కామసూత్ర చేయడమే నా తప్పు

ABN , First Publish Date - 2020-02-07T21:00:08+05:30 IST

పేరు ప్రతిష్ఠలతో పాటు వివాదాలను సమానస్థాయిలో సంపాదించిన నర్తకీమణి స్వాతి సోమనాథ్‌. ‘కామసూత్ర’ పేరు ఎంచుకోవడమే తన తప్పయినా, దాంతో ఎక్కడలేని సామాజిక భద్రత వచ్చిందని చెబుతున్నారు.

కామసూత్ర చేయడమే నా తప్పు

శృంగారం లేకుండా కళలే లేవు

డాన్సు స్కూలు పెట్టి సంపాదించే రకం కాదు

నృత్యాన్ని అభిరుచిలా తీసుకోండి.. ప్రొఫెషన్‌గా వద్దు

రాజకీయాలంటే ఇష్టం.. రాజ్యసభకు వెళ్తా

ఉత్తరాంధ్రలో సంగీత, నృత్య కళాశాల పెడతా

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో స్వాతీ సోమనాథ్‌.


పేరు ప్రతిష్ఠలతో పాటు వివాదాలను సమానస్థాయిలో సంపాదించిన నర్తకీమణి స్వాతి సోమనాథ్‌. ‘కామసూత్ర’ పేరు ఎంచుకోవడమే తన తప్పయినా, దాంతో ఎక్కడలేని సామాజిక భద్రత వచ్చిందని చెబుతున్నారు. ద్రౌపదిలో ఓ ఫెమినిస్టును ఆవిష్కరించిన స్వాతి.. శృంగారం లేని కళలే ఉండవంటున్నారు. స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉండటం వల్లే సినిమాల్లోకి వెళ్లలేదని.. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేనని, అయితే రాజ్యసభ సభ్యత్వం ఇస్తే తీసుకుంటానని చెబుతున్నారు. జీవితాన్ని రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా చూస్తానంటున్న స్వాతి సోమనాథ్‌తో 8-2-10న జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’.. వివరాలుస్వాతి అంటే మీపేరు. సోమ్‌నాథ్‌ ఎవరు?

నాన్నగారి పేరు. నేను బీహార్‌ చక్రధర్‌పూర్‌లో పుట్టా. కొన్నాళ్లు పశ్చిమబెంగాల్లో ఉన్నాం. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. స్వస్థలం శ్రీకాకుళం దూసి అగ్రహారం. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం.


క్లాసికల్‌ డాన్స్‌వైపు ఎలా ఆకర్షితులయ్యారు?

నాన్నగారికి సంగీతం, సాహిత్యం, జర్నలిజం అంటే ఇష్టం. ఆయన రైల్వేల్లో చేసేవారు. ఓసారి ఆయనతో వెళ్లి యామినీ కృష్ణమూర్తి నృత్యం చూశాను. నా అభిరుచిని తెలుసుకొని అమ్మా నాన్నలు సుమతీ కౌశల్‌ గారి దగ్గర చేర్చారు.


చిన్నవయసులోనే అవకాశాలు రావడంలో ఎవరి ప్రోత్సాహముంది?

నాకు అవకాశాలు ఊరికే రాలేదు. అందరూ అలా అనుకుంటారంతే. నేను చాలా సంప్రదాయవాదినే కానీ, ట్రెండుకి వ్యతిరేకంగా ఉండి, సొంత ట్రెండు ఏర్పరుచుకుంటా. జాతకరీత్యా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోవు.


కూచిపూడిలోకి కామసూత్రాలు తేవడాన్ని ఎవరైనా ఊహించగలరా?

కచ్చితంగా ఎవరూ ఊహించలేరు. నేను కూడా సంప్రదాయానికి భిన్నంగా వెళ్లలేదు. సంప్రదాయంలో ఉండే ‘కామసూత్ర’ చేశా. ఆ భంగిమలు కూచిపూడిలోనే కాదు.. అన్ని నృత్యరీతుల్లోనూ ఉన్నాయి. శృంగారం చూపించకుండా ఏ కళా లేదు. అయితే నా టైటిల్‌ వల్లే సమస్య వచ్చింది. కామసూత్రను ఎంచుకోవడమే నేను చేసిన తప్పు. కామసూత్ర పెద్ద సాహసం.


