ఈ రెండు పాట‌ల వల్లే తెలంగాణ గడ్డమీద బతుకుతున్నా

ABN , First Publish Date - 2020-02-07T20:44:09+05:30 IST

పీవీ చలపతిరావు. జానపద కళాకారులకు సుపరిచితమైన పేరు ఇది. నాలుగు దశాబ్దాలుగా జానపదాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఈ రెండు పాట‌ల వల్లే తెలంగాణ గడ్డమీద బతుకుతున్నా

పుట్టింది కృష్ణా జిల్లాలో.. నా ఊరినే మ‌ర్చిపోయా..

ఆంధ్రా ప్రాంతం వాళ్లు నన్ను ఓన్‌ చేసుకునే పరిస్థితి లేదు

తెలంగాణ‌లో పాపులర్‌ పాటలన్నిటికీ నేనే మూలం

నా తుదిశ్వాస తెలంగాణ గ‌డ్డ‌పైనే విడుస్తా

మొదటిసారి స్టేజ్‌పై పాడగానే నాపై డాలర్లు చల్లారు

నా పాటలు విన్నాక బాపు అభిప్రాయం మార్చుకున్నారు

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో జానపద గాయకులు పీవీ చలపతిరావు


పీవీ చలపతిరావు. జానపద కళాకారులకు సుపరిచితమైన పేరు ఇది. నాలుగు దశాబ్దాలుగా జానపదాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తన జీవితం గురించి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో 18-12-2016న జరిగిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పంచుకున్నారు.

 

ఆర్కే: ఎలాఉన్నారు?

చలపతిరావు: బాగున్నాను

 

ఆర్కే: నాలుగు దశాబ్దాలుగా పాటే ప్రాణంగా బతికేస్తున్నారా?

చలపతిరావు: అవును. ఇదే జీవనం. సంప్రదాయ జానపద గేయాలు పాడుతూనే ఉన్నాను. నా వృత్తి, ప్రవృత్తి ఇదే.

 

ఆర్కే: జానపద గేయాలు పాడే వారిలో మీరే సీనియర్‌ అనుకుంటా?

చలపతిరావు: అవును. 43 ఏళ్లుగా పాడుతున్నాను. ఒక పెద్దాయన జానపదం పాడుతుంటే విన్నాను. దానికి బాగా అట్రాక్ట్‌ అయ్యాను. అప్పటి నుంచి జానపదం నా పాటగా ఎంచుకున్నా.

 

ఆర్కే: ఆ పెద్దాయన పాడిన పాట ఏంటి?

చలపతిరావు: ఓడెళ్లి పోతున్నది... మారాజ.. ఓడెళ్లి పోతున్నది... హైలెస్సా... ఒహో...హైలెస్సా..

 

ఆర్కే: ఈ పాట ఆయన ఎక్కడ పాడారు?

చలపతిరావు: బల్కంపేటలో. నా చిన్నతనంలోనే బతకడం కోసం హైదరాబాద్‌ కోసం వచ్చేశాం. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెనక ఉండేవాళ్లం. ఆయన పాట విని బాగా అట్రాక్ట్‌ అయ్యా. వెంటనే అడిగి పాట రాసుకున్నా. ఆయన దగ్గరే నేర్చుకున్నా. ఆయనే నా గురువు. ఆ తరువాత ఆల్‌ ఇండియా రేడియో లైట్‌ మ్యూజిక్‌ ఆర్టిస్ట్‌గా సెలక్ట్‌ అయ్యా. అక్కడే వింజమూరి సీతగారు ప్రొడ్యూసర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉండేవారు. ఆ మహాతల్లి నన్ను ఫోక్‌లో కన్వర్షన్‌ చేసుకుని నేర్పించారు.

 

ఆర్కే: జానపద గేయాలు పాడే వాళ్ల నేపథ్యం భిన్నంగా ఉంటుంది. పేదరికం, గ్రామీణనేపథ్యం, నిర్లక్ష్యానికి గురికాబడ్డ వర్గాల నుంచి వచ్చిన వాళ్లు ఎక్కువగా జానపద గేయాలు పాడటాన్ని ఎంచుకుంటారు. కానీ మీరు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి క్లాసికల్‌ మ్యూజిక్‌ వైపు కాకుండా ఇటువైపు ఎందుకొచ్చారు?

