మానసిక ప్రశాంతత కోసమే ఏసీ వాహనాలు
ABN , First Publish Date - 2020-05-19T23:07:41+05:30 IST
స్పోర్ట్స్ షాపుతో జీవనం ప్రారంభించిన నరసింహమూర్తి శర్మ.. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిగా ఎదిగారు. ద్రోణంరాజు సత్యనారాయణ, సుబ్బిరామిరెడ్డి.. ఇలాంటి పెద్దభక్తుల సహకారంతో పీఠాధిపతి అయ్యారు.
శంకరాచార్యులు, వివేకానందుడు తీవ్రవాదులే
జంతువుల చర్మాలపై కూర్చోవడానికి శాస్త్ర ప్రమాణం ఉంది
పవిత్రమైన స్వాములు తక్కువ... ముగ్గురు నలుగురే ఉంటారు
వేదం, సంస్కృతం, సంస్కారం నేర్పగలిగిన వారే నిజమైన గురువు
అలాంటివారు ఆంధ్రలో 90 శాతం లేరు.. ఇది వివాదమైనా సరే..
రిపోర్టర్లకు డబ్బులివ్వకపోతే ఇచ్చిన వార్త అది.. నేను వివరణ ఇచ్చా
ఆస్తులు ఎన్ని ఉన్నాయని.. నేను ఎప్పుడూ లెక్కపెట్టుకోలేదు..
తిరుమల విషయంలోనే.. నేను చిన్న జీయర్‌స్వామితో విభేదించా..
సుబ్బిరామిరెడ్డి పొగడ్తలకు లొంగిపోతారు.. అదే ఆయనలో బలహీనత
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో విశాఖ శారదా పీఠాధిపతి
స్పోర్ట్స్ షాపుతో జీవనం ప్రారంభించిన నరసింహమూర్తి శర్మ.. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిగా ఎదిగారు. ద్రోణంరాజు సత్యనారాయణ, సుబ్బిరామిరెడ్డి.. ఇలాంటి పెద్దభక్తుల సహకారంతో పీఠాధిపతి అయ్యారు. మానసిక ప్రశాంతత కోసమే ఏసీ వాహనాల్లో తిరుగుతానని ఆయన చెప్పుకొచ్చారు. డబ్బులివ్వకపోవడం వల్లే విలేఖరులు తనకు వ్యతిరేకంగా వార్తాకథనాలు రాశారన్నారు. తెలంగాణ విడిపోయినా నష్టం లేదని, విశాఖకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పుకొచ్చిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామితో 11-01-2010న జరిగిన ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’... వివరాలు...
ఆర్కే: మీ అసలుపేరు పొగరు నరసింహ పంతులు. (నరసింహమూర్తి శర్మ అంటూ స్వామి సరిచేశారు) అలాంటి దశనుంచి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతిగా ఎలా మారారు?
స్వరూపానందేంద్రస్వామి: మేం నలుగురు అన్నదమ్ములం, ఇద్దరు అక్కచెల్లెళ్లు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చాం. మా తల్లిదండ్రులు సాధువులు, సన్యాసులను తీసుకొచ్చి భోజనాలు పెట్టేవారు. వాళ్లని చూసి చూసి నేనూ అలవాటు పడ్డాను.
ఆర్కే: మీరు ఇంటర్ చదివి ఆపేశారు. మీ తండ్రి ఆయుర్వేద వైద్యుడు. ఆ వృత్తిలోకి వెళ్లకుండా స్పోర్ట్స్ షాపుపెట్టారు కదా. ఇదెందుకు వచ్చింది?
స్వరూపానందేంద్రస్వామి: మా తండ్రిగారిది ఆయుర్వేద వృత్తేగానీ, చిన్నాన్న గారిది స్పోర్ట్స్ వ్యాపారం. విశాఖలో బ్రిటిష్‌వారి కాలం నుంచి వైజాగ్ స్పోర్టింగ్స్టోర్స్ ఉండేది. అలా వచ్చింది. ఆయుర్వేదంతోనూ నాకు సంబంధం ఉంది. కొన్ని లేహ్యాలు తయారుచేయగలను.
