సీనియర్ ఎన్టీఆర్‌కు నాపై మంచి అభిమానం ఉండేది

ABN , First Publish Date - 2020-02-07T21:57:31+05:30 IST

నాలుగేళ్ల వయసులో మృదంగంతో ఏర్పడిన స్నేహాన్ని డెబ్బయ్‌ ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.. పద్మశ్రీ యల్లా వెంకటేశ్వరరావు. ప్రపంచవ్యాప్తంగా వేలాది కచేరీలు నిర్వహించి అంతర్జాతీయ స్థాయి కళాకారుడని అనిపించుకున్నారు.

సీనియర్ ఎన్టీఆర్‌కు నాపై మంచి అభిమానం ఉండేది

నందమూరి ఇంట పెళ్లిళ్లలో నా కార్యక్రమం తప్పనిసరి

మృదంగం లేకపోతే యల్లా వెంకటేశ్వరరావు లేడు

రెండు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించా.. సరిపడక వద్దనుకున్నా

డామినేట్‌ చేస్తున్నానని కార్యక్రమాలకు కూడా పిలిచే వారు కాదు

నా కన్నా ప్రతిభ తక్కువ ఉన్నవారికి ఎన్నో పురస్కారాలు

పధ్నాలుగేళ్లు ఉన్నప్పుడు ఒక జాతీయ పురస్కారం వచ్చింది

చిన్న వయసులో ఆకాశవాణిలో చేరిన స్టాఫ్‌ ఆర్టిస్ట్‌ని నేనే

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మృదంగ కళాకారుడు యల్లా వెంకటేశ్వరరావు


నాలుగేళ్ల వయసులో మృదంగంతో ఏర్పడిన స్నేహాన్ని డెబ్బయ్‌ ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.. పద్మశ్రీ యల్లా వెంకటేశ్వరరావు. ప్రపంచవ్యాప్తంగా వేలాది కచేరీలు నిర్వహించి అంతర్జాతీయ స్థాయి కళాకారుడని అనిపించుకున్నారు. మృదంగంతో సాగిన తన జీవిత ప్రయాణ విశేషాలను 27-8-2017న ఓపెన్‌హార్ట్‌ విత ఆర్కే కార్యక్రమంలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎం.డీ వేమూరి రాధాకృష్ణతో ఆయన ఇలా పంచుకున్నారు.

 

ఆర్కే: మీరు మృదంగ విద్యాంసులే కాకుండా మంచి గాయకులని కూడా విన్నాం. ఈ కార్యక్రమాన్ని ఒక గీతంతో మొదలుపెట్టండి.

యల్లా వెంకటేశ్వరరావు: వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ పాడతాను. ‘‘మహా గణపతిం మనసా స్మరామి.. మహా గణపతిం మనసా స్మరామి...’’

 

ఆర్కే: మీ వల్ల మృదంగానికి పేరొచ్చిందా? మృదంగం వల్ల మీకు పేరొచ్చిందా?

యల్లా వెంకటేశ్వరరావు: మృదంగం వల్లే నాకు పేరొచ్చింది. మృదంగం లేకపోతే యల్లా వెంకటేశ్వరరావు లేడు. చిన్నప్పటి నుంచి నాకు మృదంగాన్ని ప్రథమ స్థానానికి తీసుకెళ్లాలని ఉండేది. అప్పట్లో మృదంగం పక్క వాద్యంగా ఉండేది. దాన్ని ప్రధాన వాద్యంగా మార్చాలన్న ఆవేశం ఉండేది.

 

ఆర్కే: ఆ ఆలోచన ఎందుకొచ్చింది?

యల్లా వెంకటేశ్వరరావు: అప్పటి సామాజిక పరిస్థితులు. అప్పట్లో కళాకారులు చాలా పేదరికంలో ఉండేవారు. ప్రధాన వాద్యకారునికి ఉండే గౌరవం మిగతా వారికి ఉండేది కాదు. చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండేవి. ప్రధాన గాయకునికి ఎంత జ్ఞానం ఉందో వాద్యకారులందరికీ అంత జ్ఞానం ఉంటే తప్ప అందుకోలేరు. పక్క వాయిద్యం సరిగ్గా లేకపోతే మొత్తం పోతుంది. అందుకే వాళ్ల చాలా తపన పడతారు. వాద్యం వాయించే వ్యక్తికి విరామం ఇస్తుంటారు. దాంతో ప్రోగ్రామ్‌ అయిపోందనుకుని ప్రేక్షకులు లేచి వెళ్లిపోయే వారు. ఇలాంటివి చూశాక మృదంగాన్ని ప్రధాన వాద్యంగా తీసుకురావాలని నిర్ణయించుకున్నా. అలాంటి సందర్భాలు చాలా చూశాను.

