చలంలా పేరు తెచ్చుకోవాలనే నవల్లో శృంగారం ఎక్కువ

ABN , First Publish Date - 2020-02-07T20:50:42+05:30 IST

నమస్కారం, రావూరి భరద్వాజగారూ.. జ్ఞానపీఠ అవార్డు వరించినందుకు అభినందనలు. అంత ఉత్కృష్టమైన పురస్కారం లభించినందుకు మీకెలా అనిపిస్తోంది.

చలంలా పేరు తెచ్చుకోవాలనే నవల్లో శృంగారం ఎక్కువ

‘పాకుడురాళ్లు’ కథానాయిక ‘మంజరి’ అసలు పేరు నాడైరీలో

నేను చనిపోయాక అచ్చులో చూడొచ్చు

‘నీ గురించి కూడా ఉంది, చూడరా’ అనేవాణ్ని

22-7-2013న ఓపెన్ హార్ట్‌లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ


నమస్కారం, రావూరి భరద్వాజగారూ.. జ్ఞానపీఠ అవార్డు వరించినందుకు అభినందనలు. అంత ఉత్కృష్టమైన పురస్కారం లభించినందుకు మీకెలా అనిపిస్తోంది.

ఆ రోజు.. ఢిల్లీనుంచి ఫోన్‌ వచ్చింది... ‘మీకు జ్ఞానపీఠ్‌ అవార్డు వచ్చింది, కంగ్రాట్స్‌’ అని చెప్పారు. ముందసలు నమ్మలేదు. అప్పుడెప్పుడో.. నాకూ ఆ అవార్డు వస్తే బాగుండనుకున్నానుగానీ, వస్తుందనుకోలేదు. ఆ అనుభూతిని వర్ణించడానికి సంతోషం, ఆనందం.. అనే మాటలేవీ సరిపోవు.


మీ నేపథ్యం ఏమిటసలు?

మా నాన్న కోటయ్యది గుంటూరుజిల్లా తాడికొండ. మా అమ్మ మల్లికాంబ హైదరాబాద్‌ సంస్థానంలోని పరిటాల జాగీరులో చిన్న గ్రామవాసి. నాన్నకు పొలం ఉండేది. కానీ, సంఘసేవతో అం తా పోయింది. తర్వాత ఆయన కూలికెళ్తేఅమ్మ గ్రేడింగ్‌ పనిచేసేది. నేను పనీ పాటా లేకుండా తిరుగుతుంటే అడుక్కుతినడానిక్కూడా పనికిరావురా అనేవారు. దాంతో ఇంట్లోంచి వచ్చేసి, ఊరి చెరువు లో నీళ్లు తాగి చెట్టుకింద పడుకునేవాణ్ని. ఎవరైనా దయతో ఇంతపెడితే తినేవాణ్ని. ఒక్కోసారి రెండుమూడు రోజులు చెరువు నీళ్లే గతయ్యేవి. కొన్నాళ్లు కూలిపనికెళ్లా.


రాయడం ఎందుకు మొదలెట్టారు?

రచయితనైతే నేను రాసింది వందల మందికి చేరుతుంది. అంతమందికి నేరు గా చెప్పాలంటే మీటింగ్‌ పెట్టాలి, జనం రావాలి. ఇదంతా కష్టం.. అందుకే రాశా.


సినిమా తారలను సన్నిహితంగా గమనించడంవల్లే ‘పాకుడు రాళ్లు’ రాశారా?