ఆర్కే: మీరెందుకు స్వామి అయ్యారు?
స్వరూపానందేంద్రస్వామి: మా తండ్రిగారు అరసవెల్లి సూర్యభగవానుడి భక్తుడు. పురాణాల గురించి ఆయన చెబితే నేను వినేవాణ్ని. నేనున్న ప్రాంతంలో గంగాధరంగారనే యోగా గురువు ఉండేవారు. ఆయనవద్ద వశిష్ఠ రామాయణం, అద్వైత వేదాంతం వినడమే సంసారం వద్దు.. ఈ ప్రపంచం వద్దని వదిలిపెట్టడానికి కారణమైంది.
ఆర్కే: ఏ వయసులో వైరాగ్యం కలిగింది?
స్వరూపానందేంద్రస్వామి: 18 సంవత్సరాల వయసులో వైరాగ్యం వచ్చింది. సాయంత్రం కాలేజిలో ఇంటర్ చదువుతూనే స్పోర్ట్స్షాపు నడిపాను. దాన్ని 20 లోపే వదిలేశాను. 19-20 మధ్యలోనే ఇల్లొదిలిపెట్టాను. హృషికేశ్ బయల్దేరాను. అక్కడైతే చాలా ఆశ్రమాలుంటాయి, తిండికి, ఉండడానికి లోటుండదు, విద్య కూడా అబ్బుతుందని ఓ సాధువు చెబితే వెళ్లాను. నేను చదువుకున్నది కైలాసాశ్రమం. అక్కడ సంస్కృతం, వ్యాకరణం, తర్కం, వేదాంతం తొమ్మిదేళ్లు చదివాను. భగవంతుడు ప్రత్యక్షం కాలేదని.. హిమాలయాల్లో పాదయాత్ర చేశాను. కర్ణాటకలో సచ్చిదానందేంద్ర సరస్వతి వద్ద ఆత్మసాక్షాత్కారం కావడంతో సన్యాసం స్వీకరించి విశాఖ వచ్చాను.
ఆర్కే: చిన్న పాకలో ఆశ్రమాన్ని ప్రారంభించారు కదా. దానికి మీకు సహకరించినవాళ్లెవరు?
స్వరూపానందేంద్రస్వామి: అప్పట్లో మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. సముద్రం ఒడ్డున ఉంటే బాగుంటుందని వాళ్లు, యలమంచిలి దగ్గర మరికొందరు చూపించారు. దైవవశాత్తు నాకు చినముషిడివాడ దగ్గర స్థలం నచ్చింది. చిన్న గుడిసె వేసుకున్నా. ఇంత గొప్ప పీఠం అవుతుందనుకోలేదు.
నా దగ్గరకొచ్చాక చాలా అలవాట్లు మానేశారు
ఆర్కే: మీకు పేరు రావడానికి ద్రోణంరాజు సత్యనారాయణ తొలిమెట్టు అంటారు!
స్వరూపానందేంద్రస్వామి: ఆయన నాకు సహకరించడం నిజమే. కోదండరామిరెడ్డిగారనే ఐఏఎస్ అధికారి ఉండేవారు. అలాంటివాళ్లు ఎవరొచ్చినా ద్రోణంరాజు సత్యనారాయణగారు.. స్వామివారు గొప్పవారు, చూసి దర్శించి వెళ్లండని చెప్పేవారు. ద్రోణంరాజు గారికి భక్తితత్వాలు తక్కువ. నా దగ్గరకొచ్చాక చాలా అలవాట్లు మానేశారు.
ఆర్కే: ద్రోణంరాజు చాలా సరదా మనిషి. అలాంటాయన మీలో ఏంచూసి ప్రమోట్ చేశారు?
స్వరూపానందేంద్రస్వామి: అందరికీ ఎప్పుడూ భావాలు మారుతుంటాయి. ఆయనలాంటి చాలామందిని నేను మార్చాను. ఉదాహరణకు మీరే ఉన్నారు.. ఇంకో స్వామీజీ ఉండి, మీరు బూటుకాళ్లతో ప్రశ్నలేస్తే వాళ్లు ఒప్పుకోరు. కానీ నేను వాళ్ల సహజ ప్రవృత్తిని కాదనను. వాళ్లతో ప్రేమగా ఉండి ఐక్యం అయిపోతాను. ఆ ప్రేమలో నేనేం చెప్పినా వింటారు.
