మారిషస్‌లో తెలుగు బాంధవుడు

ABN , First Publish Date - 2021-06-10T10:12:25+05:30 IST

మారిషస్ దేశానికి పదేళ్ళపాటు అధ్యక్షుడుగానూ, పద్దెనిమిదేళ్లపాటు ప్రధాన మంత్రిగాను పనిచేసిన సర్ అనిరుధ్‌ జగన్నాథ్ జూన్ 3న తమ 91వ ఏట పరమపదించారు. 1930 మార్చ్ 29న ఒక యాదవ కుటుంబంలో ఆయన జన్మించారు. ఈ కుటుంబం 1850ల్లో బిహారులోని అత్లిపురా గ్రామం నుంచి మారిషస్‌కు వ్యవసాయ కూలీలుగా వలస వెళ్ళింది.

మారిషస్‌లో తెలుగు బాంధవుడు

మారిషస్ దేశానికి పదేళ్ళపాటు అధ్యక్షుడుగానూ, పద్దెనిమిదేళ్లపాటు ప్రధాన మంత్రిగాను పనిచేసిన సర్ అనిరుధ్‌ జగన్నాథ్ జూన్ 3న తమ 91వ ఏట పరమపదించారు. 1930 మార్చ్ 29న ఒక యాదవ కుటుంబంలో ఆయన జన్మించారు. ఈ కుటుంబం 1850ల్లో బిహారులోని అత్లిపురా గ్రామం నుంచి మారిషస్‌కు వ్యవసాయ కూలీలుగా వలస వెళ్ళింది. చెరకు తోటల్లోని కార్మికుడి కుమారుడైన అనిరుధ్‌ జగన్నాథ్ మారిషస్ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగి, ఆధునిక మారిషస్ నిర్మాతగా చరిత్రకెక్కారు. 'మిలిటెంట్ సోషలిస్ట్ మూమెంట్ పార్టీ'ని స్థాపించి, మారిషస్ రాజకీయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ అనిరుధ్‌ జగన్నాథ్ గారి కుమారుడే. 


అనిరుధ్‌ జగన్నాథ్‌కు తమ పూర్వీకుల జన్మభూమి అయిన భారతదేశమంటే అమితమైన ప్రేమాభిమానాలుండేవి. భారత్ – మారిషస్ దేశాల మైత్రీ బంధానికి ఆయన బంగారు బాటలు వేశారు. ఆయన నేత్ర చికిత్సకు హైదరాబాద్‍లోని ఎల్.వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూటును ఎంపిక చేసుకున్నారు.మారిషస్ ‘మినీ భారతదేశం’ వంటిది. భారతదేశంలోని వివిధ భాషలు, సంస్కృతుల వారు ఆ దేశంలో నివసిస్తున్నారు. భారతీయ భాషలకు మారిషస్ ప్రభుత్వం ప్రోత్సాహమిచ్చింది. మారిషస్ జాతిపిత, అప్పటి ప్రధాన మంత్రి సర్ శివసాగర్ రామ్ గులాం హయాంలో 1974లో ఆ దేశంలో ప్రపంచ హిందీ సమ్మేళనం జరిగింది. అప్పుడు విద్య, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేస్తున్న మా నాన్నగారు మండలి వెంకట కృష్ణారావు గారు, కేంద్ర విద్యామంత్రి డా. కరణ్ సింగ్ నాయకత్వాన భారత ప్రతినిధి వర్గంలో సభ్యుడిగా ఆ మహాసభలలో పాల్గొన్నారు. 