అవును. మద్రాసులో సుప్రసిద్ధ కథారచయిత ధనికొండ హన్మంతరావు జ్యోతి, అభిసారిక, చిత్రసీమ అనే పత్రికలు పెట్టారు. వాటిలో ‘చిత్రసీమ’ పని నాకు అప్పజెప్పారు. సినిమా తారలను కలిసి, వాళ్లతో మాట్లాడి, రాయడం నా పని. దీంతో ఎక్కువ మంది తో పరిచయం కలిగింది. అందులో.. ఒకనటి తనకు రావాల్సిన డబ్బు ఎలా తెలివిగా తెచ్చుకుందో చెప్పింది. నన్ను ‘బావా’ అని, మా ఆవిడ కాంతాన్ని ‘పిన్నీ’ అనీ పిలిచేది. అదేం వరస అంటే.. ‘సినిమావాళ్లకు వరసలేంటి?’ అనేది. అలాంటి అనుభవాలన్నీ డైరీలో రాసుకునేవాణ్ని. వాటి ఆధారంగా ‘మాయ జలతారు’ కథ రాశాను. మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు దాన్ని చదివి.. ‘ఐదారు వందల పేజీల నవలగా రాయాల్సినదాన్ని 30-40 పేజీల్లో రాశావు’ అన్నారు. తర్వాత.. కృష్ణా పత్రిక ముదిగొండ సుబ్రహ్మణ్యం సీరియల్‌ రాయమన్నపుడు ఈ కథ చెబితే రాయమన్నారు. దీనికి ‘పాకుడురాళ్లు’ శీర్షిక పెట్టింది శీలా వీర్రాజు. ఆ సీరియల్‌ వస్తున్నప్పుడు దాన్ని నిషే ధించాలని పత్రి కను రాకుండా చేయా లని చాలామంది సినీప్రముఖులు యత్నించారు.

మిమ్మల్ని చంపుతామని కూడా బెదిరించారట..

అవును.. ‘పోతేపోనీ.. చావక తప్పదు. మీరు కాకపోతే దేవుడు చంపుతాడు’ అనుకునేవాణ్ని. ఆ తర్వాత బెజవాడలో ఒక పబ్లిషింగ్‌ కంపెనీవాళ్లు ఆ సీరియల్‌ను పుస్తకంగా అచ్చువేశారు. ఇక ఆత్రేయ నాకు మంచి మిత్రుడు. మేం అరే, ఒరే అనుకునేవాళ్లం. ఆయన కూడా ‘అలా రాస్తున్నావేంట్రా’ అనే వారు. ‘నీ గురించి కూడా ఉంది, చూడరా’ అనేవాణ్ని. ఆత్రేయతో ‘జమీన్‌రైతు’ పత్రికలో పనిచేసినప్పుడే మాకు పరిచయం. మమ్మల్ని దగ్గర చేసింది ఆకలి, అవసరాలే.


‘పాకుడురాళ్లు’లో మంజరి పాత్రకు ప్రేరణ అయిన కథానాయిక ఎవరు?

అది చాలామంది నాయికల అనుభవ సమాహారం. అయితే, ఆమె అసలుపేరు నా డైరీల్లో ఉంది. నేను చనిపోయాక అవి అచ్చయితే బయటపడుతుంది. అందాకా వద్దు.


మీ నవలలో శృంగారం ఎక్కువని విమర్శ..

పాకుడురాళ్లలో లేదుగానీ, అంతకుముందు రాసినవాటిలో ఉంది. నామీద చలం ప్రభావం ఎక్కువ. ఆయనలా రాయాలనే తపన. ఒకసారి కథ రాస్తే.. పేరు లేకుండా చదివితే ఇది చలంగారిదో, భరద్వాజదో చెప్పలేం అన్నారందరూ. తర్వాత నాదైన శైలికోసం రెండేళ్లు ఆపేసి, మళ్లీ మొదలుపెట్టాను.


మీకు పెళ్లెప్పుడైంది?

1948లో... ఆమె ఎంతో దయామయురాలు. సంపన్నురాలైనా నా లేమిని, విద్యాహీనతను, నిరుద్యోగాన్ని చాలా దయగా భరించింది. 1986లో చనిపోయింది. అమాయకుడైన బిడ్డను తెలివైన తల్లి ఎలా చూస్తుందో ఆ బంగారు తల్లి నన్నలా చూసుకుంది. ఆమె పేరు కాంతం అయినా.. ఈ కారణంవల్లే నేను ‘కాంతమ్మ’ అనేవాణ్ని.


