‘మహర్షి విశ్వామిత్ర’లో మీరే చేయాలని ఎన్టీయార్‌ కబురంపారు.. కానీ..

ABN , First Publish Date - 2020-02-07T21:15:47+05:30 IST

ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది? తొలి అడుగులు వేసిన నాటి నుంచి.. అత్యున్నత శిఖరాలకు వెళ్లే వరకు విశ్రమించనంత వరకు. అప్పుడే ఆ వ్యక్తి మహోన్నత చరిత్రలో నిలిచిపోతారు.

‘మహర్షి విశ్వామిత్ర’లో మీరే చేయాలని ఎన్టీయార్‌ కబురంపారు.. కానీ..

నా నాట్యం చూసి అక్కినేని వెళ్లిపోయారు

నాట్యం కోసం సినిమాలను వదులుకున్నా

నా డ్యాన్స్‌ వల్ల పరువు పోయిందన్నారు

‘నీకు కాదు నీ ప్రిన్సిపుల్స్‌కు’ అంటూ నమస్కారం పెట్టారు

‘మాకు పాప పుట్టింది. మీ పేరే పెట్టుకున్నాం’ అని చెప్పాడు

ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో నృత్యకారిణి శోభానాయుడు


ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది? తొలి అడుగులు వేసిన నాటి నుంచి.. అత్యున్నత శిఖరాలకు వెళ్లే వరకు విశ్రమించనంత వరకు. అప్పుడే ఆ వ్యక్తి మహోన్నత చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి కళా చరిత్రను సొంతం చేసుకున్న నృత్యకారిణి శోభానాయుడు. తెలుగులోగిలిలో మోగిన ఆమె కాలి అందెల సవ్వడి.. దేశ విదేశాల్లోను మార్మోగింది. వేలమంది నృత్యకారులకు స్ఫూర్తిని అందించింది. ఓపెన హార్ట్‌ విత్ ఆర్కేలో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో తన జీవిత విశేషాలను పంచుకున్నారు శోభానాయుడు.ఆర్కే: ఐదు దశాబ్దాల మీ నాట్య ప్రయాణం ఎలా ఉంది?

శోభానాయుడు: నాకు వేరే ప్రపంచం లేదు. నాట్యమే నా ధ్యాస. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధ్యేయాన్ని మరవకుండా ప్రయాణిస్తున్నాను.ఆర్కే: మీ ఇంట్లో ఎలా ఉండేది?

శోభానాయుడు: మా ఇంట్లో పాటలు పాడేవారున్నారు. డ్యాన్స్‌ వచ్చిన వారు లేరు. మా ఇంట్లో డ్యాన్స్‌ అనేది బ్యాన్‌. నేను ఇలా ఉన్నానంటే మా అమ్మే కారణం. ఎందుకంటే నాకు మూడేళ్లప్పుడు ఊయలలో ఊగేప్పుడు లయబద్ధంగా చేతులు, కాళ్లు కదిపేదాన్నట. కొంచెం తెలివి వచ్చాక ఏదైనా వస్తువులు కావాలంటే ఎక్స్‌ప్రెషన్స్‌తో చెప్పేదాన్ని. దీంతో అభిరుచి గల రంగంలోకి నన్ను పంపించాలనుకుంది మా అమ్మ. అలా అయిదో ఏటనే మా అమ్మ రాజమండ్రిలోని పి.లక్ష్మణరెడ్డి గారి దగ్గర నాట్య శిక్షణలో చేర్పించింది. బంధువులందరూ ‘స్టేజ్‌ ఎక్కి గంతులేస్తావా’ అంటూ వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో అమ్మ పట్టుదలతో నన్ను చెన్నైకు తీసుకెళ్లి నాట్యంలో శిక్షణ ఇప్పించింది.


ఆర్కే: మీ నాన్న మీకు సపోర్ట్‌ చేశారా?

