62వ ఏటలో నీట్‌ పరీక్ష రాసి.. 54వ ర్యాంకు సాధించిన ప్రవాస భారతీయురాలు!

ABN , First Publish Date - 2020-10-29T10:56:08+05:30 IST

తెలుసుకోవాలన్న ఆసక్తికీ, నేర్చుకోవాలన్న ఆకాంక్షకూ వయసుతో నిమిత్తం లేదు... విద్యకు పదును పెట్టుకోవాలన్న కోరికకూ, సమాజానికి మరింత సేవ చేయాలన్న సంకల్పానికీ ఫుల్‌స్టాప్‌ ఉండదు... జీవితంలో దశలూ, ప్రాధామ్యాలతో పాటే లక్ష్యాలూ మారాలనీ, కృషి చేస్తే ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవడం ఏ వయసులోనైనా కష్టం కాదనీ నిరూపించారు.

62వ ఏటలో నీట్‌ పరీక్ష రాసి.. 54వ ర్యాంకు సాధించిన ప్రవాస భారతీయురాలు!

తెలుసుకోవాలన్న ఆసక్తికీ, నేర్చుకోవాలన్న ఆకాంక్షకూ వయసుతో నిమిత్తం లేదు... విద్యకు పదును పెట్టుకోవాలన్న కోరికకూ, సమాజానికి మరింత సేవ చేయాలన్న సంకల్పానికీ ఫుల్‌స్టాప్‌ ఉండదు... జీవితంలో దశలూ, ప్రాధామ్యాలతో పాటే లక్ష్యాలూ మారాలనీ, కృషి చేస్తే ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవడం ఏ వయసులోనైనా కష్టం కాదనీ నిరూపించారు డాక్టర్‌ ముసునూరు రజని. గల్ఫ్‌ దేశమైన రియాద్‌లో పాతికేళ్లుగా వైద్యురాలిగా సేవలందిస్తున్న ఆమె 62వ ఏట... తాజాగా నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఎంట్రన్స్‌ పరీక్ష రాసి ఆల్‌ ఇండియా 54వ ర్యాంకు సాధించారు. ఆమె ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.


మాది విజయవాడ. మావారు డాక్టర్‌ ఎమ్‌.వి.ఎన్‌. ప్రసాద్‌, సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌ ఆఫ్‌ సర్జరీగా పనిచేస్తున్నారు. పెద్దబ్బాయి ధరణీంద్ర డిఎమ్‌ క్రిటికల్‌ కేర్‌లో ఉన్నాడు. చిన్నబ్బాయి దేవేంద్ర ఆర్థోపెడీషియన్‌.


‘‘నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఎంట్రన్స్‌ పరీక్ష, 62 ఏళ్ల వయసులో రాసి ర్యాంకు సాధించానంటే, ఆ పట్టుదల వెనకున్న సుదీర్ఘ కథ గురించి ముందుగా చెప్పుకోవాలి. నా మటుకు నాకు వైద్య వృత్తి అంటే ప్రాణం. అయితే ఏ కెరీర్‌లో అయినా, ఎదగకుండా ఒకే చోట ఆగిపోవడం ఎవరికి నచ్చుతుంది? నాకూ నచ్చలేదు. విజయవాడలోని సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీలో ఏడేళ్లు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, ఆస్పత్రిలో వైద్యురాలిగా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఇంతకంటే మెరుగైన జీవితం అవసరమని నాకు అనిపించింది. వెంటనే అవకాశాల కోసం ప్రయత్నించి, 1995లో గల్ఫ్‌ దేశమైన రియాద్‌కు కుటుంబంతో వెళ్లిపోయాను. ఆ సమయంలో నా లక్ష్యం ఆర్ధికంగా మరింత ఎదగడం. వెళ్లిన సంవత్సరానికి మావారు ఇండియా తిరిగి వచ్చేశారు. దాంతో నేనూ, నా ఇద్దరు పిల్లలు రియాద్‌లో ఉండిపోయాం. అటు పిల్లలను ఇండియన్‌ ఎంబసీ స్కూల్లో చదివిస్తూ, ఇటు ఆస్పత్రిలో సేవలందిస్తూ కొత్త కెరీర్‌ మొదలుపెట్టాను. రియాద్‌లో వైద్యులకు నెలసరి జీతంతో పాటు, సర్జరీలు, ప్రసవాలకు అదనపు ఇన్‌సెంటివ్స్‌ ఉండేవి. దాంతో అనుకున్నది సాధించగలిగాననే సంతృప్తి దక్కింది.


