రానా, చరణ్‌, బన్నీ.. స్కూలుకు వెళ్లే టైమ్ నుంచే తెలుసు

ABN , First Publish Date - 2020-05-19T23:27:22+05:30 IST

అమ్మ చెప్పేసిందా.. అది చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే వదల్లేను. మొన్న పోటీలో రేడియో జాకీగా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఎవరికీ తెలియని విషయాలు చెప్పాలంటే..

రానా, చరణ్‌, బన్నీ.. స్కూలుకు వెళ్లే టైమ్ నుంచే తెలుసు

డిజైనర్లలో చాలామంది స్వలింగ సంపర్కులే: మోడల్‌ వాసుకి

సెరిలాక్‌ చాలా ఇష్టం... ఇప్పటికీ నోట్లో వేలేసుకుని నిద్రపోతా

సినిమాలకు నా అంతట నేను వెళ్లను.. వాళ్లు పిలిస్తే అప్పుడు చూద్దాం

ఆరేడుగురు పెళ్లి ప్రపోజల్ చేశారు.. అప్పుడే వద్దన్నా

రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా.. వాళ్లను కలిశా..

ఏపీ రాజకీయాల్లో ఆమెకు ఎక్కువ మార్కులేస్తా..

25-07-2011న జరిగిన ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో సుంకవల్లి వాసుకి


ఆర్కే: నువ్వు చిన్నపిల్లవా.. పెద్ద అమ్మాయివా? సెరిలాక్‌ ఎందుకు తింటావు?

సుంకవల్లి వాసుకి: అమ్మ చెప్పేసిందా.. అది చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే వదల్లేను. మొన్న పోటీలో రేడియో జాకీగా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఎవరికీ తెలియని విషయాలు చెప్పాలంటే.. నిద్రపోయేటప్పుడు నోట్లో వేలు వేసుకుంటానని చెప్పాను. అది ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. ఫైనల్స్‌లో కొంత నెర్వస్‌గా ఉంది గానీ, అదీ మంచిదే. అది ఉండటం వల్ల అతివిశ్వాసం దూరమవుతుంది. దేవుణ్ని తలుచుకుని తొలిసారి వేదిక ఎక్కా. నాకు మతంలో నమ్మకం లేదు. పెళ్లి విషయంలోనైనా అంతే.


ఆర్కే: మోడలింగ్‌ ఆలోచన ఎలా వచ్చింది?

సుంకవల్లి వాసుకి: పుణెలో లా చదివేటప్పుడు సెలవుల్లో ఢిల్లీ వెళ్లేదాన్ని. అప్పుడు 18-19 ఏళ్ల వయసు. ఫ్యాషన్‌ ప్రపంచం వాళ్లు నన్ను చూసి అడిగారు. కుదరదని చెప్పా. 22 ఏళ్లకు లా పూర్తయ్యాక, మాస్టర్స్‌ చేయడానికి ఢిల్లీ వెళ్లిపోయాను. అప్పుడు మోడలింగ్‌కు సరే అన్నా. బహుశా నా పొడవు, సన్నం, డస్కీకలర్‌ చూసి ఎంచుకుని ఉంటారు.


ఆర్కే: మొదటి పారితోషికం ఏం చేశావు?

సుంకవల్లి వాసుకి: తొలిసారి 13 వేలు వచ్చింది. నాన్న, నాయనమ్మలకు గిఫ్టులు కొన్నా. అమ్మకు మాత్రం డబ్బులిచ్చేశాను. ఈమధ్య వాచీ ఇచ్చినా పైకి ఏమీ అనలేదు. అమ్మానాన్నలు ఎప్పుడూ నన్ను అందంగా ఉన్నావనలేదు. లావుగా ఉన్నానని అమ్మ తిట్టేది.


ఆర్కే: అయామ్‌ షీ పోటీలో స్టేజి మీద ఎలా అనిపించింది?

సుంకవల్లి వాసుకి: ఈ షోలో మన దేశంలో మొదటిసారిగా బికినీ రౌండ్‌ ఉంది. దాన్ని మా కుటుంబసభ్యులంతా చూశారు. అది కూడా మంచిదే అయ్యింది. ఎందుకంటే, మిస్‌ యూనివర్స్‌లో తప్పదు. దానికి ఇప్పుడే ప్రాక్టీసు అయినట్లనిపించింది.


ఆర్కే: ప్రశ్నల రౌండ్‌ కూడా ఉంటుంది కదా?