శోభానాయుడు: మా నాన్న ఒక్కరే మా కుటుంబంలో చదువుకున్నారు. అప్పట్లో ఆయన ఇంజనీర్‌. నేను పుట్టినపుడు ‘అమ్మాయి పుట్టింది’ అంటూనే ఇంట్లో నాలుగుమెట్లు దిగిన మా నాన్న వెంటనే పైకెళ్లి పోయారట (నవ్వులు). నేను పుట్టిన తర్వాత కారు, ఆస్తులు.. అన్నీ కలిసొచ్చాయట. దీంతో అందరూ ‘అదృష్టదేవత’ అన్నారు. ఆ తర్వాత నన్ను మా నాన్న గారాబంగా పెంచారు. నా డ్యాన్స్‌ గురించి తొలిసారి పత్రికలో వచ్చినపుడు ‘పరువు పోయింద’ని బంధువులంతా అన్నారు. తొలిరోజుల్లో నేను డ్యాన్స్‌ చేయటం వాస్తవానికి నాన్నకు ఇష్టం లేదు. అలాంటి మా నాన్నే ఆ తర్వాత పత్రికల్లో నా గురించి వచ్చిన ఆర్టికల్స్‌ను కట్‌ చేసుకుని ఏకంగా ఆల్బమ్స్‌ తయారు చేశారు.ఆర్కే: మీ తండ్రి నుంచి వచ్చిన తొలి కాంప్లిమెంట్స్‌?

శోభానాయుడు: నన్ను డాక్టర్‌ని చేద్దామని మా నాన్న అనుకున్నారు. నా డ్యాన్స్‌ గురించి కాంప్లిమెంట్స్‌ ఇచ్చేవారు కాదు. మేం ఏలూరులో ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగింది. ఏలూరులోని మా గురువు గారు చెన్నైలో నన్ను అరంగేట్రం చేయిస్తానన్నారు. దానికి డబ్బంతా మా నాన్నగారే పెట్టుకున్నారు. విచిత్రమేంటంటే పెట్టాబేడా సర్దుకుని నేను రెడీగా వారికోసం ఎదురుచూశా. మా గురువుగారు చెన్నై వెళ్లిపోయారు. మూడురోజుల తర్వాత మా గురువుగారు మా ఇంటికి వచ్చి ‘మీ అమ్మాయి నాట్యానికి పనికిరాదు, ఆ ఫీచర్సే లేవు, అరంగేట్రం వేస్ట్‌’ అన్నారు. వెంటనే ‘సరే, ముందే చెప్పి ఉండాల్సింది’ అన్నారు. వారి మాటల్ని వంటింట్లో నుంచి విన్న నేను బాధపడ్డాను. రాజమండ్రిలోని మా గురువుగారు నన్ను పైస్థాయిలకు వెళ్తావన్నారు. ఈయనేంటి.. ఇలా అని ఏడ్చేశా. ఆ తర్వాత పట్టుదలతో మా నాన్నను ఒప్పించి అరంగేట్రం చేసి వస్తానని అమ్మతో కలిసి చెన్నైకు వెళ్లాం. అక్కడ మా తాతయ్య గారి కుటుంబం ఉండేది. ఏడాది పాటు గురువు వెంపటి చినసత్యం గారి దగ్గర నేర్చుకున్నా. అరంగేట్రం ఇచ్చినపుడు మీడియా నా గురించి మంచి కథనాలు రాసింది. వెంటనే పన్నెండు ప్రోగ్రామ్స్‌ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత విదేశాలకు వెళ్లాను. మాట ఇచ్చినట్లు అరంగేట్రం తర్వాత ఇంటికి వెళ్లాలి, కానీ ప్రోగ్రామ్స్‌తో బిజీ అయ్యాను. దాంతో నా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు.
ఆర్కే: నృత్యాన్ని ఆరాధించేవారు తక్కువవుతున్నారు కదా..

