Share News

Agricultural Loans: రైతన్నకు గడువు!

ABN , Publish Date - Aug 08 , 2024 | 03:16 AM

రెండు లక్షల రూపాయలకు పైగా పంట రుణ బకాయిలున్న రైతులకు.. ఆ పైనున్న మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించాలనే యోచనలో ఉంది.

Agricultural Loans: రైతన్నకు గడువు!

  • 2 లక్షలకు పైనున్న అప్పు చెల్లించేందుకు 4-6 నెలల సమయం

  • రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం యోచన

  • గంపగుత్తగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికే రూ.2 లక్షల మాఫీ

  • మూడో విడతలో 6 లక్షల మందికి..

  • రూ.6 వేల కోట్ల నిధులు సర్దుబాటు

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రెండు లక్షల రూపాయలకు పైగా పంట రుణ బకాయిలున్న రైతులకు.. ఆ పైనున్న మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించాలనే యోచనలో ఉంది. పంద్రాగస్టు వరకు మూడో విడత రుణమాఫీ పూర్తయిన తర్వాత.. రూ.2 లక్షలకు పైనున్న విభాగంలోని రైతులపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలున్నాయి. రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతుల వివరాలను ప్రకటించి.. రూ.2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించడానికి 4 నుంచి 6 నెలల గడువిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రుణమాఫీ జీవో 567 ప్రకారం.. రూ.2 లక్షలపైన ఎంత ఎక్కువ ఉంటే అంత మొత్తాన్ని రైతులు ముందుగా చెల్లించాలి.


ఆ తర్వాత ప్రభుత్వం రూ.2 లక్షలు మాఫీ చేస్తుంది. దాంతో రైతులు రుణవిముక్తులవుతారు. ఆ తర్వాత మళ్లీ కొత్తగా పంట రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రూ.2 లక్షలపైన స్వల్పమొత్తంలో అప్పున్న రైతులు కొందరు..ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. రైతులు ఎప్పుడు చెల్లించినా తీసుకోవాలని ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసింది. గంపగుత్తగా కాకుండా రైతులు ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు పైమొత్తాన్ని కట్టించుకొని రూ.2 లక్షలు నగదు బదిలీ చేసి రుణ విముక్తులను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


అంటే రైతులు తమ వీలునుబట్టి డబ్బు సర్దుబాటు చేసుకొని.. రూ.2 లక్షలకు మించి ఉన్న మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటే, ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని మాఫీ చేస్తూ పోతుంది. అయితే ఈ ప్రక్రియను నిర్ణీత కాలపరిమితిలోపు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పలు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి డిసెంబరు 9కి ప్రాధాన్యమిస్తున్న రేవంత్‌ సర్కారు.. రుణమాఫీ ప్రక్రియను కూడా అప్పటికే ముగిస్తుందా? లేక 6 నెలల సమయమిచ్చి 2025 ఫిబ్రవరి వరకు గడువు విధిస్తుందా? లేక 2025 మార్చి 31 వరకు డెడ్‌లైన్‌ పెట్టి రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేస్తుందా? అనే చర్చ కూడా వ్యవసాయశాఖలో జరుగుతోంది.


  • మూడో విడత రుణమాఫీకి రూ.6 వేల కోట్లు!

మూడో విడత రుణమాఫీకి మరో రూ.6 వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. లక్షన్నర నుంచి రూ.2 లక్షల బకాయిలున్న 6 లక్షల మంది రైతులకు మూడో విడతలో ఈ నెల 15న రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ నిధులు సర్దుబాటు చేస్తోంది. గత నెల 23న రూ.3 వేల కోట్లు, 30న రూ.1,000 కోట్ల అప్పును భారతీయ రిజర్వ్‌ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. తాజాగా ఈ నెల 6న మరో రూ.3 వేల కోట్లను ఆర్‌బీఐ నుంచి వేలంపాట ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది.


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి రాగానే 15న ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగసభలో మూడో విడత రుణమాఫీని పంపిణీ చేయనున్నారు. కాగా, రెండు విడతల్లో 17.91 లక్షల మంది రైతులకు రూ.12,289 కోట్ల నిధులు సర్దుబాటు చేశారు. మూడో విడతలో 6 లక్షల మంది రైతులకు రూ.6 వేల కోట్ల నిధులు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. మిగిలిన రైతులు రూ.2 లక్షలకు మించి అప్పున్న విభాగంలో ఉంటారు.

Updated Date - Aug 08 , 2024 | 03:16 AM