ఇండస్ర్టీలో ‘క్యాంపెయిన్‌’ సంస్కృతితో నష్టపోయా..

ABN , First Publish Date - 2020-05-15T23:24:51+05:30 IST

‘‘బాగా పాడగలను.. నటించగలను.. డాన్స్‌ కూడా చేయగలను. కానీ, అవకాశాలే లేవు’’ అని ‘ఇండియన్‌ ఐడల్‌’ ఫేం శ్రీరామచంద్ర తెలిపారు. కష్టమైన పనిని విభిన్నంగా చేసి మెప్పించడమే లక్ష్యమంటున్న శ్రీరాం,

ఇండస్ర్టీలో ‘క్యాంపెయిన్‌’ సంస్కృతితో నష్టపోయా..

ఐడల్‌... పేరు మాత్రమే తెచ్చింది
ముందునుంచీ టాలీవుడ్‌తో టచ్‌లో ఉన్నా
అయినా చెప్పుకోదగ్గ పాటలు లేవు
ధ్యాసంతా బాలీవుడ్‌ పైనే.. హాలీవుడ్‌లోనూ అడుగిడా
అయినా రేపు ఏమిటనేది తెలీదు
‘ఇండియన్‌ ఐడల్‌’ ఫేం శ్రీరాంతో ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే

‘‘బాగా పాడగలను.. నటించగలను.. డాన్స్‌ కూడా చేయగలను. కానీ, అవకాశాలే లేవు’’ అని ‘ఇండియన్‌ ఐడల్‌’ ఫేం శ్రీరామచంద్ర తెలిపారు. కష్టమైన పనిని విభిన్నంగా చేసి మెప్పించడమే లక్ష్యమంటున్న శ్రీరాం, ఇప్పుడిలా చౌరస్తాలో ఎందుకు నిలబడ్డారనే దానిపై ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో 18-06-2012న జరిగిన ’ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో గొంతు విప్పారు.

ఆర్కే: శంకర్‌ మహాదేవన్‌ను ఎలా మెప్పించారు?
శ్రీరాం: ఊపిరి తియ్యకుండా ఆయన పాడిన ‘కోయి జో మిలాతో..’ పాటను ఇండియన్‌ ఐడల్‌ షోలో ఆయనతో కలిసి పాడాను. అది ఆయనకు నచ్చి చాలా మెచ్చుకున్నారు.

ఆర్కే: ఇండియన్‌ ఐడల్‌ అవుతానని ఊహించారా?
శ్రీరాం: ఊహించలేదు. ఒక స్థాయికి చేరాలంటే ఏం చేయాలనేది నాకు తెలియదు. ఐడల్‌ అవకాశం రావడం గాయకుడిగా గుర్తింపును తెచ్చింది.

ఆర్కే: అయినా.. ఎందుకు అవకాశాలు రావడం లేదు.?
శ్రీరాం: ఐడల్‌ కావడానికి ఏడేళ్ల ముందు నుంచే తెలుగు సినీ పరిశ్రమలో పనిచేశాను. దాదాపు అందరు సంగీత దర్శకుల వద్ద పాడాను. కానీ, నాపేరు ఎక్కడా బయటకు రాలేదు. ఐడల్‌ అయిన తర్వాత కూడా మార్పేమీ లేదు. కీరవాణి లాంటి వారితో సంబంధాలున్నాయి. అందరికి అందుబాటులోనే ఉన్నాను. అయినా, ఎందుకు అనుకున్నన్ని అవకాశాలు రావడం లేదో తెలియడంలేదు. ఇండస్ర్టీలో ‘క్యాంపెయిన్‌’ సంస్కృతి కారణం కావొచ్చు. గాడ్‌ ఫాదర్‌ లేకపోవడం వల్ల కూడా కావచ్చు. ఇక్కడితో పోల్చుకుంటే బాలీవుడ్‌లోనే నాకు కాస్త గౌరవం ఉందనిపిస్తుంది. చిన్ననాటి నుంచే బాలీవుడ్‌ ఇష్టం. బాలీవుడ్‌కు, అక్కడి నుంచి హాలీవుడ్‌కు ఎదగాలనేదే నా ప్రయత్నం.

