Crop Damage: అకాల వర్షం.. తడిసిన ధాన్యం..
ABN , Publish Date - Oct 22 , 2024 | 04:40 AM
కామారెడ్డి జిల్లాలో సోమవారం కురిసిన అకాలవర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, సదాశివనగర్, కామారెడ్డిలో సోమవారం వర్షం కురిసింది.
కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు
వేర్వేరు చోట్ల పిడుగులు..
ఒక మహిళ, మూగజీవాల మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): కామారెడ్డి జిల్లాలో సోమవారం కురిసిన అకాలవర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, సదాశివనగర్, కామారెడ్డిలో సోమవారం వర్షం కురిసింది. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేటలలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. చేతికి వచ్చిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సదాశివనగర్‌లో భారీ వర్షానికి చెరువు అలుగులు పొంగి పలు ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. కోతకు చేరుకున్న వరిపైరు నేలకొరిగింది. నిజామాబాద్, నిర్మల్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ అకాల వర్షం కురిసి పలు ప్రాంతాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.
పలుచోట్ల వరిపంట నేలకొరిగింది. కొన్నిచోట్ల వాన నీటి ప్రవాహానికి ధాన్యం కొట్టుకుపోయింది. సిద్దిపేటలో మార్కెట్ యార్డు, చేర్యాల మార్కెట్ యార్డులో ధాన్యం కొట్టుకు పోగా మక్కలు తడిసి ముద్దయ్యాయి. సిద్దిపేట జిల్లా పెద్దమాసాన్‌పల్లిలో పిడుగు పడి బోదాస్ లక్ష్మి(50) అనే మహిళ మృతి చెందింది. చిన్నకోడూరు మండలంలోని చెల్కలపల్లి గ్రామంలో ఒక ఆవు, హుస్నాబాద్ మండలంలోని పోతారం(ఎ్‌స)లో మరో ఆవు పిడుగులు పడి మృతి చెందాయి. మెదక్ జిల్లా హవేళిఘణపూర్ మండలంలో పిడుగు పడి ఏడు మేకలు మృత్యువాత పడ్డాయి.
సాగర్ 20 గేట్ల నుంచి నీటి విడుదల
శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలు, 5 క్రస్ట్‌గేట్లను ఎత్తి 2,22,147 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదలడంతో సాగర్ 20 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ కాల్వలు, జల విద్యుత్ కేంద్రం, క్రస్ట్‌గేట్ల ద్వారా మొత్తం 2,29,692 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.04 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 589 అడుగులు ఉంది. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టుకు 1,68,863 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 884.30 అడుగులతో 211.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది .మంగళవారం వాయుగుండంగా, బుధవారం ఉదయానికి తుఫాన్‌గా బలపడుతుంది.