శోభానాయుడు: క్లాసికల్‌ డ్యాన్స్‌కు ఆదరణ లేదంటే ఒప్పుకోను. రవీంద్రభారతి లాంటి కళావేదికపై క్లాసికల్‌ డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ చేస్తుంటే తలుపుల దగ్గర నిల్చుని చూస్తున్నారు. క్లాసికల్‌ డ్యాన్సులు చూసేవారున్నారు కానీ చేసేవారే లేరు. సోలోగా ఇప్పటి తరం అరంగేట్రం చేయటానికి అవకాశాలు తక్కువ. ఒకప్పుడు హైదరాబాద్‌లో చాలా ఆర్గనైజేషన్స్‌ ఉండేవి ఇప్పుడు లేవు. ముఖ్యంగా స్పాన్సర్‌షి్‌పలు ఉండవు. అందుకే కష్టం. సినిమావారి షోలకు, మ్యూజిక్‌ షోలకు స్పాన్సర్‌షి్‌పలు సులువుగా దొరుకుతాయి. క్లాసికల్‌ డ్యాన్స్‌కు స్పాన్సర్‌షిప్స్‌ దొరక్కపోవటం దురదృష్టకరం.ఆర్కే: ట్రెండ్‌ మారింది. ఇపుడు యూతకు జోష్‌ కావాలి, క్లాసికల్‌ డ్యాన్సులోని ఎక్స్‌ప్రెషన్స్‌ అర్థం చేసుకుంటారా?

శోభానాయుడు: మీరు అలా అంటారు కానీ ఎలిమెంటరీ స్కూల్‌, హైస్కూల్‌, కాలేజీ పిల్లలు మొదట క్లాసికల్‌ డ్యాన్స్‌ అంటే గోల చేస్తారు. అయితే ఎక్స్‌ప్రెషన్స్‌ ఇలా అంటూ చెబితే చివరికి వారు లీనం అవుతున్నారు. సైలెన్స్‌గా చూస్తుండిపోతున్నారు. పూర్తి అయ్యాక మళ్లీ చేయండని గోల పెడతారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌సలోనూ చేశా. మంచి ఆదరణ వచ్చింది. అంటే వారిని ఎడ్యుకేట్‌ చేయగలిగితే క్లాసికల్‌ డ్యాన్స్‌ను చూడటానికి ఇష్టపడతారు. సామాన్యప్రజలూ కూచిపూడిని చూడటానికి ఇష్టపడతారు.ఆర్కే: సినిమాల్లో నటించమని మీపై ఒత్తిడి ఎక్కువ ఉండేదా?