 

ఆర్కే: మీకు కూడా అలాంటి సందర్భాలు ఎదురయ్యాయా?

యల్లా వెంకటేశ్వరరావు: ఎదుర్కొన్నాను! కానీ, అంతగా కాదు. ప్రధాన గాయకుడు ఫస్ట్‌క్లాస్‌లో వెళితే నేను కూడా ఫస్ట్‌క్లాస్‌లో వెళ్లేవాణ్ణి. ‘మృదంగం ఏం తక్కువ!’ అనుకునేవాణ్ణి. డామినేట్‌ చేస్తున్నానని కార్యక్రమాలకు కూడా పిలిచే వారు కాదు.

 

ఆర్కే: మీరు మిగతా వాళ్లందరినీ డామినేట్‌ చేస్తుంటారని అంటారు, నిజమేనా?

యల్లా వెంకటేశ్వరరావు: అనుకుంటున్నారు వాళ్లు. నేను నా ప్రతిభ చూపించుకోవాలి కదా! స్టేజ్‌ పైన యల్లా వెంకటేశ్వరరావు ఉన్నాడంటే ఒక ప్రత్యేకత ఉంటుందని జనం అనుకొంటారు. మనల్ని చూసి వచ్చే జనం కూడా ఉంటారు. ప్రతి మనిషికీ కొంతమంది ఆడియన్స్‌ ఉంటారు. అప్పుడు మన ప్రదర్శన సరిగ్గా లేకపోతే ‘ఏంటీ డౌన్‌ అయిపోయాడాయన’ అంటారు. అందుకే స్టేజ్‌పై విజృంభిస్తూనే ఉంటాను. అందుకే సోలో ఉంటే తప్ప పిలవడం లేదు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి, టి.ఎల్‌ వసంతకుమారి, ఓలేటి వెంకటేశ్వర్లు, రాధాజయలక్ష్మి, టిఎన్‌ కృష్ణన్‌, ద్వారం వెంకటస్వామినాయుడుగారు, మైసూరు చోడయ్య.... ఇలాంటి వారందరితోనూ, మూడు తరాల వారితో వాయించాను. దాదాపు 70 దేశాల్లో మృదంగం కచ్చేరీలు చేశాను.

 

ఆర్కే: ఇంతమందిలో కలిసి చేశారుకదా! ఎవరితో మీకు చాలా టఫ్‌గా అనిపించింది?

యల్లా వెంకటేశ్వరరావు: అల్లారఖా, కృష్ణమహరాజ్‌, జాకీర్‌హుస్సేన్‌... వీరితో చాలా టఫ్‌. అయితే రోమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జాకీర్‌హుస్సేన్‌ను సెకండ్‌ రౌండ్‌లో దాటాను! చివరి వరకు నేనే! అప్పటి నుంచీ మళ్లీ కలిసి చేయలేదు.

 

ఆర్కే: మృదంగంతో చాలా ప్రయోగాలు చేశారు కదా! ఏకబిగిన 36 గంటలు మృదంగం వాయించి రికార్డుల్లోకెక్కారు కదా! ఎలా సాధ్యమయింది?

యల్లా వెంకటేశ్వరరావు: సాధన చేశాను. రోజూ పదిగంటలు సాధన చేసేవాణ్ణి. ఒక్కోరోజు నిద్రాహారాలు మాని తపస్సులా చేసేవాణ్ణి. నాకున్నది ఒక్కటే తపన. మృదంగాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలి. ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఒక గదిలో కూర్చుని సాధన చేసే వాణ్ణి. అప్పట్లో కరెంటు ఉండేది కాదు. చమటలు కారిపోతుండేవి. సమయం మీద ధ్యాస ఉండేది కాదు. కొత్త ప్రయోగాలు చేసేవాణ్ణి. ఆ రోజు బాలమురళీకృష్ణగారొచ్చి గణపతి ప్రార్థనతో మొదలుపెట్టారు. ఉద్దండులైన మహానుభావులు వచ్చి పాల్గొన్నారు. దానివల్ల అది ఒక రికార్డు అయింది. రికార్డు కోసం చేసింది కాదు. 24 గంటలు అనుకుని మొదలుపెట్టాను. కానీ, 36 గంటలకు వెళ్లిపోయింది.