వివాదాస్పదం కావాలనే మీరలా చేశారన్న విమర్శలొచ్చాయి..

విమర్శలున్నాయి. అప్పటికే నాకు చాలా పేరొచ్చింది. దాంతో డైనమిక్‌ లేడీ అన్న పేరొచ్చింది. ముందు విమర్శించినవాళ్లే తర్వాత పొగిడారు కూడా. అది చెడెలా అవుతుంది? కామసూత్ర అనగానే బూతు అనే అపోహను రచయితలే సృష్టించారు. అశ్లీలం అన్న అపోహను దూరం చేసి, తల్లిదండ్రులతో కలిసి పిల్లలు కూర్చుని చదవగలిగేలా, చూడగలిగేలా చేసినందుకు గర్వంగా ఉంది. ఇది చేసిన తర్వాత నేనంటే జనంలో భయం పెరిగింది. కామసూత్ర ఒకరకంగా నాకు భద్రత కల్పించింది. రొటీన్‌గా వెళ్లకుండా డిఫరెంట్‌గా ఉండాలనిపిస్తుంది. అలాగని అన్నింట్లో కాదు..


ప్రణయ రసంపై ఎందుకంత ఆసక్తి? 

శృంగారరసం లేని సాహిత్యమే లేదు. దాన్ని పక్కన పెట్టి మనమేమీ చేయలేం. ‘సర్వజ్ఞశంకర’లో సరస్వతీదేవి వచ్చి ఆది శంకరాచార్యులను కామశాస్త్రం గురించి అడిగితే ఆయన ఆగిపోతారు. బదులేమీ చెప్పలేక పరకాయ ప్రవేశం చేసి, ఎంజాయ్‌ చేసి మళ్లీ వచ్చి సమాధానం చెబుతారు. కాబట్టి కామం, శృంగారం లేని కళ లేదు.


ఇపుడు ద్రౌపదినీ చాలా రాడికల్‌గా చేస్తున్నారు. ఎందుకు?

కామసూత్ర తర్వాత ఏ సబ్జెక్ట్‌ తీసుకోవాలో తెలియలేదు. అంచనాలు పెరుగుతాయి. చాలా ఏళ్లుగా ద్రౌపది క్యారక్టర్‌పై ఆసక్తి ఉంది. వేరేకోణంలో తీసుకున్నాను. అందరూ స్వయంవరం వరకు తెచ్చి ఆపేస్తారు. నిజానికి ఆ తర్వాతే ఆమె హీరోయిన్‌ అవుతారు. అక్కడినుంచి ఆమె మహాప్రస్థానం వరకు క్యారెక్టర్‌ ఎక్కడా చూడం. ఎన్ని అవమానాలు ఎదురైనా గట్టిగా నిలిచింది. ఆమె పట్టుదల, పోరాటం.. సమస్యలను ఎదుర్కొనే తత్వాలను తీసుకున్నా.


మీ డ్యాన్స్‌స్కూల్లో అడ్మిషన్లు డబ్బున్నవారికే సాధ్యమంటారు?

నా స్కూల్లో అలాంటివి లేవు. నేనెవరితోనూ అరంగేట్రం చేయించలేదు. డాన్స్‌ను ప్రొఫెషన్‌గా కాకుండా హాబీగానే చూడాలని చెబుతాను. ప్రొఫెషనల్‌ డాన్సర్‌ కావాలంటే.. చేతినిండా డబ్బయినా ఉండాలి.. లేదంటే రాజకీయ అండదండలైనా ఉండాలి. ఇవి లేకుండా సంప్రదాయ నృత్యాన్ని వృత్తిగా తీసుకోవడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు.


అదేమిటి?