చలపతిరావు: నాకంటూ ఒక గుర్తింపు కావాలని జానపదాన్ని ఎంచుకున్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రభావం నాపైన చాలా ఉంది. నా బతుకు తెలంగాణలో నడుస్తోంది. నా ఆఖరి ఊపిరిపోయేది తెలంగాణ గడ్డమీదే. అందుకే ఈ మార్గం ఎంచుకున్నాను. ఒకసారి మా తమ్ముడు ఎన్నాళ్లు ఇలా పాడతావు. మద్రాసు వెళ్లి గ్రామ్‌ఫోన్‌ రికార్డింగ్‌లో ప్రయత్నించవచ్చు కదా అన్నాడు. దాంతో రైలెక్కా. నెల్లూరు వరకే టికెట్‌ డబ్బులున్నాయి. అక్కడి నుంచి మద్రాసు వరకు టికెట్‌ లేకుండానే ప్రయాణించా. రైలు దిగగానే టికెట్‌ కలెక్టర్‌ ఆపాడు. ఉన్నది ఉన్నట్లు నిజం చెప్పా. గంట సేపు పక్కన నిలుచోమన్నాడు. తరువాత ఏం పని చేస్తావని అడిగితే సింగర్‌ను అన్నాను. దేవుని మీద ఒక పాట పాడు అన్నాడు. ‘‘ఉమామహేశ్వర...’’ అని పాట పాడాను. ఆ పాట విని నువ్వు ఆర్టిస్ట్‌వే అన్నాడు. జేబులో పది రూపాయలే ఉన్నాయి. ఆయనే ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి హోటల్‌కెళ్లి టిఫిన్‌ చేసి పొమ్మన్నాడు. అక్కడ టిఫిన్‌ చేసి హెచ్‌ఎంవి కంపెనీకి వెళ్లా. కన్నన్‌గారని మేనేజర్‌ ఉండే వారు. ఆయన్ని కలిస్తే సరే మళ్లీ పిలిస్తాం అన్నారు. మూడు సార్లు పిలిచినా రికార్డింగ్‌ షెడ్యూల్‌లో ఖాళీ లేక నా పాట రికార్డింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు నాలుగోసారి నా పాట రికార్డింగ్‌ చేశారు.

 

ఆర్కే: కోడివాయె లచ్చమ్మది పాట ఎవరిదగ్గరైనా నేర్చుకున్నారా? బాణీలు కూడా మీరే కట్టారా?

చలపతిరావు: ఒకసారి బోధన్‌లో ప్రోగ్రామ్‌ ఇచ్చాను. వన్స్‌మోర్‌ అనే వాళ్లు. ఈ పాట నేను పాడానని చాలా మందికి తెలియదు. నేను పాడినప్పుడు చాలా మంది పుట్టి ఉండకపోవచ్చు.


ఆర్కే: పాటలకు సంబంధించిన పదాలు, సాహిత్యం ఎక్కడి నుంచి సేకరించే వారు?

చలపతిరావు: గత నలభై ఏళ్లలో నేను తెలంగాణలో తిరగని ప్రాంతం అంటూ లేదు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం రోజున కంటిన్యూగా 14 సంవత్సరాలు పాడాను.

 

ఆర్కే: ఏం పాట పాడే వారు?

చలపతిరావు: అన్నమాచార్య కీర్తనలు పాడే వాణ్ణి.

 

ఆర్కే: తెలంగాణలోనే కాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తగ్గట్టుగా పాటలు పాడే వారా?

చలపతిరావు: ఇక్కడితో పోల్చితే అక్కడ తక్కువ. ఇక్కడ కట్టమైసమ్మ, ఎల్లమ్మ అని అమ్మవారి రూపాలు పిలుస్తాం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోలేరమ్మ, నూకాలమ్మ.. అని పిలుస్తారు. ‘‘గంగానమ్మో...పోలేరమ్మో... గంగరాయు చెట్టు కింది అంకాలమ్మో’’ ఇలా ఉంటాయి. రాయలసీమకెళితే పోతులూరి వీరబ్రహ్మం, అన్నమాచార్యులు, కవయిత్రి మొల్ల.. వీరి ప్రభావం కనిపిస్తుంది. ‘‘మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు, తుళ్లేవు..ముందు గతి కానవే చిలకా...ఓ రామచిలకా’’ ఈ పాటలు వినిపిస్తాయి.