శోభానాయుడు: బాప్‌రే. చాలామంది అడిగేవాళ్లు. ‘శంకరాభరణం’ నుంచీ ఆ ఒత్తిడి ఉంది. మొదట అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను సినిమాల్లోకి రమ్మన్నారు. అంజలీదేవి గారి కొడుకు పెళ్లికని ఆయన చెన్నైకి వచ్చారు. నేనేమో చిన్నప్పటి నుంచి అక్కినేని గారికి వీరాభిమానిని. ఆయన నా నాట్యం చూసి వెళ్లిపోయారు. మర్నాడు పొద్దున్నే అంజలీదేవి కారు మా ఇంటి ముందు ఆగింది. వారి ఇద్దరు కొడుకులు ఇంట్లోకి వచ్చి ‘అమ్మ రమ్మన్నారు’ అన్నారు. బట్టలు పెడతారేమో అని వెళ్లాను. లోపలికి వెళ్లగానే ‘చాలా బాగా నాట్యం చేశావు. అక్కినేని గారు సినిమా కోసం ఈ డబ్బులు ఇమ్మన్నారు’ అని చెప్పారామె. ‘సినిమాల కోసం ఇక్కడి రాలేదు’ అంటూ మొత్తం నా కథ చెప్పాను. ‘ఇంత చిన్నవయసులో మంచి నిర్ణయం తీసుకున్నావు’ అని అంజలిదేవి గారు మెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘శంకరాభరణం’ చిత్రానికి అవకాశం వచ్చింది. మా అమ్మనే వద్దంది. ఓసారి అకాడమీ నుంచి కాల్‌ వచ్చింది. ‘బి.ఎన్‌.రెడ్డి గారు..’ అంటూ మా గురువుగారు ఆయనను పరిచయం చేశారు. ‘‘సిరిసిరిమువ్వ’ను బాలీవుడ్‌లో తీయాలనుకుంటున్నాం. మీరే చేయాలి’’ అన్నారు. సున్నితంగా తిరస్కరించా. ‘‘నవ్వు సినిమాల్లోకి వెళ్తే నీ గ్లామర్‌కు తోడు మంచి పేరు, డబ్బు వస్తుంది. అప్పుడు నృత్య ప్రదర్శనలు చేయవచ్చు’’ అన్నారాయన. ‘నాకు గ్లామర్‌ మీద ఇష్టం లేదు. నా ప్రదర్శనలు ఇవ్వటానికి డబ్బుంటే చాలు’ అన్నాన్నేను. వెంటనే ఆయన ఖాళీ చెక్‌ ఇచ్చి ‘నీ ఇష్టం వచ్చినంత రాసుకో, నువ్వే సినిమా చేయాలి’ అన్నారు. ‘ఏమనుకోకండి’ అని ఆ చెక్‌ను కిందపెట్టి నమస్కారం పెట్టాను. ‘మీరు ఇక్కడికి వచ్చి అడగటం అదృష్టవంతురాలిని. అయితే నాకు కొన్ని ప్రిన్సిపుల్స్‌ ఉన్నాయి’ అన్నాను. వెంటనే ఆయన లేచి ‘నీకు కాదు నీ ప్రిన్సిపుల్స్‌కు’ అంటూ నమస్కారం పెట్టారు. బాపూ గారు ‘సీతాకళ్యాణం’ సినిమాలోని జయప్రద పోషించిన పాత్ర కోసం అడిగారు. అప్పుడు కూడా అదే పరిస్థితి. హైదరాబాద్‌ వచ్చాక నాచారం నుంచి ఎన్టీయార్‌ గారు కబురంపారు. నాచారానికి వెళ్లాను. శ్వేతవసా్త్రల్లో ఉన్న ఆయన ‘నాకు తెలుసు మీరు సినిమాల్లో చేయరు’ అని నన్ను చూస్తూనే చెప్పారు. ‘‘మహర్షి విశ్వామిత్ర’ చిత్రంలో తప్పకుండా మీరే చేయాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను’’ అన్నారు. వారి మర్యాదకు అవాక్కయ్యాను. అక్కినేనిగారు కూడా మర్యాదల్లో అంతే. ఇలాంటి మహానుభావులకి ‘నటించలేను’ అని చెప్పటం ఇబ్బందిగా ఉండేది.


ఆర్కే: మీరు కూచిపూడినే ఎందుకు ఎంచుకున్నారు?

శోభానాయుడు: అభినయమే నన్ను బాగా ఆకట్టుకుంది. నేను తొలిసారి చెన్నైకి వెళ్లినపుడు మొట్టమొదట ‘శ్రీకృష్ణ పారిజాతం’ ప్రోగ్రామ్‌ చూశాను. సత్యభామ పాత్ర చూస్తూ కుర్చీకి అంటుకుపోయాను. ‘తాతయ్యా.. జీవితంలో ఒక్కసారైనా సత్యభామ పాత్ర చేయాలని ఉంది’ అన్నాను.


అలా సత్యభామ పాత్ర మూడు దశాబ్దాలుగా నేను చేస్తున్నా. అదో అద్భుతమైన పాత్ర. అందరూ సత్యభామని గర్విష్టి అంటారు కానీ ఆమె అమాయకురాలు అనిపిస్తుంది. సత్యభామ పాత్రలో నవరసాలు ఉన్నాయి, నాట్యశాస్త్ర భంగిమలున్నాయి. అందుకే సత్యభామ పాత్రలో మెప్పిస్తేనే వారు కూచిపూడి నర్తకి కింద లెక్క.

 

ఆర్కే: మీ రెమ్యునరేషన్‌ ఆ రోజుల్లో ఎంత ఉండేది?