ఆర్కే: పావుకోళ్లు నిషిద్ధం కానపుడు పాదరక్షలు వేసుకుంటే తప్పేంటి?
స్వరూపానందేంద్రస్వామి: చాలా తేడా ఉంది. ఇది కలపతో చేసిన పాదరక్ష. దీనికి శాస్త్ర ప్రమాణం ఉంది. అది జంతువు తోలుతో చేసినది. అందులో జీవహింస, ఇందులో పవిత్రత ఉన్నాయి.
ఆర్కే: ఈ మాట అన్న స్వాములంతా పులిచర్మాలమీదో, జింకచర్మాల మీదోకూర్చుంటారు. దాన్నెలా సమర్ధించుకుంటారు?
స్వరూపానందేంద్రస్వామి: దానికి శాస్త్రప్రమాణం ఉంది. జీవం చనిపోయిన తర్వాత దాని తోలుతీసి వేసుకుంటారు తప్ప బతికున్న జీవాన్ని చంపి వేసుకోవాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు.
ఆర్కే: మీరు విశాఖలో ఉన్నప్పుడు సెయిల్ రామ్మూరి అండగా నిలబడ్డారు. కానీ తర్వాత ఆయన్ని ఎందుకు దూరం పెట్టారు?
స్వరూపానందేంద్రస్వామి: రాబోయే తరం స్వాములు, పీఠాధిపతులకు కావాల్సిన సందేశం దీనిద్వారా ఇవ్వచ్చు. నేను ఆయన కుటుంబాన్ని కూడా పదేళ్లు ఆదరించాను. వాళ్లు మఠంలోనే జీవనం గడిపారు.
ఆర్కే: కానీ, వారి వాదన ఏంటంటే.. మిమ్మల్నే వాళ్లు ఆర్థికంగా ఆదుకున్నామంటున్నారు.
స్వరూపానందేంద్రస్వామి: వాళ్లెవరూ ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. ప్రజలే పెంచారు. వాళ్లే మఠంలో భోజనం చేసి, మఠానికి సేవచేశారు. దానికి కృతజ్ఞతగా.. వాళ్ల కొడుకుల్లో ఇద్దరికి నేనే ఉద్యోగాలిప్పించి, పెళ్లిళ్లు చేశాను. మూడో కొడుకును వారసుడిగా చేయాలనుకుని ఆరేళ్లపాటు లక్షలుపెట్టి చదివించాను. వారు ఆఖరుకు నాలో లోపం ఎంచారు. వాళ్లని పట్టించుకోవట్లేదని అనుమానం పెరిగి వాళ్లే వదిలేశారు. నేను మాత్రం వాళ్లు రావాలనే ఇప్పటికీ కోరుకుంటున్నాను.
స్వాములు ఆదర్శంగా ఉండాలి కదా
ఆర్కే: స్వాములు ఆదర్శంగా ఉండాలి కదా.. పీఠాధిపతులకు పెద్ద కాన్వాయ్, బెంజి లాంటి ఖరీదైన కార్లు ఉంటున్నాయేంటి?
స్వరూపానందేంద్రస్వామి: మా దగ్గరకు చాలామంది భక్తులు వస్తుంటారు. వాళ్లే తిరగడానికి కార్లిస్తారు. స్వాములకు కూడా షుగర్, బీపీ ఉంటాయి. మీరు పిలిస్తే విమానంలో వచ్చాను. అది తప్పంటే కుదరదు కదా. ఎయిర్‌పోర్టు నుంచి ఏసీ కార్లోనే వచ్చాను. మనసు ప్రశాంతంగా లేకపోతే ఎవరికైనా ఏమైనా చెప్పాలన్నా, భగవత్ స్వరూపం వివరించాలన్నా కుదరదు. తిరిగే కారు ఒక్కటే చూస్తున్నారు. నిద్రపోయే మంచం, తినే తిండి, ధరించే వస్త్రం అన్నీ చూస్తే అర్థమవుతుంది. భార్యాభర్తలున్నవాళ్లూ స్వాములే అంటున్నా.. సమాజం వారిని వ్యతిరేకించట్లేదు. పరస్పరం భావయంతః అని ప్రజల్ని వాళ్లు, వాళ్లని ప్రజలూ మోసం చేస్తున్నారు.