ఆర్కే: ఉత్తరాంధ్ర కూడా పర్యటించారా?

చలపతిరావు: పర్యటించాను. ‘’జోడుకొయ్యల వాడ మీద సిరి సిరి మువ్వ.. జోడగ్గిపెట్టెలంపినానె సిరిసిరి మువ్వ...’’ ఈ పాట అక్కడిదే.‘‘జంబైలే జోరు లంగరు... ఔరౌరా... మున్నోళ్ల భాయి లంగరు...’’ ఇది కూడా ఎక్కువ గుర్తింపు పొందింది.


ఆర్కే: ఈ పాటలు మీరు సేకరించి పాడారు. అయితే ఎవరి నోటి నుంచి ముందుగా బయటకొచ్చాయో చరిత్రలో లేకుండా పోయింది కదా? 

చలపతిరావు: ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాండలికం ఉంటుంది. నేను ఏ ప్రాంతంకెళితే అక్కడ పొలాల్లోకి వెళ్లి అక్కడ వాళ్లు పాడుకుంటున్న పాటలు సేకరించే వాణ్ణి.


ఆర్కే: ఆంధ్రా ప్రాంతంలో పుట్టారు. తెలంగాణలో స్థిరపడటం వల్ల మీకు ఇబ్బంది ఎదురైందా?

చలపతిరావు: ఇప్పుడు వచ్చింది. ఆంధ్రా ప్రాంతం వాళ్లు నన్ను ఓన్‌ చేసుకునే పరిస్థితి లేదు. నేను పుట్టింది కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామంలో. ఇప్పుడు నా ఊరినే నేను మర్చిపోయాను. ఇక వాళ్లు నన్ను ఎందుకు ఓన్‌ చేసుకుంటారు. ఆ అవకాశం లేదు. ఇక్కడ మొదట్లో ఓన్‌ చేసుకున్నారు. కానీ ఉద్యమం మొదలైన తర్వాత తేడా వచ్చింది. కానీ తెలంగాణ జానపద కళాకారులు, సహగాయకులు మాత్రం అన్నా అనే పిలిచారు.

  

ఆర్కే: రాష్ట్రం విడిపోయి రెండున్నర సంవత్సరాలు దాటింది. ఇప్పుడు విభేదాలు ఉండాల్సిన అవసరం లేదు కదా?

చలపతిరావు: కొత్త రాష్ట్రం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయినా ఇప్పటివరకూ ఒక్క ప్రోగ్రాం లేదు. నాకు రెండేళ్లు వయసు ఉన్నప్పుడు ఇక్కడకొచ్చాను. మొత్తం తెలంగాణ మాండలికంలో నాకున్న అనుభవం మిగిలిన వాటిలో అంతగా లేదు. కమాండ్‌ ఇక్కడ ఉంది కానీ డిమాండ్‌ లేదు. ఇక్కడి పాపులర్‌ పాటలన్నిటికీ నేనే మూలం. ఈ ప్రోగ్రాం రికార్డును ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి అంకితం ఇవ్వాలని నా ఆఖరు కోరిక.


ఆర్కే: కేసీఆర్‌ గారి దగ్గరకు తీసుకెళ్లమని బాలకిషన్‌ గారిని అడక్కపోయారా?

చలపతిరావు: బాలకిషన్‌ నాతో చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఇప్పటికి ఐదారు సార్లు ఫోన్‌ చేశాను. తప్పకుండా పిలుస్తాను అంటాడు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు విని, ఆనందించిన ‘అమ్మా బయలెల్లినాదే’, ‘కోడిబాయె లచ్చమ్మది’ పాటలు తెలంగాణ మాండలికంలో రాసిన పాటలు వీటివల్లే నేను తెలంగాణ గడ్డమీద బతుకుతున్నాను. ఇది కేసీఆర్‌ గారికి అంకితం ఇస్తే నా జీవితాశయం నెరవేరుతుంది.

 

ఆర్కే: కష్టజీవుల మీద ఏదైనా పాట పాడండి.

చలపతిరావు: ‘‘ఏటికేతం బట్టి వెయి పుట్లు పండిచినా, గంజిలో మెతుకెరుగరన్నా...’’