అనిరుధ్‌ జగన్నాథ్ నాయకత్వంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు 1980 డిసెంబర్ 10వ తేది నుంచి 13వ తేది వరకు మారిషస్‍లోని మోకా నగరంలో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూటులో ఘనంగా జరిగాయి. ఆ మహా సభలలో మా నాన్నగారు మండలి వెంకట కృష్ణారావు గారితో పాటు పాల్గొనే అవకాశం నాకూ లభించింది. విమానాశ్రయానికి మారిషస్ ఇంధన శాఖా మంత్రి మహేష్ ఉచ్చన్న వచ్చి, మాకు స్వాగతం పలికారు. ఆయన తెలుగువాడు కావడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. మేము అక్కడకు వెళ్ళిన 7వ తేది రాత్రి మహాత్మాగాంధీ ఆడిటోరియంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలకు గవర్నర్ జనరల్ శ్రీ వీరాస్వామి రింగడు, ప్రధాని అనిరుధ్‌ జగన్నాథ్ వచ్చి, మమ్మల్ని పరిచయం చేసుకున్నారు. వీరాస్వామి రింగడు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలస వెళ్ళిన తెలుగు వారి సంతతికి చెందిన వాడు కావడం మాకెంతో గర్వకారణమైంది.అనిరుధ్‌ జగన్నాథ్ సౌమ్యుడు, నిరాడంబరుడు. మా అందరితో ఎంతో సౌహార్ద్రంగా వ్యవహరించారు. ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభిస్తూ, ‘తెలుగు భాషా సంస్కృతుల అభ్యున్నతికి తమ దేశం పూర్తిగా తోడ్పాటునందిస్తుంద’ని తెలిపారు. మారిషస్‍లో హిందీ మాట్లాడే వారి తరువాతి స్థానం తెలుగువారిదేనని తెలిపారు. తెలుగు వారు జరుపుకునే, తెలుగు సంస్కృతికి దర్పణమైన ‘మహా రామ భజన’, ‘సింహాద్రి అప్పన్న పూజ’, ‘అమ్మోరి’ పండు గలకు ప్రభుత్వపరంగా సహకారమందిస్తామని చెప్పారు. దేవాలయాల నిర్మాణానికి సబ్సిడీలు, పండుగలకు ప్రోత్సాహకాలు, మాతృభాషల అధ్యయనానికి బోధనావకాశాలను కల్పించి, సంస్కృతీ పరిరక్షణకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. భారతీయ సంస్కృతి విశిష్టతలు ప్రపంచానికి చాటి చెప్పిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ తెలుగువాడు కావడం తెలుగువారి గొప్పదనానికి నిదర్శనమని కొనియాడారు. 


ఆశించిన రీతిలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాసభలకు తోడ్పాటు అందించకపోయినా, మారిషస్ ప్రభుత్వమే మొత్తం బరువు బాధ్యతలను తలకెత్తుకుని అపూర్వంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడానికి కారకుడు అనిరుధ్‌ జగన్నాథ్. 


మారిషస్‌‍లో ఏటా జరిగే తెలుగు పండుగలకు, ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలకు, జాతీయ నాటికల పోటీలకు స్వయంగా హాజరై, అనిరుధ్‌ జగన్నాథ్ తెలుగువారిని ఉత్తేజపరచేవారు. ఆంగ్ల లిపిలో రాసుకుని తెలుగులో ప్రసంగించే ప్రయత్నం చేసేవారు. 1981లో ‘మారిషస్ తెలుగు కల్చరల్ ట్రస్టు’ను ఏర్పాటు చేశారు. తెలుగు భవనం నిర్మించడానికి పది ఎకరాల స్థలం కేటాయించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా భక్తుడైన జగన్నాథ్ చాలాసార్లు పుట్టపర్తి వచ్చారు. 


అనిరుధ్‌ జగన్నాథ్ మరణం మారిషస్ తెలుగు వారితో పాటు యావత్ తెలుగు జాతిని దిగ్భ్రాంతి పరిచింది. భారత ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందజేసి, భారత సంతతికి చెందిన ఒక విదేశీ నేతను గౌరవించింది. ప్రస్తుత ప్రధాని ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ తన తండ్రి బాటలోనే మారిషస్‌లో తెలుగు భాషా, సంస్కృతుల వికాసానికి తోడ్పాటునందిస్తున్నారు. అనిరుధ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ తెలుగు జాతి పక్షాన ఆయనకు నివాళులర్పిస్తున్నాను.


డా. మండలి బుద్ధప్రసాద్

మాజీమంత్రి, మాజీ ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్


Updated Date - 2021-06-10T10:12:25+05:30 IST