ఆర్కే: స్వాములు లైంగికవాంఛలను ఎలా జయిస్తారని సగటు మనిషికి సందేహం.
స్వరూపానందేంద్రస్వామి: సాధన చేస్తున్నపుడు కొంతవరకు మనసు చంచలమవుతుంది. కానీ, దొరికే గురువు, విద్య, విల్‌పవర్ బాగుంటే మనసు నిలబడిపోతుంది. గురూపదేశం, కరడుగట్టిన భావన ఉంటే తప్పుడు ఆలోచనలు రావు.
ఆర్కే: మీ గురించి తెలియక మీపట్ల ఎవరైనా ఆకర్షితులై ఉండచ్చు కదా..
స్వరూపానందేంద్రస్వామి: ప్రపంచంలో చాలా ప్రలోభాలు ఉంటాయి. స్వాములు తప్పటడుగు వేయడం ఒకటి, వాళ్లతో తప్పటడుగులు వేయించే పద్ధతి మరొకటి. అలాంటి అనుభవం నాకు రాలేదు. నేనంత అవకాశం ఇవ్వను. భార్యాభర్తలొస్తే భర్తతోనే ఎక్కువ మాట్లాడతాను. ఆమెతో మాట్లాడినా అమ్మా.. అని పలకరిస్తాను. దాంతోనే తగ్గిపోవాలి. ఆ చాన్సు ఎవరికీ రానివ్వలేదు.
ఆర్కే: మీ ఎదుగుదలకు సహకరించిన వారెవరు?
స్వరూపానందేంద్రస్వామి: సుబ్బిరామిరెడ్డి, ద్రోణంరాజు సత్యనారాయణ, రావూరి ఈశ్వరరావు మరికొందరు. నా ఎదుగుదలకు మొదట పునాది వేసిన వ్యక్తి ఈశ్వరరావుగారే. చాలా మంచి వ్యక్తి. ధర్మప్రచారాలకు ఉపయోగించే ప్రచారరథాన్ని సమకూర్చింది కూడా ఆయనే.
ఆర్కే: మీ వేదపాఠశాలలో బోధించడానికి వేదం తెలిసినవాళ్లే లేరని కదా.. విలేఖరులు వార్త రాసింది?
స్వరూపానందేంద్రస్వామి: నేను ఆంధ్రావాళ్లను ఎవరినీ గురువులుగా పెట్టలేదు. వారు కర్ణాటకలోని మత్తూరుకు చెందినవారు. వేదం, సంస్కృతం, సంస్కారం నేర్పగలిగిన వారే నిజమైన గురువని నేను నమ్ముతాను. అలాంటివారు ఆంధ్రలో 90 శాతం లేరు. ఇది వివాదమైనా మంచిదే. మీడియా పుణ్యాన మళ్లీ ఫోకస్‌లోకి వస్తాం.
ఆర్కే: మీకు సంపన్నస్వామి అన్న పేరుంది. నిజంగా సంభావనలతోనే ఆశ్రమాన్ని నిర్వహిస్తుంటే.. ఇదెలా సాధ్యం?
స్వరూపానందేంద్రస్వామి: నేను మీరన్నట్టుగా భక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే.. ఈ 14 ఏళ్లలో నేను వైదికంగా, సంప్రదాయికంగా ఎదగలేను. నాకు డబ్బు మీద ఎప్పుడూ దృష్టి లేదు. డబ్బులిచ్చేవారు ఎప్పుడైనా చాలా తెలివైనవాళ్లు. వారు ఇచ్చేది ఏ దృష్టితో ఇచ్చినా.. రేపు స్వామీజీ డబ్బు మనిషని ప్రచారం చేస్తారు. నాకైతే ఇప్పటివరకు అలాంటి పేరు లేదు.