‘‘వానల్లు కురవాలి... వరిచేలు పండాలి.. బుడుగో.. బుడుగో...

మా ఇల్లు నిండాలి... మా గాదె నిండాలి

మా యమ్మ వండాలి... మా కడుపు నిండాలి...’’

 

ఆర్కే: మీ పిల్లలు ఏం చేస్తున్నారు?

చలపతిరావు: ఇద్దరు మగపిల్లలు చనిపోయారు. ఆడపిల్లలు ముగ్గురికీ పెళ్లిళ్లు అయిపోయాయి. అందరూ జీవితంలో బాగా స్థిరపడ్డారు.


*************************************************
36 ఏళ్ల కిందట మద్రాస్‌ ఎయిర్‌లో పాడాను. హెచ్‌ఎంవి కంపెనీవాళ్లు 65 లక్షలు సంపాదించారు దానిమీద. వెయ్యి కాపీలు అమ్ముడుపోతే చాలన్నారు. కానీ ఐదు లక్షల గ్రామ్‌ఫోన్‌ రికార్డులు అమ్ముడుపోయాయి. అప్పుడు నేను రాయల్టీ డిమాండ్‌ చేసే స్థితిలో లేను. వాళ్లు నాకు భిక్ష పెట్టారు. కొత్త కళాకారుడిని నామీద రిస్క్‌ చేశారు. రాయల్టీ కింద అప్పట్లో నాకు 80 వేల దాకా వచ్చింది.
 
మరోసారి నన్ను విమానంలో చెన్నై పిలిపించారు. ఇంకో పాట రికార్డు చేస్తారా అని అడిగారు. ఎల్‌ఆర్‌ ఈశ్వరిగారితో బాగుంటుందని కణ్ణన్‌గారు సూచించారు. ఆమెను అక్కయ్యా అని పిలిచేవాడిని. ఆ రికార్డు అంతగా అమ్ముడుపోలేదు. కానీ అక్కా, తమ్ముడిగా మా రిలేషన్‌ మాత్రం కొనసాగింది.
 
అమృతా ఫిలింస్‌ వారి ‘ఊరికిచ్చిన మాట’ సినిమాలో పాట పాడే అవకాశం వచ్చింది. ఆ పాటలో చిరంజీవి, సుధాకర్‌ నటించారు. చిరంజీవికి బాలుగారు పాడితే, సుధాకర్‌కు నేను పాడాను. ‘‘ఆడింది ఊరు, పాడింది పైరు, ఎగసెగసి పడుతోంది మన ఊరు’’ పాట అది. దురదృష్టవశాత్తూ ఆ సినిమా సక్సెస్‌ కాలేదు.
 
శ్రీపతి రాజేశ్వరరావు గారు తీసిన ‘శశిరేఖా శపథం’ సినిమాలో ఒక జాతీయ పార్టీకి వ్యతిరేకంగా పాడాల్సి వచ్చింది. పాటలు పాడుకునేవాడిని నాకు రాజకీయాలు ఎందుకని పాడనన్నాను. ఆప్పుడు ఆ పాటలో రెండు లైన్లు మార్చి రాశారు.
 
ఎస్పీ బాలు గొప్ప గాయకుడు. ఆయనకు సంప్రదాయ జానపదాలు అంటే పెద్దగా గిట్టదేమో అనిపిస్తుంది. ఒక చానెల్‌లో ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమంలో సినిమా జానపదాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
 
తెలుగువారందరూ తెలుసుకోవాల్సిన గొప్ప వ్యక్తి కొసరాజు రాఘవయ్య చౌదరి. ఆయన రాసిన పాటల్లో జానపద సంప్రదాయ మూలం తీసుకొనేవారు. జానపదానికి సంబంధించినంతవరకూ కొసరాజు గారు నాకు గాడ్‌ఫాదర్‌.
 
ఈటీవీలో ఆదివారం ప్రసారమయ్యే తెలుగు-వెలుగు కార్యక్రమంలో సంవత్సరన్నర పాడాను. ఒక రూపాయి నాకు వారు ఇవ్వలేదు. నేను అడగలేదు. అయితే ఒక్కటే సంతోషం ఏమిటంటే ఈటీవీ యాజమాన్యం నుంచి ఏడాదికి ఒకసారి ద్రాక్షపళ్లు వచ్చేవి. ఏటా ఒక డైరీ వచ్చేది. నూతన సంవత్సర శుభాకాంక్షలు పంపేవారు. అందుకు వారికి నా కృతజ్ఞతలు.
 