 

ఆర్కే: ఏకధాటిగా మృదంగం వాయిస్తుంటే ఆయాసం కలగదా?

యల్లా వెంకటేశ్వరరావు: వస్తుంది! తట్టుకోవాలి. ఏ మాత్రం ఆయాసపడినా తాళం తప్పుతుంది. శృతి పోతుంది. ఈ రెండూ పరిరక్షించుకుంటూ విన్యాసాలు చేయాలి. మొత్తంగా చూస్తే 29 వేల పైచిలుకు కార్యక్రమాలు నిర్వహించాను.

 

ఆర్కే: ఇన్ని ప్రదర్శనలు ఇచ్చారు కదా! ఎక్కడైనా అపశ్రుతి చోటుచేసుకుందా?

యల్లా వెంకటేశ్వరరావు: దేవుడి దయ వల్ల ఎన్నడూ చోటుచేసుకోలేదు. ఉద్దండ పిండాల దగ్గర కూడా పోటాపోటీగా వాయించాను. అందరూ భేష్‌ అన్నవాళ్లే!

 

ఆర్కే: మీ ప్రతిభను నిలబెట్టేవాళ్లు మీ కుటుంబం నుంచి ఎవరైనా ఉన్నారా?

యల్లా వెంకటేశ్వరరావు: ఉన్నారు. అయితే, వాళ్ల చదువుకు ఇబ్బంది కలుగుతోంది. చిన్నప్పటి నుంచి నేను ఐఏఎస్‌ అవ్వాలనుకున్నాను. కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి వల్ల సాధ్యం కాలేదు. మృదంగ సాధనకే నా జీవితం అంకితమైంది. నాలుగేళ్ల వయసులో మృదంగం వాయించడం మొదలుపెట్టాను. ఏడేళ్ల వయసు నుంచి కచ్చేరీలు చేస్తున్నాను. మృదంగంతో నాది ఇంచు మించు డెబ్భయ్‌ ఏళ్ల ప్రయాణం.

 

ఆర్కే: ఒకే వాద్యంతో ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడా విసుగు రాలేదా? పడిన శ్రమకు ఫలితం రాలేదన్న భావన కలుగలేదా?

యల్లా వెంకటేశ్వరరావు: అసంతృప్తి ఉంది. తమిళనాడులో, ఉత్తర భారతంలో.. నా కన్నా ప్రతిభ తక్కువ ఉన్నవారికి ఎన్నో పురస్కారాలు రావడం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. ఆర్థికంగా మాత్రం బాగానే ఉంది.

 

ఆర్కే: ఆకాశవాణి మీకు వేదిక అనుకోవచ్చా?

యల్లా వెంకటేశ్వరరావు: ఆకాశవాణి నాకు మాతృ సంస్థ. పదహారేళ్లప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే పదహారేళ్లకు ఇవ్వకూడదు. పధ్నాలుగేళ్లు ఉన్నప్పుడు ఒక జాతీయ పురస్కారం వచ్చింది. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా దానిని తీసుకున్నాను. అప్పటి కేంద్రమంత్రి బెజవాడ గోపాలరెడ్డిగారు సిఫారసు చేశారు. అలా ఆకాశవాణిలో అవకాశం వచ్చింది. అతి చిన్న వయసులో ఆకాశవాణిలో చేరిన స్టాఫ్‌ ఆర్టిస్ట్‌ని నేనే! కాంట్రాక్టు పద్ధతిలో 100 రూపాయలు వచ్చేవి. పర్మినెంట్‌ అయ్యాక రూ.150 అయ్యింది. కుటుంబ అవసరాలకు సరిపోయేవి కావు. కార్యక్రమాలు చేస్తూ నెట్టుకొచ్చేవాణ్ణి.

 

ఆర్కే: బయట కచ్చేరీలు చేస్తుంటే.. అధికారులు ఏమనేవారు?

యల్లా వెంకటేశ్వరరావు: అధికారుల్లో కొందరు పరమ దుర్మార్గులు ఉండేవాళ్లు. బయటకు వెళ్లనిచ్చే వాళ్లు కాదు. వాళ్లను ఎలాగో ప్రసన్నం చేసుకొని వెళ్లేవాణ్ణి.