రిపోర్టర్లకు డబ్బులివ్వకపోతే ఇచ్చిన వార్త
ఆర్కే: ఆశ్రమ భూమిని ఆక్రమించారన్న ఆరోపణలపై మీ సమాధానం?
స్వరూపానందేంద్రస్వామి: రిపోర్టర్లకు డబ్బులివ్వకపోతే ఇచ్చిన వార్త ఇది. నేను ఇల్లు కట్టుకుని సంసారం చేయడానికి ఆ భూమి తీసుకోలేదు. ఆ భూమికి సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో దానిపై కథనం వచ్చినప్పుడు నేను వివరణ కూడా ఇచ్చాను. ఒక ఆధ్యాత్మిక సంస్థను నడపాలంటే ముందు మేం నిజాయితీగా ఉండాలి. విలేఖరులూ సాయం చేయాలి. వారు డబ్బులకు ఆశపడితే మేం ఇబ్బందులు పడతాం.
ఆర్కే: శారదాపీఠం మొత్తం ఆస్తుల విలువ ఎంత?
స్వరూపానందేంద్రస్వామి: వచ్చిన డబ్బులతో ఎప్పటికిప్పుడు భవనాలు కట్టుకుంటూ పోవడం తప్ప ఎన్ని ఆస్తులున్నాయో నేను ఎప్పుడూ చూడలేదు. ప్రతి సంవత్సరం ఆడిటింగ్ జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో భక్తులు నిర్మాణసామగ్రి ఇస్తుంటారు. కొన్ని భవంతులు వారే నిర్మించి ఇస్తామంటారు. నేను ఆస్తులెన్నని ఎప్పుడూ లెక్కపెట్టుకోలేదు.
ఆర్కే: స్వాములు, మఠాధిపతులే ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. స్వాములే ఇలా చేయడం సబబేనా?
స్వరూపానందేంద్రస్వామి: రాగద్వేషాలున్న మాట నిజం. అలా రాగద్వేషాలకు పూర్తిగా లోనైనవారిలో ఆ పవిత్రత తగ్గిపోయినట్టే. అప్పుడప్పుడూ రాగద్వేషాలకు లోనుకావడం సహజమే. మీరు స్వాములు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను.. ఆంధ్రలో నిజమైన, పవిత్రమైన స్వాములు ముగ్గురు, నలుగురో మాత్రమే ఉంటారు.
ఆర్కే: మీరు తిరుమల కొండ మీద స్థలం ఎందుకు తీసుకున్నారు? వైష్ణవధర్మాన్ని ఆచరించరు కదా?
స్వరూపానందేంద్రస్వామి: చాలామంది మా సంప్రదాయం శైవం అనుకుంటారు. శైవం వేరు వైష్ణవం వేరు. నిజానికి మాది అద్వైతం. శంకరాచార్యులు అద్వైతులు. భగవంతుడు సర్వాంతర్యామి.. అద్వైత స్వరూపుడని చెప్పే మతం మాది. కొండ మీద శృంగేరి, కంచి పీఠాలతోపాటు అన్ని అద్వైతపీఠాలకు స్థలాలున్నాయి. వారితోపాటే నాకూ.
ఆర్కే: స్వాములు ఏదో మహిమ ప్రదర్శిస్తారు. మీలో ఏం మహిమలున్నాయి?
స్వరూపానందేంద్రస్వామి: నేను వేదం, పురాణాలు తప్ప మహిమలను నమ్మను. అష్టసిద్ధులు ఇప్పుడు లేవు. నాకు కమ్యూనిస్టు భావాలున్నాయి. మూఢనమ్మకాలు నమ్మను. ఒక రకంగా శంకరాచార్యులు, వివేకానందుడు తీవ్రవాదులే. వారు లేకుంటే ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదు.
ఆర్కే: ప్రముఖులను విమర్శించడం ద్వారా ఎదగాలని కోరుకుంటారని మీపై అపవాదు ఉంది?