తిరుమల శ్రీవేంటేశ్వర స్వామిపై అన్నమాచార్యులవారు రాసిన పాటల్లో దాదాపు ఇరవై శాతం ఫోక్‌ ఉన్నాయి. అందులో నేను కంపోజ్‌ చేసిన ‘‘ఎండ కానీ, నీడ కానీ, ఏమైనా కానీ.. కొండల రాయుడే మా కులదైవం..’’ ట్యూన్‌ చాలా ప్రాముఖ్యం పొందింది.

ఎన్నికల సమయంలో ఇందిరాగాంధీ బల్కంపేట వచ్చారు. ఆ సమయంలోనే ఈ పాట రిలీజ్‌ చేశాను. ఆమె కోసమే ఈ పాట రిలీజ్‌ చేశామని అనుకున్నారు. కానీ అది నిజం కాదు.
 
1985లో లాస్‌ఎంజెల్స్‌లో మొదటిసారి స్టేజ్‌షోలో పాడాను. అప్పటికి ఈపాటలు కొత్త. పదిహేను నిమిషాలు సమయం ఇచ్చారు. కోడివాయె లచ్చమ్మది పాట పాడితే నాలుగు సార్లు అడిగి మరీ పాడించుకున్నారు. డాలర్లు చల్లారు. గంట ఇరవై నిమిషాలు పాడించారు. ఇప్పటికి ఇరవై రెండు సార్లు అమెరికా వెళ్లాను.
 
సెన్సార్‌బోర్డు సభ్యుడిగా పనిచేశాను. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుంగా చాలా సినిమా సన్నివేశాలకు కత్తెర పడేలా చేశాను. ఎవరి ఒత్తిళ్లకు లొంగేవాణ్ణి కాదు.
 
జానపదాలంటే చిన్నచూపు ఉండేది. కానీ నీ పాటలు విన్నాక నా అభిప్రాయం మార్చుకున్నాను అని బాపుగారన్నారు.
 
దేవాలయం సినిమాలో నా పాటను వాడారు. సినిమా గాయకుని చేత పాడించారు. హెచ్‌ఎంవికి ఉత్తరం కూడా రాశా. నా పాటను అనుమతి లేకుండా ఎలా వాడారు అని? ఇంకోసారి అలా జరగకుండా చూస్తాం అన్నారు. అమ్మా బైలెల్లి నాదే అన్న పాట అది.
దేవతను సినిమాలో నా ట్యూన్‌ను కాపీ కొట్టి మెలొడి సాంగ్‌గా మార్చి పెట్టుకున్నారు. నేను పాడిన పాట, నా ట్యూన్‌ ఇది.. అమ్మ వారి పైన పాడాను. ‘‘వచ్చింది వచ్చింది.. మాయమ్మ వచ్చింది... మా ఇంటికొచ్చింది... వచ్చింది.. వచ్చింది.. మాతల్లి వచ్చింది.. మా ఇంటికొచ్చింది...రండి రండి మా ఇంటికి..’’ ఇది నా పాట. సినిమాలో కోరస్‌ హమ్మింగ్‌తో మొదలవుతుంది.
 
జానపద పాటలు
‘‘ అమ్మా బైలెల్లినాదో... అమ్మతల్లీ బైలెల్లినాదో.. అమ్మా బైలెల్లినాదో నాయనా.. తల్లీ బైలెల్లినాదో నాయనా..’’

‘‘ఎడ్లువాయె... గొడ్లువాయె...ఎలమదొర మందవాయె...గొడ్లుగమ్మ నేను పోతే.... కందిరీగ కరిసిపాయె.... అరెరెరెరె.
కోడిబాయె లచ్చమ్మది.. కోడిపుంజువాయె లచ్చమ్మది.. ఎడ్లువాయె, గొడ్లువాయె..ఎలమదొర మందవాయో.. గొడ్లుగమ్మ నేనుపోతే.. కందిరీగ కరిసిపాయె’’

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో...నల్గొండ దాటి ఉయ్యాలో... నన్నిచ్చినారే ఉయ్యాలో..

Updated Date - 2020-02-07T20:44:09+05:30 IST