శోభానాయుడు: ఆ రోజుల్లో ఒక సోలో ప్రదర్శనకు పదివేలు, ఇరవై వేలు తీసుకునేదాన్ని. ఆ తర్వాత డ్రామాలు వచ్చాయి. గ్రూపుతో కలిసి చేసినపుడు యాభై వేలు తీసుకునేదాన్ని. టిటిడి లాంటి దేవస్థానాలు అయితే డెభ్బై ఐదువేల రూపాయలు ఇచ్చేవి.

 

ఆర్కే: అవి సరిపోయేవా?

శోభానాయుడు: ఏ మూలకూ సరిపోవు. ఈ కళలో డబ్బు రాదు. కేవలం ఆత్మతృప్తే ఉంటుంది. అందుకే ఇటు వచ్చే పిల్లలకు ‘మీకు డబ్బురాదు, గ్లామర్‌ రాదు’ అని చెబుతుంటాను. ‘నాట్యం కోసం అంకితం కావాలనుకుంటే ఇటురండి’ అంటున్నా. అలాంటపుడే వారు ఆత్మానందం పొందుతారు.

 

ఆర్కే: విదేశీ పర్యటనల్లో ఆసక్తికరమైన అనుభవాలేమైనా ఉన్నాయా..

శోభానాయుడు: ట్రినిడాడ్‌ పర్యటనకు వెళ్లినపుడు ప్రోగ్రామ్‌కి ఇద్దరు దంపతులొచ్చారు. ఆవిడకు ఇంగ్లిష్‌ రాదు. చేతులు పట్టుకుని కళ్లలోకి చూస్తూ ఉండిపోయింది. కళ్లతోనే తన ఆరాధన, ప్రేమనంతా వ్యక్తపరిచింది. అది నాకు తెలిసిపోతోంది. రెండురోజుల తరువాత మేం ప్రొగ్రామ్‌ పూర్తి చేసుకుని బయలు దేరే సమయంలో ఆవిడ భర ్త వచ్చాడు. ‘మీరొక సారి మా ఇంటికి రావాలి’ అని ఆహ్వానించాడు. లేదండీ మాకు ఫ్లయిట్‌కు టైం అవుతోంది వెళ్లిపోవాలన్నాను. ‘మాకు పాప పుట్టింది. మీ పేరే పెట్టుకున్నాం’ అని చెప్పాడు. డ్యాన్స్‌ చూసి అభిమానంతో ఆ పేరు పెట్టుకున్నారు. అది నన్ను ఎంతో కదిలించింది.

 

ఆర్కే: శోభగా ఉన్న మీకు నాయుడు ఎలా యాడ్‌ అయింది?

శోభానాయుడు: సునిల్‌ కొఠారి అనే క్రిటిక్‌ నా ప్రొగ్రామ్‌ చూసి మీ నాన్నగారి పేరేంటి అని అడిగాడు. వెంకన్ననాయుడు అని చెప్పాను. ఆయన నాయుడును నాకు తగిలించి శోభానాయుడు అని రాశాడు. అది అలా కంటిన్యూ అయింది.

 

ఆర్కే: మీకు అన్నదమ్ములున్నారా?

శోభానాయుడు: మేము మొత్తం ఆయిదుగురం. ఒక్క అక్క, ఇద్దరన్నయ్యలు, ఒక చెల్ల్లి.

 

ఆర్కే: షిరిడి సాయిబాబాపై కూచిపూడి చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?

శోభానాయుడు: రోజూ మెడిటేషన్‌ చేస్తాను. ఆ సమయంలోనే కొత్త ఆలోచనలు వస్తుంటాయి. సాయిబాబాపై ఎందుకు చేయకూడదనే ఆలోచన కూడా మెడిటేషన్‌ చేస్తుండగానే వచ్చింది. రెగ్యులర్‌గా రామకృష్ణమఠం వెళుతుంటాను. అక్కడి క్యాప్షన్స్‌ చదువుతున్నపుడు స్వామి వివేకానందపై ఎందుకు చేయకూడదనే ఆలోచన కూడా వచ్చింది.