స్వరూపానందేంద్రస్వామి: ఏ విషయం మీదైనా స్పందించడం నా అలవాటు. వైఎస్ సీఎంగా ఉన్నపుడు 2004-2005 మధ్య హిందూమతం ప్రమాదంలో పడింది. అపుడు భూముల గురించి నేను ఉద్యమించాను. అందులో నా ధైర్యాన్ని చూడాలి కానీ..పేరు కోసమే చేస్తున్నాననుకుంటే ఏం చేయను.
చిన్న జీయర్‌స్వామితో విభేదాలు
ఆర్కే: చిన్న జీయర్‌స్వామితో విభేదాలు ఎందుకొచ్చాయి?
స్వరూపానందేంద్రస్వామి: ఆయన మొత్తం తిరుమల వ్యవస్థనే తన చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. తిరుమల వెంకన్న నా దేవుడనేంతగా రాగద్వేషాలకు లోనయ్యారు. శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని చొప్పిద్దామని ప్రయత్నించారు. దాన్ని అర్చకులు వ్యతిరేకించారు. నేను అర్చకులకు వెన్నుదన్నుగా నిలిచాను.
ఆర్కే: మీ శిష్యాగ్రేసరుడు సుబ్బిరామిరెడ్డి గురించి మీ అభిప్రాయం?
స్వరూపానందేంద్రస్వామి: ఆయనకు దైవభక్తి చాలా ఎక్కువ. ఆధ్యాత్మికపరుడు. అంత పారిశ్రామికవేత్త అయినా.. అన్ని పదవుల్లో ఉన్నా రోజూ రెండుగంటలు పూజలకే సమయం వెచ్చిస్తారు ఆయనకూ నాలాగే మహిమలంటే పడవు. పొగడ్తకు లొంగిపోతారు. అదొక్కటే నేను ఆయనలో గుర్తించిన బలహీనత.
ఆర్కే: రాష్ట్ర భవిష్యత్తు ఏమిటి? సమైక్యంగా ఉంటుందా? విడిపోతుందా?
స్వరూపానందేంద్రస్వామి: నాకు తెలంగాణ, ఆంధ్రల్లో కూడా భక్తులున్నారు. తెలంగాణ విడిపోయినా నష్టం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.
ఆర్కే: తెలంగాణ విడిపోతే.. ఉత్తరాంధ్ర వేరే రాష్ట్రంగా ఉంటే బావుంటుందనా?
స్వరూపానందేంద్రస్వామి: ద్రోణంరాజు బతికున్నప్పుడే పీఠానికి విశాఖ శారదాపీఠం అని పేరుపెట్టాను. పీఠం పెందుర్తిలో ఉంది కదా.. పెందుర్తి శారదాపీఠం అని పేరు పెట్టాలని ద్రోణంరాజు అన్నారు. నేను నవ్వి ఊరుకున్నాను. ఆయనే ఓ సభలో ఆ రోజు స్వామివారు విశాఖ శారదాపీఠం అని పేరుపెడితే ఎందుకో అనుకున్నాను. ఇప్పుడు గ్రేటర్ విశాఖలో కలిసిపోయింది. ఇప్పుడా పేరు సార్థకమైందని అన్నారు. విశాఖ నగరానికి మంచి భవిష్యత్ ఉంది.
ఆర్కే: కేసీఆర్ కూడా మీ ముఖ్యశిష్యుల్లో ఒకరు. ఆయనను నొప్పించకూడదని తెలంగాణకు అనుకూలం అంటున్నారా?
స్వరూపానందేంద్రస్వామి: నాకంత లౌక్యం లేదు. ఉన్నదే మాట్లాడాను తప్ప. వేరే కాదు. నేను అనుకున్నది.. నాకనిపించింది చెప్పానంతే.
ఆర్కే: స్వాములు అంటరానితనం పాటిస్తారని విన్నాను?
స్వరూపానందేంద్రస్వామి: అంటరానితనం మహాపాపం. పురాణాల్లోనూ, వేదాల్లోనూ ఆ ప్రస్తావన ఎక్కడా లేదు.