 

ఆర్కే: కచ్చేరీలకు ఇదివరకటిలా జనం వస్తున్నారా?

యల్లా వెంకటేశ్వరరావు: నా కార్యక్రమం వరకైతే విశేషంగానే వస్తున్నారు.

 

ఆర్కే: విదేశాల్లో కచేరీలకు మనవాళ్లు ఎక్కువగా వస్తారా.. విదేశీయులా?

యల్లా వెంకటేశ్వరరావు: వాళ్లే ఎక్కువగా వస్తుంటారు. మనవాళ్లు వచ్చినా.. అందులో తెలుగు వాళ్లు తక్కువ. కన్నడిగులు, తమిళులు, ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్లు.. ఎక్కువగా ఉంటారు. మన తెలుగు వాళ్లకు సినిమా పాటలు కావాలి. కానీ, విదేశీయులు ఎంతో గౌరవిస్తారు, ఆదరిస్తారు.


ఆర్కే: మీ స్కూల్‌లో విదేశీయులు ఉన్నారా?

యల్లా వెంకటేశ్వరరావు: ఉన్నారు. పారిస్‌, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా ఇలా పలు దేశాలకు చెందిన విద్యార్థులు చాలామంది ఉన్నారు.


ఆర్కే: స్కూలు బాగానే నడుస్తోందా?

యల్లా వెంకటేశ్వరరావు: ఇప్పుడు నేనే తగ్గించాను. ఓపిక లేదు. శిష్యుల దగ్గర నయాపైసా తీసుకోను. నేను ఎలా నేర్చుకున్నానో.. వాళ్లకూ అలాగే నేర్పాను. నా శిష్యులు మంచి విద్వాంసులుగా తయారయ్యారు. నన్ను మించిన వాళ్లూ ఉన్నారు. రెండువేల మంది శిష్యుల్లో ఓ పది మంది అంతర్జాతీయ స్థాయు కళాకారులుగా తయారయ్యారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది!

 

ఆర్కే: ఈ మధ్య కాలంలో రోగాలు నయం చేయడానికి మ్యూజిక్‌ థెరపీ అని మొదలుపెట్టారు. సంగీతానికి అన్ని జబ్బులూ నయమవుతాయంటారా?

యల్లా వెంకటేశ్వరరావు: నేను కూడా మ్యూజిక్‌ థెరపీ చేశాను. అయితే, అన్ని జబ్బులూ నయం కావు. మానసిక ఒత్తిడి తగ్గించవచ్చు. మానసిక ప్రశాంతత వస్తే.. సగం రోగాలు నయం అయినట్టే!

 

ఆర్కే: కాలానుగుణంగా సంగీత కళాకారుల ఆహార్యంలో మార్పు రాకపోవడానికి కారణమేమంటారు?

యల్లా వెంకటేశ్వరరావు: పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలని ఒకటి! కొన్ని సెంటిమెంట్‌గా ధరించేవీ ఉంటాయి. కచ్చేరీల్లో విశేషంగా కనిపించడానికి ప్రత్యేకమైన ఆహార్యం అనుసరిస్తూ ఉంటాం.

 

ఆర్కే: మీ భవిష్యత ప్రణాళికలు ఏమిటి?

యల్లా వెంకటేశ్వరరావు: విశ్వవిద్యాలయం ప్రారంభించాలని ఉంది. దానికి సంబంధించిన ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) అందజేశాను. దిల్లీలో కూడా చెప్పాను. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు గానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు గానీ సహకరిస్తే.. వాళ్లు సహకరిస్తామన్నారు. ప్రాజెక్ట్‌ అయితే సిద్ధంగా ఉంది.

 

ఆర్కే: ఇంత చేసినా జీవనభృతి రావట్లేదు!