రియాద్‌ టు ఇండియా!

రియాద్‌లో స్థిరపడినా ఏడాదికోసారి రెండు నెలల పాటు ఇండియా వచ్చి వెళ్లూ ఉండేవాళ్లం. పెద్ద బాబు పదో తరగతి పాసయ్యాక పైచదువులు ఇండియాలో కొనసాగిస్తానని వచ్చేశాడు. అప్పటికి ఎనిమిదో తరగతిలో ఉన్న చిన్న బాబు కూడా అన్ననే అనుసరించాడు. దాంతో రియాద్‌లో నేనొక్కదాన్నే ఉండిపోయాను. కుటుంబాన్ని వదిలి ఉండడం ఇష్టం లేక రెండుసార్లు ఇండియా వచ్చి ఇక్కడే స్థిరపడే ప్రయత్నం కూడా చేశాను. మొదటిసారి ఆరు నెలల పాటు సెలవు పెట్టేసి, విజయవాడలోని సిద్ధార్ధ పిన్నమనేని మెడికల్‌ కాలేజీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా చేరాను. కానీ రియాద్‌లో నేను పనిచేసిన ఆస్పత్రి యాజమాన్యం తిరిగి నన్ను వెనక్కి పిలిపించింది. అలా రెండుసార్లు వృత్తులు మారినా, వైద్య అర్హతలను మరింత పెంచుకుని కెరీర్‌లో ఎదగాలనేదే నా ఆలోచనగా ఉండేది. అలా రెండేళ్ల సూపర్‌ స్పెషాలిటీ కోర్సులో ప్రవేశ పరీక్ష కోసం ప్రిపరేషన్‌ మొదలుపెట్టాను. 


అర్థరాత్రి ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌!

నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాయాలంటే మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీన్లో ఎన్నో సర్జికల్‌ బ్రాంచీలు ఉంటాయి. నాలాంటి గైనకాలజిస్టులకు గైనిక్‌ ఆంకాలజీ, రీప్రొడక్టివ్‌ మెడిసిన్‌, హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ, పెరినేటల్‌ మెడిసిన్‌... ఇలా మూడు స్పెషాలిటీల్లో ప్రవేశ పరీక్ష రాసే వీలుంటుంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు, మునుపటి వైద్యానుభవం ఆధారంగా ప్లేస్‌మెంట్‌ నిర్ణయిస్తారు. రెండేళ్లపాటు ఆయా ఆస్పత్రుల్లో ఎంచుకున్న విభాగాల్లో ఇంటర్న్‌గా సేవలందించి, అంతిమంగా పరీక్ష రాయవలసి ఉంటుంది. ఈ కోర్సు ప్రవేశ పరీక్ష ఎంతో క్లిష్టమైనది. పాతికేళ్లుగా చదువుకు దూరంగా వైద్య వృత్తిలో నిమగ్నమైన నాకు నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష రాయడమే పెద్ద పరీక్ష! అయినా సిద్ధపడాలని నిశ్చయించుకున్నాను. రియాద్‌లో నా డాక్టర్‌ డ్యూటీ మధ్యాహ్నం 12 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ ఉంటుంది. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఉదయం నాలుగు గంటల వరకూ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యేదాన్ని. అప్పుడు పడుకుని ఉదయం 11 గంటలకు నిద్రలేచి 12కు ఆస్పత్రి చేరుకునేదాన్ని. మెడికల్‌ బుక్స్‌లో వందలకొద్దీ పేజీలు ఉంటాయి. అన్ని పేజీలు చదివే సమయం లేక, వీడియోల మీద ఆధారపడేదాన్ని. అలా సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుని పరీక్షకు సిద్ధపడ్డాను. ఫలితాల్లో నాకు 54వ ర్యాంకు వచ్చిందని తెలిసినప్పుడు నా కష్టానికి తగిన ఫలం దక్కినందుకు ఎంతో సంతోషపడ్డాను.


ఆ సంఘటన బాధాకరం!

