Share News

‘వంద పడకల ఆస్పత్రి’కి వడివడిగా అడుగులు

ABN , Publish Date - Jul 14 , 2024 | 12:08 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వంద పడకల ఆస్పత్రి నిర్మాణా నికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా దృష్టి సారించారు. బస్టాండ్‌ సమీపంలో ఉన్న నాలుగెకరాల ఆర్టీసీ స్థలాన్ని ఆస్పత్రికి కేటాయించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదలను పంపారు. అధికారులతో కలిసి సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. ముందుగా జాతీయ రహదారి నుంచి అక్కడి వరకు రోడ్డు నిర్మించేందుకు ఎస్టిమేషన్స్‌ సిద్ధం చేయాలని వారిని ఆదేశించారు. సర్కారు నుంచి అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.

‘వంద పడకల ఆస్పత్రి’కి వడివడిగా అడుగులు
స్టేషన్‌ఘన్‌పూర్‌లో వంద పడకల ఆస్పత్రికి ప్రతిపాదించిన స్థలం

అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు

ఆర్టీసీ డిపో స్థలాన్ని కేటాయించాలని నిర్ణయం

నాలుగెకరాల్లో భవన నిర్మాణానికి ప్రణాళికలు

అధికారులతో కలసి స్థల పరిశీలన

ముందుగా రోడ్డు వేసేందుకు ఎస్టిమేషన్‌ సిద్ధం

దృష్టి సారించిన ఎమ్మెల్యే కడియం

స్టేషన్‌ఘన్‌పూర్‌, జూలై 13: డివిజన్‌ కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు గాను బస్టాండ్‌ సమీపంలో జాతీయ రహదారికి సమీపంలో ఆర్టీసీ డిపోకు కేటాయించిన స్థలాన్ని ఎంపికచేశారు. 2001లో అప్పటి మంత్రి, ప్రస్తుత స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆర్టీసీ డిపో ఏర్పాటుకు గాను ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద నుంచి 4ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలం ఇప్పటికీ నిరుపయోగంగా ఉన్నందున అందులో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇటీవల ఆ స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదలాయించాలని ఆర్టీసీ సంస్థకు, సీఎం రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అంతేగాకుండా ఆస్పత్రి నిర్మాణం కోసం నిధులు, స్టాఫ్‌ను మంజూరి చేయాలని సీఎంకు వినతిపత్రం అందించారు. మరోవైపు అధికారులు ఆ స్థలంలో సర్వేలు నిర్వహించి హద్దులు సైతం ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల క్రితం ఆర్డీవో ధరంసోత్‌ వెంకన్న ఆధ్వర్యంలోని రెవెన్యూ అధికారులు సిబ్బంది స్థలాన్ని సర్వేచేసి రిపోర్టులను ప్రభుత్వానికి అందించారు. ఈ స్థలం ఘన్‌పూర్‌ బస్టాండ్‌కు సమీపంలో ఉండడంతో పాటు జాతీయ రహదారికి 100 మీటర్ల దూరంలో ఉండడంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు ఉపయుక్తంగా ఉండనుంది.

గత ప్రభుత్వంలో విడుదలైన జీవో...

గత ప్రభుత్వంలో అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీ్‌షరావు ఘన్‌పూర్‌లో 100 పడకల ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు ఎన్నికల ముందు 2023 ఆగస్టు మాసం లో ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ విభాగం నుంచి జీవో ఆర్టీ నెంబరు 432ను విడుదల చేశారు. రూ 37.50 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం (సివిల్‌ వర్క్స్‌), పరికరాలు, ఫర్నిచర్‌ ఏర్పాటు చేయాలని అందులో పేర్కొన్నారు. తదనంతరం ఎన్నికల నోటిఫికేషన్‌ రావడం.. రాష్ట్రం లో ప్రభుత్వం మారడంతో పరిస్థితి మొదటికొచ్చింది.

ఆస్పత్రి స్థలాన్ని పరిశీలించిన కడియం...

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ నుంచి అందులో చేరడంతో ఆయన ఈ విషయంలో ప్రత్యేక చొరవచూపుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల రెవెన్యూ, వైద్యశాఖ అధికారులతో కలిసి స్థలాన్ని పర్యవేక్షించి ఇంజనీరింగ్‌ అధికారులకు ఆస్పత్రి స్థలం వరకు ఏర్పాటు చేయాల్సిన రోడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. జాతీయ రహదారి నుంచి ఆస్పత్రి వరకు సూమారు 100 మీటర్ల రోడ్డు ను అన్ని అంగులాలతో రూపొందించేందుకు అధికారులు సుమారు రూ.80లక్షలతో అంచనా రూపొందించారు. 100 పీట్ల రోడ్డుతో పాటు ఇరువైపులా డ్రెయినే జీ నిర్మాణం, సెంట్రల్‌ గార్డెన్‌, లైటింగ్‌ ఏర్పాటు చేసే లా ప్రతిపాదలను సిద్ధం చేశారు.

ఆస్పత్రి ఏర్పాటుతో ప్రయోజనాలు..

వంద పడకల ఆస్పత్రి ఏర్పాటైతే డివిజన్‌ ప్రజల కు అనేక రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తా యి. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు అందుబా టులోకి వస్తారు. గైనిక్‌, ఫిజీషియన్‌, సర్జన్‌, ఆర్థోపెడిక్‌, పిడియాట్రిక్‌, ఫిజియోథెరపీ, న్యూరో, డెంటల్‌, అనస్థీషియా వైద్యుల సేవలు అందుబాటులోకి వస్తా యి. అత్యవసర సేవల విభాగం అందుబాటులోకి వస్తుంది. అంతేగాకుండా ట్రామాకేర్‌ సెంటర్‌, బ్లడ్‌ బ్యాంకు, 24గంటల పాటు వైద్య సేవలు, అంబులెన్స్‌ సేవలు, అపరేషన్‌ థియేటర్స్‌, పోస్టుమార్టం సేవలు, ఎస్‌ఎన్‌సీయూ సేవలు అందుబాటులోకి వస్తాయి.

పనులు ప్రారంభించి చిత్తశుద్ధి చాటుకోవాలి

మాచర్ల గణే్‌షగౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు

గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన జీవోను అమలు చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. వెంటనే ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభించాలి. ఈ విషయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవ చూపాలి. ఇప్పటికే సరైన వైద్య సేవలు అందించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది. ఇకనైనా ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి అన్ని హంగులతో ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి. అంతే గాకుండా అన్ని సదుపాయాలను కల్పిస్తూ అవసరమైన వైద్యులను, సిబ్బందిని నియమించాలి.

Updated Date - Jul 14 , 2024 | 12:08 AM