సుంకవల్లి వాసుకి: రెండు మూడు సార్లుగా మాకు ఈ రౌండ్‌ వచ్చింది. చివరిసారి అందరికీ ఒకే ప్రశ్న. పోటీ పేరు ‘అయామ్‌ షీ’. అందులో మనమేంటో చెప్పాలి. వాసుకి అనేది పేరు, లాయర్‌ అనేది వృత్తి. కాబట్టి అవి చెప్పకూడదు. నేను చాలా ఫ్రీగా ఉండే వ్యక్తినని చెప్పాను. ఎలాంటి శషభిషలు లేవన్నాను. ఏదైనా తప్పుచేస్తే.. తప్పేనని చెప్పేస్తానన్నాను. బాగా మొండిపిల్లని. నేను కరెక్ట్‌ అనుకుంటే చెబుతాను. కొన్నిసార్లు కన్విన్స్‌ అవుతాను కూడా. మతం మారను, పెళ్లయినవాడిని పెళ్లి చేసుకోను. చాలామంది బాలీవుడ్‌కు వెళ్తావా అని అడుగుతున్నారు. ఇప్పుడైతే బాలీవుడ్‌కు గానీ, టాలీవుడ్‌కు గానీ వెళ్లడానికి ప్రయత్నించడం లేదు. ఆఫర్‌ వస్తే అప్పుడు ఆలోచిస్తాను. నా అంతట నేను మాత్రం వెళ్లను.


ఆర్కే: మీది బాగా సంప్రదాయ కుటుంబం కదా. మోడలింగ్‌కు అభ్యంతరం రాలేదా? 

సుంకవల్లి వాసుకి: నాయనమ్మ, తాతగారితో దీనిగురించి మాట్లాడలేదు. అమ్మానాన్నలు చాలా ప్రోగ్రెసివ్‌గా ఉంటారు. నాన్నగారికి కొంత భయం ఉన్నా.. ఆయనకు అన్నీ చెప్పాను. రెండేళ్లు మోడలింగ్‌ చేశాక న్యూయార్క్‌ వెళ్లిపోయి మళ్లీ లా చేశాను.


ఆర్కే: మోడలింగ్‌లో సెక్సువల్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌ లేదా?

సుంకవల్లి వాసుకి: డిజైనర్లలో చాలామంది స్వలింగ సంపర్కులే. మోడళ్ల దుస్తులు, అలవాట్లు చూసి అలాంటి అభిప్రాయం ఉంటుంది గానీ, నా మొత్తం కెరీర్‌లో ఎప్పుడూ అలాంటి బాధ రాలేదు. సినీ పరిశ్రమలో తప్పదేమో గానీ, అక్కడ లేదు.


ఆర్కే: మోడలింగ్‌ నుంచి మిస్‌ యూనివర్స్‌కు వెళ్లినప్పుడు ఎలా అనిపించింది?

సుంకవల్లి వాసుకి: అవకాశం రాగానే ఒకటే అనుకున్నా. ‘వాసుకీ.. నువ్వు గెలిచి తీరుతావు’ అలా 15 రోజుల పాటు రోజూ నాకు నేను చెప్పుకొనేదాన్ని. మనకు ఆ దృష్టి ఉంటే.. గెలిచే అవకాశాలు కూడా పెరుగుతాయి.ఆర్కే: ఈ పోటీలకు ప్రమాణాలేంటి?

సుంకవల్లి వాసుకి: ముందుగా మనకు మన శరీరం గురించిన ఆత్మవిశ్వాసం ఉండాలి. చాలామంది ముఖం అందంగా ఉంటే చాలనుకుంటారు. కానీ అది తప్పు. అదొక్కటే చాలదు. ఇలాంటి పోటీకి వెళ్తున్నామంటే దేశానికి ప్రాతినిధ్యం వహించాలి. అంటే, ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉండాలి. చాలామంది భారతీయ అమ్మాయిలకు అది ఉండదు.


ఆర్కే: అంటే, అందం ఒక్కటే ప్రామాణికం కాదన్నమాట.

సుంకవల్లి వాసుకి: ముఖానికి సంబంధించిన అందం ఒక్కటే కాదు. నిజంగా చెప్పాలంటే నేను అంత అందమైనదాన్ని కాదు. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఇంకా.. కొందరైతే అసలు నేను భారతీయురాలినని కూడా అనుకోరు. నా స్నేహితుల్లో కొందరు చెప్పేదే కొంచెం మర్యాదగా చెప్పొచ్చు కదా అంటారు. అదింకా నేర్చుకోవాలి. నేను కుండబద్దలు కొట్టినట్లే మాట్లాడతా. కానీ అది పొగరు కాదు. పైకి కనిపిస్తా గానీ, మనసు అలాంటిది కాదు. ఆ విషయం మాట్లాడితే తెలుస్తుంది.