రియాద్‌లో తనకు సంబంధించిన అన్ని కేసులనూ ఒక వైద్యురాలే చూసుకోవాలి. ఓ రోజు ఆరునెలల గర్భిణి రక్తస్రావంతో ఆస్పత్రికి వచ్చింది. ఆలస్యం చేస్తే గర్భస్రావం జరగవచ్చు. దాంతో అత్యవసర చికిత్సలో భాగంగా ఆమెకు రక్తాన్ని అందిస్తూ, చికిత్స చేయడం మొదలుపెట్టాను. ఆలోగా మరో గర్భిణి అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చింది. ఆమెకది ఎనిమిదవ గర్భం. వరుస ప్రసవాలతో గర్భాశయం పలుచనై, చీలడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఇద్దరికీ ఒకే సమయంలో చికిత్స అందించలేకపోయాను. అలా రెండో గర్భిణికి చికిత్స అందించడానికి గంట ఆలస్యం జరగడంతో గర్భాశయం చీలిపోయింది. బిడ్డను కాపాడుకోగలిగినా, గర్భాశయాన్ని తొలగించవలసివచ్చినందుకు ఎంతో బాధపడ్డాను. ప్రసూతి వైద్యురాలిగా ఇలాంటి ఎన్నో క్లిష్ట సమయాలను ఎదుర్కొన్నాను. 


రిటైర్మెంట్‌ వయసు కాదు!

58 ఏళ్ల వయసు అంటే రిటైర్మెంట్‌ వయసు అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. కానీ ఎదుగుదలకు వయసును అడ్డంకిగా భావించకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు ఈ వయసులో ఇంటికే పరిమితమై విశ్రాంత జీవితం గడుపుదామనే ఆలోచనతో ఉంటారు. కానీ చేతనైనంతవరకూ ఎవరి తమకు తెలిసిన విద్యకు పదును పెడుతూనే ఉండాలి. విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. పూర్వంతో పోలిస్తే, ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వనరులు, సౌలభ్యాలు బోలెడు. కాబట్టి 58 ఏళ్ల యవసులో ఉన్న మహిళలు, మరీ ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారు మరో పదేళ్ల పాటు తమ పరిధి, వెసులుబాటు మేరకు నియమిత సమయాల పాటు ఉత్పాదక పనులను కొనసాగించగలిగితే స్వదేశీ వైద్యపరమైన మార్గదర్శకాల రూపకల్పన సాధ్యపడుతుంది. ఫలితంగా చికిత్సా విధానాల్లో కూడా అభివృద్ధి సాధ్యపడుతుందని నా అభిప్రాయం.’’


సవాళ్లూ, ఇబ్బందులూ బోలెడు!

‘‘రియాద్‌లో నేనొక ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేశాను. ఆ ఆస్పత్రి ప్రధాన ధ్యేయం ధనార్జనే! దాంతో ఆస్పత్రికి వచ్చే 40 ఏళ్లు దాటిన మహిళలు సహజసిద్ధంగా గర్భం దాల్చే వీలు లేకపోయినా, వాళ్లను నమ్మించి చికిత్స ఇవ్వమని నన్ను ఆదేశించేవారు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పి, ఐ.వి.ఎఫ్‌ ఉన్న ఆస్పత్రికి పంపించేదాన్ని. అక్కడి ప్రజలు కుటుంబనియంత్రణను మహాపాపంగా పరిగణిస్తారు. నెలలోగా గర్భం దాల్చకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటానంటూ నాముందే భర్తలు భార్యలను బెదిరించిన సందర్భాలూ ఉన్నాయి. ‘ఎక్కువ సంతానం కోసం రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు. ఇంతమంది పిల్లలను కనడం అవసరమా? వాళ్లందరినీ ఎలా పెంచుతారు?’ అనే ప్రశ్నకు ‘అంతా ఆ అల్లానే చూసుకుంటాడు’ అని సమాధానం ఇచ్చేవారు. ‘అంతా ఆ అల్లానే చూసుకునే పనే అయితే, ఆ అల్లా మీకు మెదళ్లను ఎందుకిచ్చాడు?’ అని ప్రశ్నించేదాన్ని. ‘స్వతహాగా ఆలోచించి మెరుగైన నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాతే అల్లా మీద భారం మోపాలి! ఇంతమంది పిల్లలను కనడంలో ఉండే సంతృప్తి కంటే, ఇద్దరు పిల్లలను కని, వాళ్లను యూనివర్శిటీ స్థాయి వరకూ చదివిస్తే కలిగే సంతృప్తి ఎంతో గొప్పగా ఉంటుంది’ అంటూ హితబోధ చేసేదాన్ని. నా మాటలకు కోపం తెచ్చుకోకపోగా, ఆసక్తిగా వినేవాళ్లు. ఆచరించకపోయినా, నా మాటలు వారిలో ఆలోచనను రేకెత్తిస్తే చాలు అని సరిపెట్టుకుంటూ ఉంటాను.’’


Updated Date - 2020-10-29T10:56:08+05:30 IST