Kodandaram: త్వరలో ప్రజాస్వామ్య తెలంగాణ
ABN , Publish Date - Nov 04 , 2024 | 04:15 AM
కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలోనే ప్రజాస్వామ్య తెలంగాణను స్థాపిస్తామని, అందుకోసం విధి విధానాలను రూపొందిస్తున్నామని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. తెలంగాణలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, వాటి పునరుద్ధరణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు.
విధి విధానాలు రూపొందిస్తున్నాం: కోదండరాం
హుజూరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలోనే ప్రజాస్వామ్య తెలంగాణను స్థాపిస్తామని, అందుకోసం విధి విధానాలను రూపొందిస్తున్నామని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. తెలంగాణలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, వాటి పునరుద్ధరణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆదివారం టీజేఎస్, ఉద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పౌర సమాజంతో మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడు తూ.. ప్రస్తుతం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిందని, త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. త్వరలోనే విద్య, వైద్యంపై పూర్తి స్థాయి లో విశ్లేషణ చేసి అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని మొత్తం అప్పుల పాలు చేసిందని, దానిని గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.