఫలితంగా రైతులకు గిట్టుబాటు కావడం లేదని చెప్పారు. కనీస మద్దతు ధర 2024-25లో రూ.15వేలు ఉండేలా సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.. త్వరలోనే మూడు అంశాలపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - Sep 07 , 2024 | 03:59 AM