ఆర్కే: సోనీ టీవీ కాంట్రాక్టు మీ అవకాశాలను దెబ్బతీస్తోందా?
శ్రీరాం: ఇండియన్‌ ఐడల్‌లో టాప్‌ 15గా వచ్చినప్పుడే రెండేళ్లకు గాను సో నీ కాంట్రాక్టు కుదుర్చుకుంది. అది ఆగస్టుతో అయిపోతుంది. ఏదైనా ప్రైవేట్‌ షోలు చేయాలంటే కాంట్రాక్టు అడ్డువస్తుంది. దాని వల్ల సంగీత దర్శకులతో సంబంధాలు దెబ్బతింటాయి.

ఆర్కే: మీ కుటుంబంలో ఎవరైనా గాయకులున్నారా?
శ్రీరాం: ఎవరూలేరు. కాకపోతే మా తాతయ్యకు సంగీతమంటే ఇష్టం. నేను పాడటం విని ఎంతో ప్రోత్సహించారు. ఇంజనీరింగ్‌ చేసే రోజుల్లో పాటల పోటీలకు వెళ్లడం ప్రారంభించాను. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ వంటి సినిమాల్లో అవకాశం వచ్చింది. చిన్ననాటి నుంచే హిందీ సినిమాలన్నా, పాటలన్నా ఇష్టం. వాటితోనే కాలం గడిచిపోయేది. ఈ క్రమంలోనే ఐడల్‌ అవకాశం వచ్చింది.


ఆర్కే: మీది గమ్యం లేని ప్రయాణం అనిపించడం లేదా?
శ్రీరాం: వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే నాకు తెలుసు. గాయకుడిగా ఐడల్‌తో పేరు వచ్చింది. ఆ తరువాత దశ ఏమిటనేదే ఇప్పుడు నా అన్వేషణ .. ప్రస్తుతానికి చౌరస్తాలో నిలబడ్డాను. ఏదో ఒకదానిలోనే రాణించాలని నాకు లేదు. మొదటి ప్రాధాన్యం పాట.. ఆ తరువాత యాక్టింగ్‌..డాన్సింగ్‌..

ఆర్కే: ఇష్టమైన గాయకుడు?
శ్రీరాం: ఉత్తరాదిలో కిశోర్‌కుమార్‌... దక్షిణాదిలో ఘంటసాల, బాలు.

ఆర్కే: నటుడిగా మారడం ఎందుకు?
శ్రీరాం: చిన్నప్పటి నుంచీ హీరో కావాలని ఉండేది. ఐడల్‌ అయ్యాక కొన్ని స్ర్కిప్టులు విన్నాను. కాస్త కష్టమైన పనిని విభిన్నంగా చేసి నన్ను నేను నిరూపించుకోవాలని ఉండేది. 4 నెలల క్రితం భారవిగారు పిలిచి ‘శ్రీజగద్గురు ఆదిశంకర’లో అవకాశం ఇవ్వగా పాడాను. తర్వాత మళ్లీ పిలిపించి, సెకండ్‌ హీరోగా చేయమని అడిగారు. ‘అమరకుడు’ పాత్ర చాలెంజింగ్‌గా ఉండటంతో అంగీకరించాను.

ఆర్కే: హాలీవుడ్‌ విశేషాలు చెప్పండి?
శ్రీరాం: ఐడల్‌ అయ్యాక.. రెహునుమా పేరిట ప్రైవేట్‌ ఆల్బం విడుదల చేశాం. దానికి మంచి పేరొచ్చి.. జీనా అవార్డు కూడా గెలుచుకుంది. నార్నే-3 ఆసియా వెర్షన్‌కు అందులోని పాటను టైటిల్‌ చేస్తున్నారు.

ఆర్కే: జో జీతా వహీ సూపర్‌స్టార్‌ విశేషాలు చెప్పండి?
శ్రీరాం: స్టార్‌ ఫ్లస్‌ ఈ రియాల్టీ షో నిర్వహిస్తోంది. ప్రస్తుతం మొదటి నలుగురిలో ఒకడిగా ఉన్నా.

Updated Date - 2020-05-15T23:24:51+05:30 IST