సమాజంలో దయ లోపిస్తోంది కదా.. మీకేమనిస్తోంది?

లోపిస్తోంది కాదు.. లోపించింది. బాధపడేవాణ్ని చైతన్యపరచడమే దీనికి పరిష్కా రం. కానీ, ‘నీకు ఇల్లిస్తాం, ఉద్యోగమిస్తాం, ఉద్ధరిస్తాం’ అంటూ 60-70 ఏళ్లుగా చెప్తూ వారిని పనికిరాకుండా చేస్తున్నారు. కానీ, మార్పు తథ్యం. అయితే, అది అందరినీ సంతృప్తిపరిచే స్థాయిలో రావాలి. ఎవరూ తమ గతాన్ని మరచిపోకూడదు.


పుస్తక పఠనం ఎప్పట్నుంచీ అలవడింది?

మేమంతా ఒకరోజు చెరువుకట్ట మీద కూర్చుని మాట్లాడుకుంటున్నాం. అక్కడున్నవాళ్లలో ఒక అబ్బాయిని ఎవరో ఒక పద్యం చదవమంటే చదివి వినిపించాడు. అది విని.. మా ఇంటి ఎదురుగా ఉండే శేషయ్య అనే ఆయన ‘మన కోటయ్య కొడుకూ ఉన్నాడు. గొడ్డు ఎదిగినట్టు ఎదిగాడు. పొట్టకోస్తే అక్షరం ముక్క లేదు. ఎందుకు పనికొస్తావురా, ఛీ’ అని తిట్టాడు. అది విని చుట్టూ ఉన్నవాళ్లు ఫక్కున నవ్వారు. దీంతో ఆ పద్యం ‘మనుచరిత్ర’లోనిదని తెలుసుకుని ఒక కాగితం మీద రాయించుకుని లైబ్రరీకి వెళ్లాను. ఆ పుస్తకం ఇమ్మని అడిగితే.. నెలకు పావలా చందా కట్టాలని లైబ్రేరియన్‌ చెప్పారు. ఆ డబ్బు లేక దిగులుగా కూర్చున్నాను. అప్పుడు కొల్లూరు వెంకటేశ్వర్లు అనే మిత్రుడు ఐదు రూపాయలు ఇచ్చాడు. వెంటనే లైబ్రరీకి వెళ్లి రూ.3 కట్టి ఏడాదిపాటు అందులో ఉన్న పుస్తకాలన్నీ చదువుకున్నాను. అదే నాలో భాషాజ్ఞానాన్ని పెంచింది. ఆ దయామయుడి దయవల్ల చదువుకున్నాను కాబట్టే ‘పాకుడురాళ్లు’ నవల ఆయనకు అంకితం ఇచ్చాను.


ఏడో తరగతితో చదువెందుకు మానేశారు?

అవును, ఏడో తరగతి పాసయ్యాను. ఆ తర్వాత ఒకసారి స్కూలుకెళ్తే.. ‘రేపు స్కూలుకు డీఈవో వస్తున్నారు, అందరూ కొత్తలాగూ, చొక్కా వేసుకురండి’ అని హెడ్‌మాస్టారు రావినూతల వెంకట సుబ్బయ్య చెప్పారు. నేను మామూలుగానే చిరిగిన బట్టలు వేసుకుని వెళ్లాను. దీంతో ఆయన నన్ను చితక్కొట్టారు. నాకు కోపం వచ్చి పుస్తకాలు అక్కడ గిరాటుకొట్టి బయటికొచ్చాను. మళ్లీ బడికెళ్లలేదు. మిగతావాళ్లందరూ హైస్కూల్లో, కాలేజీల్లో విశ్వవిద్యాలయాల్లో చదివి నేర్చుకుంటే నేను ఆకలి నుంచి, అవసరం నుంచి, అవమానం నుంచి పాఠాలు నేర్చుకున్నాను.

Updated Date - 2020-02-07T20:50:42+05:30 IST