Share News

Jagga Reddy: జీవన్‌రెడ్డి సమస్యకు త్వరగా పరిష్కారం చూపండి

ABN , Publish Date - Oct 26 , 2024 | 03:16 AM

ఈ వయసులో పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి రాజకీయ ఇబ్బందులు రావడం బాధాకరమని, అధిష్ఠానం దీన్ని గుర్తించి త్వరితగతిన ఆయన సమస్యకు పరిష్కారం చూపాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి కోరారు.

Jagga Reddy: జీవన్‌రెడ్డి సమస్యకు త్వరగా పరిష్కారం చూపండి

  • రాహుల్‌, ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మహే్‌షగౌడ్‌లకు జగ్గారెడ్డి వినతి

  • జీవన్‌రెడ్డి.. ఒంటరిని అనుకోవద్దు.. సమయం వచ్చినప్పుడు వెంట నేనుంటా

  • ఈ వయసులో ఆయనకు రాజకీయ ఇబ్బందులు బాధాకరమంటూ వ్యాఖ్య

హైదరాబాద్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఈ వయసులో పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి రాజకీయ ఇబ్బందులు రావడం బాధాకరమని, అధిష్ఠానం దీన్ని గుర్తించి త్వరితగతిన ఆయన సమస్యకు పరిష్కారం చూపాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి కోరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌లకు శుక్రవారం ఓ ప్రకటనలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గురువారం మీడియాలో జీవన్‌రెడ్డి ఆవేదన చూసిన తర్వాత తనకు చాలా బాధ అనిపించిందన్నారు. ఏం జరుగుతుంది.. ఏమాట్లాడాలి? అన్నది అర్థం కావట్లేదని, అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నానని పేర్కొన్నారు.


ఈ వయసులో ఆయన ఆవేదన చూసి తన మనస్సు కలుక్కుమందన్నారు. తాను ఎవరినీ తప్పు పట్టట్లేదని పేర్కొన్నారు. అయితే తాను ఒంటరిని అని జీవన్‌రెడ్డి అనుకోవద్దని, సమయం వచ్చినప్పుడు ఆయన వెంట తాను ఉంటానని స్పష్టం చేశారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ వాది అని, ఆయన జీవితమంతా కష్టాలేనన్నారు. ఎప్పుడూ జనంలో ఉండే జీవన్‌రెడ్డిని జగిత్యాల ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. అలాగే సంగారెడ్డిని ఎంతో అభివృద్ధి చేసిన తనను ఎందుకు ఓడగొట్టారో కూడా అర్థం కాలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీనీ, ప్రజలను తాను తప్పు పట్టట్లేదన్నారు. తమ టైం బాగాలేదని చెప్పి సర్దుకుపోతున్నామని తెలిపారు. జీవన్‌రెడ్డికి, తనకు మధ్య వయసు తేడా ఉందని, ఈ వయసులో ఆయనకు రాజకీయ ఇబ్బందులు రావడం బాధాకరమని అన్నారు. అధిష్ఠానం దీన్ని గుర్తించి త్వరితగతిన ఆయన సమస్యకు పరిష్కారం చూపాలని జగ్గారెడ్డి కోరారు.

Updated Date - Oct 26 , 2024 | 03:16 AM