ఇప్పుడు నేతలు, పారిశ్రామికవేత్తల కూతుళ్లు, కోడళ్లే డాన్సర్లు. దానివల్ల నిజమైన ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతుంది. కనీసం పదేళ్లయినా నేర్చుకోనిదే నృత్యం రాదు. ఇప్పుడు అంత సమయం వెచ్చించేవారు లేరు. వారం రోజుల కోచింగ్‌.. అక్కడ నుంచి ఓ టీవీ ప్రోగ్రాం.. తరువాత రవీంద్ర భారతి.. విదేశాల్లో ప్రోగ్రాంలు.. ఫైనల్‌గా పెళ్లి. వారి ఆశయం పూర్తయిపోతోంది. ఇది బాధాకరం.


మీరు క్లాసికల్‌ డాన్సర్‌గా బాగా సంపాదించగలిగారా?

నా పెర్ఫార్మెన్స్‌ ద్వారా ఎక్కువ సంపాదించాను. స్కూల్‌ మీద సంపాదన లేదు. అలా స్కూళ్లు పెట్టి సంపాదించేవారు వేరే ఉన్నారు.


సినిమాల్లోకి ఎందుకు వెళ్లలేదు?

ఆఫర్లు చాలా వచ్చాయి. కానీ.. ఆసక్తి లేదు. నాకు ఇండివిడ్యువాలిటీ ఎక్కువ. ఇంతకుముందు ఒక సీరియల్‌లో చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ.. సినీ దర్శకుడినే పెళ్లి చేసుకున్నాను. ఆయన చావలి రవికుమార్‌ (సామాన్యుడు, విక్టరీ చిత్రాల దర్శకుడు). అంతగా ప్రోత్సహించే వ్యక్తిని భర్తగా పొందడం నా అదృష్టం. పెళ్లి తరువాత స్వాతీ రవికుమార్‌గా పేరు మార్చుకుంటానంటే.. అందరికీ తెలిసిన స్వాతీ సోమనాథ్‌గానే కంటిన్యూ చేయమన్నారు.


తరువాత రాజకీయాలేనా?

రాజకీయాలంటే ఇష్టం. ఎవరు అధికారంలోకి వస్తారనే విషయాన్ని కూడా నేను కచ్చితంగా అంచనావేస్తా. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం రాలేను. అవసరమైతే.. ఉన్న పార్టీనే విమర్శించే గుణం ఉన్న నాలాంటివారికి రాజకీయాలు అంతగా నప్పవు. (ఆర్కే: అయితే.. మీరు కాంగ్రెస్‌ పార్టీలో చేరొచ్చుగా? ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ) నాకు రాజకీయాలంటే ఇష్టం.. కానీ.. చేయడం రాదు. రాజ్యసభ పదవి ఇస్తే కాదనను.


మీ జీవితంలో మర్చిపోలేని అనుభూతి?

మా నాన్నగారు శ్రీకాకుళం దూసి అగ్రహారం నుంచి వచ్చారు. తాతగారి హయాంలో ఎంతో గొప్పగా బతికి.. తర్వాత వారాలు చేసుకునే స్థితికి వచ్చాం. మేం పోగొట్టుకున్న దానిలో రెండెకరాలు ఇటీవలే మళ్లీ నేను కొనుక్కోగలిగాను. నేను తిరుగాడిన భూమిని మళ్లీ సొంతం చేసుకోవడం నాకెంతో గర్వకారణం.


మీ జీవితాశయం?

త్వరలో రిటైరైపోయి.. శ్రీకాకుళం చెక్కేస్తా. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన తూర్పు భాగవతం రాసింది మా తాతగారు. ఆ గడ్డపైనే ఓ సంగీత, నృత్య కళాశాల ప్రారంభించాలన్నదే జీవితాశయం.

 

రిటైర్‌మెంట్‌ ఇంత త్వరగానా?

వేదికపైనే నాట్యం చేస్తూనే చనిపోతాం..అని చాలామంది పెద్దమాటలు చెప్తుంటారు. అది తప్పు. భావితరాలకు అవకాశం ఇవ్వడం మంచిది. శరీరం సహకరించకున్నా ఏదో ప్రయత్నం చేసి ప్రేక్షకులతో తిట్టించుకోవద్దు.

Updated Date - 2020-02-07T21:00:08+05:30 IST