యల్లా వెంకటేశ్వరరావు: తెలుగు విశ్వవిద్యాలయంలోకి డిప్యుటేషన్‌ మీద వెళ్లే నాటికే ఆకాశవాణిలో ఎన్నో ఏళ్లు పని చేశాను. రెండేళ్ల డిప్టేషన్‌ తర్వాత అధికారులు ఒత్తిడి చేయడంతో, 29 ఏళ్ల సర్వీసు తర్వాత.. ఆకాశవాణికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత తెలుగు యూనివర్సిటీలో 16 ఏళ్లు పని చేశాను. ఇప్పుడు నాకు జీవన భృతి (పెన్షన్‌) కూడా రావడం లేదు. ఆకాశవాణి వాళ్లూ పట్టించుకోవడం లేదు! తెలుగు యూనివర్సిటీ నుంచి కూడా స్పందన లేదు. పెన్షన్‌ గురించి తిరగని ఆఫీసు లేదు. అయినా పని కాలేదు. 12 ఏళ్లుగా పోరాడుతున్నా.. ఫలితం లేదు. ఇన్ని సంవత్సరాలు సర్వీసు చేశాను. ఆయా సంస్థలకు నా వల్ల ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అవార్డులు వచ్చాయి. అయినా, ఈ పరిస్థితి తప్పలేదు.

 

**********************************************

తబలా వాయిద్యకారులతో కలిసి జుగల్‌బందీ చేశాను. కానీ, వాళ్లను డామినేట్‌ చేయకూడదు. డామినేట్‌ చేస్తే వాళ్లకు నచ్చదు. అవకాశం వచ్చినపుడు మనకు ఉన్న సంగీతజ్ఞానం చూపించుకోకపోతే ఎలా?

 

తంజావూరు, కేరళలో మృదంగ వాదన కళకు చాలా ఆదరణ ఉంది. వేల మంది ఉన్నా తగిన రీతిలో కార్యక్రమాలు జరుగుతుంటాయి. మృదంగం తయారీదారులు అక్కడ ఎక్కువ.

 

వర్షాలు కురవాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారితో ఒక కార్యక్రమం నిర్వహించాను. చెన్నైలో చేశాను. బ్రహ్మాండంగా వర్షాలు కురిశాయి.

 

మా అబ్బాయి పేరు బాలమురళీకృష్ణ - బాగా పాడతాడు. రకరకాల సంగీత వాద్యాలు కూడా వాయిస్తారు. మా అమ్మాయి మంచి చిత్రకారిణి. యోగా గురువు కూడా! ఇంకొక అమ్మాయి కూచిపూడి నృత్య కళాకారిణి. వారి పిల్లలు కూడా సంగీత సాధనలో ఉన్నారు. భగవంతుడి దయ వల్ల అందరూ ఉన్నతస్థితిలోనే ఉన్నారు.

 

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా సేవలందించాను. ఎక్స్‌పర్ట్‌ మెంబర్‌గా ఎన్నో సంస్కరణల్లో భాగమయ్యాను. అయితే, అధికారులను బట్టే అన్నీ జరుగుతుంటాయి. వారి వల్లే కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి. చెడూ జరుగుతోంది. ఆస్థాన విద్వాంసుడిని గౌరవప్రదంగా నియమించారు. అయితే ఆస్థాన విద్వాంసులను గుర్తుపెట్టుకోవాలనే భావన చాలామంది అధికారుల్లో ఉండటం లేదు.

రెండు మూడు సినిమాలకు పని చేశాను. దర్శకుడు కె.విశ్వనాథ్‌ గారు మొదటి అవకాశం ఇచ్చారు. సప్తపది సినిమా కోసం. కానీ, సినిమాల్లో సరిపడక వద్దనుకున్నాను.

 

 ఎన్‌.టి.రామారావు గారికి నాపై మంచి అభిమానం ఉండేది. వారింట పెళ్లిళ్లలో నా కార్యక్రమం తప్పనిసరి. తెలుగు విశ్వవిద్యాలయం పెడుతున్నారని అన్నారు. నేను వారి దగ్గరికి వెళ్లి.. సంగీత కళలకు కూడా అవకాశం కల్పించమని చెప్పాను. నాతో పాటు పలువురు ప్రముఖులతో కమిటీ వేసి ప్రణాళిక రూపొందించమన్నారు. అలాగే చేశాం. ‘వాద్య సహకారం’ విభాగం కూడా సూచించాను. దానిని నన్నే చూసుకోమన్నారు. ఆకాశవాణిలో ఉన్నానని చెప్పాను. డిప్యుటేషన్‌ మీద రమ్మంటే వెళ్లాను. చాలా కష్టపడి పని చేశాను. మృదంగం, నాదస్వరం, డోలు, థియేటర్‌ ఆర్ట్స్‌ - ఇలా ఎన్నో విభాగాలు ప్రవేశపెట్టాం.

Updated Date - 2020-02-07T21:57:31+05:30 IST