 

ఆర్కే : మీ గురువు వెంపటి చినసత్యం గారితో ఏదైనా మరిచిపోలేని అనుభవం ఉందా?

శోభానాయుడు: మరచిపోలేని అనుభవం అంటే ‘చండాలిక’. నువ్వు ఈ పాత్రలో జీవించాలి, ఏ మాత్రం నచ్చకపోయినా తీసిపారేస్తా అన్నారు. గంటకు పైగా పాడుతూనే ఉన్నారు. నాకు మాత్రం ఏడుపు రాలేదు. దాంతో వెంటనే కర్ర కింద పడేసి ప్రోగ్రామ్‌ క్యాన్సిల్‌ చేయమని చెప్పారు. బయట వర్షం పడుతోంది. నాకు ఏడుపు ఎందుకు రాలేదని కూర్చున్నాను. ఆ బాధలో నుంచి ఏడుపొచ్చేసింది. ‘గురువుగారు ఇప్పుడు చేస్తాను’ అని చెప్పాను. ప్రోగ్రామ్‌ అయిపోయాక కూడా ఏడుపు ఆగలేదు. అదొక మంచి ఎక్స్‌పీరియన్స్‌.

 

ఆర్కే: గురువుగారు అభినందించిన సందర్భాలున్నాయా?

శోభానాయుడు: ఒకే ఒక్కసారి అభినందించారు. అమ్మవారు పోసి ప్రోగ్రామ్‌ చేయలేని సమయంలో, మేకప్‌ వేయడానికి మేక్‌పమెన్‌ భయపడిన సందర్భంలో నాకు నేనే మేకప్‌ వేసుకుని ప్రోగ్రామ్‌ పూర్తి చేశా. అప్పుడు గురువుగారు ఇప్పుడు ఆర్టిస్టువనిపించుకున్నావమ్మా అని అన్నారు. అంతే.. ఆ ఒక్కసారే!

 

ఆర్కే : మీరు ఎన్నో తిట్లను భరించి నేర్చుకున్నారు కదా. మీ శిష్యులను కూడా అలా తిడుతుంటారా?

శోభానాయుడు: అలా తిడితే వెళ్లిపోతారు. ఎందుకు లేట్‌గా వచ్చావంటేనే కళ్ల వెంబడి నీళ్లొచ్చేస్తున్నాయి. అంత సెన్సిటివ్‌గా ఉంటున్నారు. అడిగినా అనునయంగా అడగాలి.

 

ఆర్కే: కేవలం కూచిపూడినే నమ్ముకుని జీవించే పరిస్థితులున్నాయా?

శోభానాయుడు: లేవు. కూచిపూడిని నేర్చుకున్న వారికి ప్రత్యేకంగా మార్కులు కేటాయించడం వల్ల పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్కాలర్‌షి్‌పలు ఇవ్వడం చేయవచ్చు. ప్రతిభ ఉన్న వారిని గుర్తించాలి. ఇవన్నీ జరగడం లేదు.

 

ఆర్కే : మీ దృష్టిలో కళలకు స్వర్ణయుగం ఎప్పుడు?

శోభానాయుడు: సిద్దేంద్ర యోగి, వెంపటి చినసత్యం కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. మేము హైదరాబాద్‌కు వచ్చిన తరువాత పది, పదిహేనేళ్లు బాగానే ఉంది.

 

ఆర్కే : మీ జర్నీలో ఏదైనా వెలితి అనిపించిందా?

శోభానాయుడు: సంగీతం నేర్చుకోలేదనే వెలితి ఉండిపోయింది. ఒక డాక్యుమెంటరీ చేయించాలన్నది ఆలోచన. భవిష్యత్తు తరాల కోసం ఆడియో, వీడియో సీడీల లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయాలని ఉంది. ఇవే నా కోరికలు.

 

ఆర్కే : మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ షోకి వచ్చినందుకు ధన్యవాదాలు.

Updated Date - 2020-02-07T21:15:47+05:30 IST