ఆర్కే: సినీ పరిశ్రమలో స్నేహితులున్నారా?

సుంకవల్లి వాసుకి: చాలామంది ఉన్నారు. రానా, చరణ్‌, బన్నీ.. వీళ్లంతా సినిమాలు మొదలుపెట్టక ముందే తెలుసు. స్కూలుకు వెళ్లే వయసు నుంచి తెలుసు. బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరూ ఇంకా దొరకలేదు. ఎవరైనా ఏమైనా అడిగితే చెబుతాను గానీ, నా అంతట చెప్పను.


ఆర్కే: హైదరాబాద్‌ నుంచి న్యూయార్క్‌ వరకు ఎవరూ ప్రపోజ్‌ చేయలేదా?

సుంకవల్లి వాసుకి: కొందరు అడిగారు. నేనెప్పుడూ లెక్కపెట్టుకోలేదు గానీ, దాదాపు ఆరేడుగురు పెళ్లి చేసుకుంటామని అడిగి ఉంటారు. 19 ఏళ్ల వయసులో తొలిసారి అడిగారు. ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నన్ను చేసుకునేవాడికి నిజాయితీ ఉండాలి.


ఆర్కే: అయామ్‌ షీలో నెగ్గగానే ఎవరికి చెప్పావు?

సుంకవల్లి వాసుకి: మొట్టమొదట నాన్నకి. చుట్టూ మ్యూజిక్‌ అంతా వినిపిస్తున్నా.. ఆయన సంతోషం పట్టలేక గట్టిగా అరిచారు. వెంటనే ఫోన్‌ పెట్టేయమన్నారు. ఆయన అందరికీ చెప్పుకోవాలి. అమ్మ అప్పుడు ఇంట్లో లేదు. తనకి చెప్పినా నా దగ్గర స్పందించదు. బయట వాళ్ల దగ్గర నా గురించి చాలా చెబుతుంది.


ఆర్కే: ఇప్పుడు సెలబ్రిటీ స్థాయికి వచ్చేశావు కదూ?

సుంకవల్లి వాసుకి: నన్ను నేను సెలబ్రిటీ అనుకోవట్లేదు గానీ.. అవుతానేమో. మిస్‌ యూనివర్స్‌లో నెగ్గుతానన్న విశ్వాసం ఉంది. అలాగని దేవుడి మీదే వదిలేయను. మన ప్రయత్నం మనం తప్పక చేయాల్సిందే. నేను బాగా ఆలోచిస్తానని, మంచి ఆత్మవిశ్వాసం ఉందని తమ్ముడు అభి అనుకుంటాడు. వాడక్కడ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తాడు.


ఆర్కే: రాజకీయాల గురించి...

సుంకవల్లి వాసుకి: నాకు ఎప్పటినుంచో ఆసక్తి ఉంది. అంటే కేవలం తెలుసుకోవడమే కాదు.. వాటిలోకి రావాలని కూడా అనుకుంటున్నాను. పత్రికలు చదివి ఇక్కడి విషయాలు తెలుసుకుంటున్నాను. ఎస్‌ఎం కృష్ణ, మణిశంకర్‌ అయ్యర్‌ లాంటి వాళ్లను కలిశాను గానీ, ఇక్కడివాళ్లు.. అక్కడివాళ్లు వేరు. వీళ్లను అంత తొందరగా కలవలేం. నా వరకు ఆదర్శవంతంగా ఉండాలని అనుకుంటాను. సేవ చేయడంలో ఆనందం ఉంటుంది. మానవహక్కుల న్యాయవాదిగా కూడా చేయొచ్చు. అందాలరాణులు రాజకీయాల్లోకి రాకూడదని కూడా లేదు. నేనే మొదటిదాన్ని అవుతానేమో. మన రాష్ట్ర నాయకుల్లో పురందేశ్వరికి ఎక్కువ మార్కులిస్తాను.


ఆర్కే: జీవితంలో బాగా నిరుత్సాహం కలిగించింది ఏంటి?

సుంకవల్లి వాసుకి: చిన్న చిన్నవే గానీ.. బాగా ఇబ్బంది పెట్టినవి, నిరుత్సాహపరిచినవి మాత్రం ఏమీ లేవు. ఐస్‌క్రీంలు అంటే ఇష్టం గానీ, రెండు వారాల గ్రూమింగ్‌ సమయంలో అవి అందక చాలా ఇబ్బంది పడ్డాను.


ఆర్కే: వాసుకి మిస్‌ యూనివర్స్‌గా తిరిగి రావాలని కోరుకుందాం.. ఆల్‌ ద బెస్ట్‌.

Updated Date - 2020-05-19T23:27:22+05:30 IST